సమగ్ర అభివృద్ధి కోసమే ‘గ్రామజ్యోతి’
- మంత్రి కేటీఆర్
ఈనెల 17 నుంచి 23 వరకు కార్యక్రమాలు
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ తెలంగాణ రూపురేఖలను సమూలంగా మార్చేందుకే ప్రభుత్వం గ్రామజ్యోతి కార్యక్రమాన్ని చేపట్టిందని, పారిశుద్ధ్య వారోత్సవాలతో ఈ కార్యక్రమానికి ఈనెల 17న శ్రీకారం చుట్టనున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. గ్రామజ్యోతి కార్యక్రమ విధివిధానాల రూపకల్పన కోసం ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ సోమవారం సచివాలయంలో మరోమారు భేటీ అయింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులతో పాటు తాగునీరు, విద్య, సామాజిక భద్రత, వ్యవసాయం, ఆరోగ్యం, పేదరిక నిర్మూలన, గ్రామీణ మౌలిక వసతుల కల్పన వంటి కీలకమైన అంశాల్లో సమగ్ర అభివృద్ధి లక్ష్యంతోనే గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నామన్నారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వివిధ ప్రభుత్వ విభాగాల సిబ్బందిని, ప్రజాప్రతినిధులను, ప్రజలను పెద్దఎత్తున భాగస్వాములను చేయాలని ఉన్నతాధికారులకు సూచించామన్నారు. ప్రధానంగా ఈ నెల 17 నుంచి 23 వరకు చేపట్టాల్సిన గ్రామజ్యోతి కార్యక్రమాల షెడ్యూల్ పైనే మంత్రివర్గ ఉప సంఘం చర్చించిందని మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమోదం తెలిపాకే పూర్తిస్థాయి ప్రణాళికను విడుదల చేయాలని సబ్ కమిటీ నిర్ణయించిందన్నారు. సమావేశంలో మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వర్రావు, హరీశ్‌రావు, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
గ్రామజ్యోతిలో భాగమవుతాం
పల్లెసీమల బాగు కోసం చేపడుతున్న గ్రామజ్యోతి కార్యక్రమంలో ఎంపీటీసీలను కూడా భాగస్వాములను చేయాలని ప్రభుత్వానికి రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం విజ్ఞప్తి చేసింది. ఫోరం అధ్యక్షుడు బోళ్ల కరుణాకర్ ఆధ్వర్యంలో పలువురు రాష్ట్ర నాయకులు సోమవారం మంత్రి కేటీఆర్‌ను కలిశారు. గ్రామాల్లో ఎంపీటీసీలకు ప్రత్యేక కార్యాలయాల ఏర్పాటు, స్థానిక సంస్థల నిధుల్లో కేటాయింపులు, అలవెన్సులతో కలిపి వేతనం రూ.20 వేలకు పెంపు, ఎంపీ, ఎమ్మెల్యేలకు మాదిరిగా ప్రతి ఏటా సీడీపీ నిధులు, ప్రమాదంలో మరణిస్తే కుటుంబానికి 20 లక్షలు ఎక్స్‌గ్రేషియా, ఆరోగ్యబీమా తదితర డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మంత్రి కేటీఆర్‌కు అందించారు.