‘క్షుద్ర’ రాజకీయం..
సాక్షి, ముంబై: రాజకీయాల్లో రాణించేందుకు ప్రత్యర్థిని అంతమొందించాలని క్షుద్రపూజలు చేయిస్తున్న విరార్‌లోని మాన్వేల్ పాడా ప్రాంతానికి చెందిన శివసేన ఉప శాఖ ప్రముఖుడు వినాయక్ బోంస్లేను మూఢ నమ్మకాల చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం వినాయక్ భోంస్లే రాజకీయాల్లో ఎదిగేందుకు బహుజన్ వికాస్ ఆఘాడి నాయకుడు, స్థానిక కార్పొరేటర్ ప్రశాంత్ రావుత్ అడ్డుపడుతున్నాడు.
వసయి-విరార్ కార్పొరేషన్ ఎన్నికలు 2015లో జరగనున్నాయి. రావుత్ లేకుంటే తనకు రాజకీయంగా అన్ని అడ్డంకులు తొలగిపోతాయని భోంస్లే భావించాడు. అందుకు అతన్ని అంతమొందించాలని నిర్ణయించున్నాడు. మామూలుగా హత్య చేయిస్తే ఎప్పటికైనా తనకు ముప్పు తప్పదని.. క్షుద్ర శక్తులను ఉపయోగించి అతడిని అంతమొందిస్తే ఎవరికీ అనుమానం రాదని ఆలోచించాడు.తర్వాత పథకం ప్రకారం గత నెల 23వ తేదీన క్షుద్రపూజలకు అవసరమైన సామగ్రి తీసుకుని రత్నగిరి చేరుకున్నాడు.
అడవిలోకి వెళ్లి గుంత తవ్వి పూజలు చేయాలని నిర్ణయించుకున్నాడు. కాని ప్రయాణం చేయడంవల్ల అలసిపోవడంతో విశ్రాంతి తీసుకునేందుకు రత్నగిరిలోనే ఉన్న సోదరుడి ఇంటికి చేరుకున్నాడు. అక్కడ వారిద్దరి మధ్య ఆస్తి విషయమై మాటామాటా పెరిగి చివరకు వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన భోంస్లే తమ్ముడిని క్షుద్ర శక్తులతో అంతమొందిస్తానని బెదిరించి వెళ్లిపోయాడు. ఈ మేరకు సదరు సోదరుడు భోంస్లేపై స్థానిక సంగమేశ్వర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
వెంటనే పోలీసులు రంగంలోకి దిగి భోంస్లే కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు స్థానిక అడవిలో క్షుద్రపూజలు చేయించడానికి సిద్ధమవుతున్న భోంస్లేను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం తమదైన శైలిలో విచారించగా విరార్‌లో తన ప్రత్యర్థి ప్రశాంత్ రావుత్‌ను హతమార్చేందుకు ఈ క్షుద్ర పూజలు చేస్తున్నట్లు చెప్పాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని శనివారం పోలీసులు తెలిపారు.