వీఎస్కే విశ్వవిద్యాలయంలో సంఘటనలు బాధాకరం
సాక్షి, బళ్లారి : విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఇటీవల వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ల మధ్య చోటు చేసుకుంటున్న సంఘటనలు తనను ఎంతో బాధించాయని జిల్లా ఇన్ఛార్జి మంత్రి పరమేశ్వరనాయక్ అన్నారు. ఆయన గురువారం నగరంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. వీసీ, రిజస్ట్రార్ల మధ్య నడుస్తున్న సంఘటనలు విద్యార్థుల చదువులపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.
ఉన్నత విద్యావంతులుగా ఉన్న వ్యక్తులు ఒకరిపై ఒకరు దూషణలు చేసుకోవడం, ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. ఈ విషయంపై ఉన్నత విద్యాశాఖమంత్రితోపాటు రాష్ట్ర గవర్నర్కు ఫిర్యాదు చేస్తానన్నారు. వీలైనంత త్వరలో ఈ సమస్యకు చెక్పెట్టేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. రాష్ట్రంలోని కార్మికుల పిల్లలకు బాగా చదువుకునేందుకు వసతి గృహాలను ఏర్పాటు చేస్తామన్నారు.
ఐదు ప్రాంతాల్లో వసతి గృహాలు ఏర్పాటు చేసి, కార్మికులు పిల్లల బంగారు బాట వేస్తామన్నారు. రూ.5కోట్ల వ్యయంతో వసతి గృహాలు ఏర్పాటు చేస్తామని, ఇందుకు బళ్లారి, రాయచూరు జిల్లాలో పనులు ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో 100 కౌశల్య కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఒక్కోదానికి దాదాపు 2 కోట్లు ఖర్చవుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లాధికారి బిస్వాస్, ఎస్పీ చేతన్సింగ్ రాథోడ్, జెడ్పీ సీఈఓ మంజునాథ్నాయక్ తదితరులు పాల్గొన్నారు.