అన్నదాతలు కూలీలయ్యారు..
► నాడు పదులసంఖ్యలో పని కల్పించిన రైతులు
► నేడు పొట్టకూటి కోసం ఉపాధి పనుల్లో కూలీలుగా
► బోర్లున్నా నీళ్లు లేక బీళ్లుగా మారిన పొలాలు
► ఇదీ మొగసాలమర్రి కరువు రైతుల దీనగాథ
మొన్నటిదాకా పదుల సంఖ్యలో కూలీలకు పని కల్పించిన రైతులే ఇప్పుడు పొట్ట కూటి కోసం కూలీలు గా మారారు. ఉపాధి హామీ పథకం కింద కూలీలుగా పనిచేస్తున్నారు. పంటలు సాగు చేసేందుకు బోర్లలో నీళ్లులేక..కుటుంబాలను పోషించుకునేందుకు దారిలేక కూలీలుగా మారారు. బి.కొత్తకోట మండలంలోని మొగసాలమర్రిలో రైతుల జీవితాలను కరువు తిరగరాసింది. పరిస్థితులు తలకిందులై సేద్యం చేసిన చేతులు పొట్టకూటి కోసం కూలీ కూలీ పనులు చేస్తున్నాయి.
బి.కొత్తకోట : కరువు కాఠిన్యం ఎంతటివారినైనా అతలాకుతలం చేస్తుందనడానికి ప్రత్యక్ష నిదర్శనం బి.కొత్తకోట మండలంలోని మొగసాలమర్రి గ్రామం. గ్రామంలో 140 కుటుంబాలుండగా, వంద కుటుంబాలకు వ్యవసాయమే ఆధారం. ఒక్కో కుటుంబంలోని రైతులకు సగటున మూడు బోర్లున్నాయి. మొత్తం 300 బోర్లుంటాయి. వీటిలో ఒక్కబోరులోనూ నీళ్లు లేవు. భూగర్భజలాలు పూర్తిగా అడుగంటాయి. దీంతో పొలాలు బీళ్లుగా మారాయి.
మొన్నటిదాకా పదులసంఖ్యలో కూలీలకు పనికల్పించిన రైతులే ఇప్పుడు పొట్టకూటి కోసం కూలీలుగా మారారు. ఇక్కడి ఎగువచెరువులో ఉపాధి హామీ పథకం కింద మట్టిని తీసి పొలాలకు తరలించే పనులు జరుగుతున్నాయి. ఈ పనుల్లో గ్రామ రైతులంతా కూలీలుగా పనిచేస్తున్నారు. గ్రామంలో 100 రోజుల పనులు చేసిన రైతులకు మళ్లీ పనులు ఇవ్వడంలేదు. మిగిలిన రైతులు పనులు చేస్తున్నారు. ప్రస్తుతం రోజుకు 45మంది రైతులు పనిచేస్తున్నారు. -
ఆవులమ్మి..కూలీగా..
మొగసాలమర్రికి చెందిన రైతు సీ.వెంకటరమణారెడ్డికి 4.5ఎకరాల సేద్యం ఉంది. దీనికోసం 3బోర్లు వేయించాడు. ఒకబోరులో కొద్దిపాటి నీళ్లు వస్తుండడంతో కొంతపోలంలో పంటవేశాడు. నీళ్లు నిలిచిపోయి సేద్యం ఆగిపోయింది. కుటుంబాన్ని పోషించుకునేందుకు నాలుగు ఆవుల్లో రెండింటిని రూ.1.17లక్షలకు విక్రయించాడు. ఈ సొమ్ముతో బోర్లు వేసేందుకు చేసిన అప్పులు తీర్చాడు. అప్పు ఇంకా లక్ష మిగిలే ఉంది. ఇక దిక్కులేని పరిస్థితుల్లో భార్య, ఇద్దరు పిల్లలను పోషించుకునేందుకు మరోమార్గంలేక ఉపాధి కూలీగా మారాడు. చెరువులో మట్టితీసే పనులకు రోజూ కూలీగా వెళ్తున్నాడు. వెంకటరమణారెడ్డి కుమారుడు పనుల కోసం బెంగళూరుకు వలసవెళ్లాడు.
30 మందికి పని కల్పించిన రైతు ..
మొగసాలమర్రికి చెందిన వై.దేవేంద్రరెడ్డి మొన్నటి వరకు 30 మంది కూలీలకు పని కల్పించిన రైతు. తొమ్మిది ఎకరాల పొలంలో 35ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నాడు. సేద్యం తప్ప మరొకటి తెలియదు. అలాంటిది ఇప్పుడు ఉపాధి పనికి వెళ్తేగానీ కుటుంబం గడవని దుస్థితి. ఎగువచెరువుకింద నాలుగెకరాలు ఉన్న పెద్దరైతు ఇతనే. ఇదికాక బోర్లకింద ఐదెకరాల సేద్యం ఉంది. పంటలసాగు కోసం 2010నుంచి 8బోర్లు వేయించాడు. వీటీలో కొన్నింటిలో కొద్దిపాటి నీటితో సాగుచేస్తూ వచ్చాడు. ఇప్పుడు కరువు పరిస్థితులతో బోర్లన్నీ అడుగంటాయి. పంటలేదు. పొలాలన్నీ బీళ్లయ్యాయి. దీంతో ఒకసారిగా పరిస్థితులు తలకిందులయ్యాయి.
కుటుంబం గడవడమే ఇబ్బందికరంగా మారింది. ఇద్దరు కుమార్తెల చుదువు, కుటుంబాన్ని పోషించుకోవడం భారంగా మారింది. దీనికితోడు రూ.2లక్షల అప్పులు తీర్చేందుకు రెండు పశువులను రూ.40వేలకు విక్రయించాడు. చేతిలోచిల్లిగవ్వలేదు. ఇక కూలీకి వెళ్లడం తప్పనిసరి అయ్యింది. ప్రస్తుతం మొగసాలమర్రి సమీపంలోని ఎగువచెరువులో ఉపాధి హమీపథకం కింద జరుగుతున్న మట్టిపనుల్లో దేవేంద్రరెడ్డి దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. రోజుకు 30మందికి పని ఇచ్చిన తాననే కూలీగా మార్చింది కరువేనని మాటలకందని ఆవేదనను ఆయన వ్యక్తం చేశారు.