Vipul Shah
-
సూరత్‌లో వజ్రాల సదస్సు
ముంబై: ప్రయోగశాలల్లో తయారు చేసిన వజ్రాల (ఎల్జీడీ) విక్రేతలు, కొనుగోలుదారులకు సంబంధించి గుజరాత్‌లోని సూరత్‌లో తొలిసారిగా సదస్సును ప్రారంభించినట్లు రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) తెలిపింది. ఇందులో 13 దేశాల నుంచి 22 మంది ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నట్లు పేర్కొంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కొనుగోలుదారులు, విక్రేతలు ప్రత్యక్షంగా డీల్స్ గురించి చర్చించుకోవచ్చని, దీర్ఘకాలిక వ్యాపార సంబంధాలను కుదుర్చుకోవచ్చని వివరించింది. గత అయిదేళ్లుగా భారత్‌లో ఎల్జీడీ విభాగం గణనీయంగా పెరిగిందని జీజేఈపీసీ చైర్మన్ విపుల్ షా వివరించారు. 2016–17లో 131 మిలియన్ డాలర్లుగా ఉన్న ఎగుమతులు 2022 ఏప్రిల్–2023 ఫిబ్రవరి మధ్య కాలంలో 1.5 బిలియన్ డాలర్లకు చేరాయని తెలిపారు. -
స్టార్ ప్రొడ్యూసర్‌కు రూ. 5 కోట్లు టోకరా!
ముంబై : తనను నమ్మించి మోసం చేశారంటూ బాలీవుడ్ ప్రముఖ నిర్మాత విపుల్ షా పోలీసులను ఆశ్రయించాడు. తనకు రూ. 5 కోట్ల మేర నష్టం కలిగించారని ఆరోపిస్తూ ముగ్గురు వ్యక్తులపై నాగ్‌పూర్ ఆర్థిక నేర విభాగానికి ఫిర్యాదు చేశాడు. వివరాలు... సింగ్ ఈజ్ కింగ్, కమాండో, ఫోర్స్, యాక్షన్ రీప్లే వంటి పలు హిట్ సినిమాలు నిర్మించిన విపుల్ షాకు 2010లో రాజ్ సింగ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. విపుల్ ప్రొడక్షన్ హౌజ్‌లో దాదాపు రూ. 100 కోట్ల బడ్జెట్‌తో సినిమా నిర్మిస్తానని నమ్మించాడు. ఈ క్రమంలో విపుల్‌తో పాటు అతడి వ్యాపార భాగస్వామి వినీత్ సింగ్‌తో పరిచయం పెంచుకుని.... తాము యాంటిక్(పురాతన కళాఖండాలు)లు సేకరిస్తున్నామని చెప్పాడు. వాటిలో ఉండే అరుదైన ఇరీడియం(అరుదైన లోహం)కు అతీంద్రియ శక్తులు కలిగి ఉంటాయని నమ్మబలికాడు. రక్షణా రంగంలో కూడా దీనిని వినియోగిస్తున్నారని... తద్వారా విజయం సాధిస్తున్నారంటూ మాయమాటలు చెప్పాడు. అదే విధంగా ఈ వ్యాపారంలో తమకు అండగా నిలిస్తే భవిష్యత్‌లో విపుల్ నిర్మాణ సంస్థలో మరిన్ని పెట్టుబడులు పెడతామని ఆకర్షించాడు. రాజ్ మాటలు నమ్మిన విపుల్ ఇరీడియం సేకరణలో భాగంగా ఏకంగా రూ. 5 కోట్ల మేర ఖర్చు చేశాడు. అయితే ఎన్నిరోజులు గడిచినా రాజేశ్ నుంచి ఆశించిన ఫలితం రాకపోవడంతో విపుల్ తాను మోసపోయినట్లు గుర్తించాడు. ఈ మేరకు శుక్రవారం నాగ్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో రాజ్ సింగ్‌ను అరెస్టు చేయగా.. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. కాగా అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం, అర్జున్ కపూర్ తదితర బాలీవుడ్ స్టార్లతో సినిమాలు నిర్మించిన విపుల్ కొన్ని చిత్రాలకు దర్శకుడిగానూ పనిచేసిన సంగతి తెలిసిందే. -
మానసికంగా కుమిలిపోయా!
‘మీటూ’ ఉద్యమంలో భాగంగా తాజాగా బాలీవుడ్ దర్శకుడు విపుల్ షా లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. సాక్రెడ్ గేమ్స్ ఫేమ్, ఇరానియన్ యాక్టర్ ఎల్నాజ్ నరౌజీ ఆయనపై ఆరోపణలు చేశారు. ‘‘నమస్తే ఇంగ్లాండ్’ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్‌లో భాగంగా నేను విపుల్ షాను కలిశా. నన్ను ఒక పాత్రæ కోసం ఆడిషన్స్‌కు పిలిచారు విపుల్. ఆఫీస్‌లో అతన్ని కలిసిన ప్రతిసారీ నాతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఓ సారి స్క్రిప్ట్ వినడం కోసం రూమ్‌కి రమ్మని పిలిచి ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నించాడు. మానసికంగా కుమిలిపోయాను. లైంగికంగా ఆయనకు సహకరించపోతే అవకాశం రాదని అర్థం అయ్యింది. ప్రముఖులు తమ పవర్‌ను ఇలా తప్పుడు మార్గంలో ఊపయోగించకూడదనే ఉద్దేశంతో ఈ విషయాన్ని చెబుతున్నాను’’ అని చెప్పుకొచ్చారు నరోజి. ‘ఆంఖేన్, నమస్తే లండన్, యాక్షన్ రీప్లే’ వంటి సినిమాలతో డైరెక్టర్‌గా మెప్పించిన విపుల్ ‘సింగ్ ఈజ్ కింగ్, హాలీడే’ వంటి సినిమాలతో మంచి అభిరుచి ఉన్న నిర్మాతగానూ పేరు తెచ్చుకున్నారు. ఇటీవల ప్రముఖ గుజరాతీ రచయిత, జర్నలిస్ట్ హర్కిసాన్ మోహతాకు సంబంధించిన 21 నవలల హక్కులను కూడా కొన్నారు విపుల్. ఇప్పుడీ ఈ లైంగిక ఆరోపణలు అతని కెరీర్‌ని ఎటు మలుపు తిప్పుతాయన్న ఆసక్తి బాలీవుడ్లో నెలకొంది. -
శ్రీదేవి హ్యాట్రిక్!
అతిలోక సుందరి శ్రీదేవి రీ-ఎంట్రీలో హ్యాట్రిక్ నమోదు చేశారు. ‘ఇంగ్లీష్ వింగ్లీష్’తో శ్రీదేవి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఏదీ విడుదల కాలేదు కదా? హ్యాట్రిక్ ఏంటని ఆలోచిస్తున్నారా? ‘ఇంగ్లీష్ వింగ్లీష్’లో శ్రీదేవి అమ్మగా నటించారు. భర్త బోనీకపూర్ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘మామ్’లోనూ అమ్మగానే కనిపించనున్నారు. తాజాగా విపుల్ షా దర్శకత్వంలో శ్రీదేవి ప్రధాన పాత్రధారిగా సల్మాన్‌ఖాన్ ఓ సినిమా నిర్మించనున్నారనే వార్త బయటకొచ్చింది. తల్లీకొడుకుల కథతో తెరకెక్కబోయే ఈ సినిమాలో ముచ్చటగా మూడోసారి శ్రీదేవి అమ్మగా కనిపిస్తారని బాలీవుడ్ టాక్. సౌత్‌లో రీ-ఎంట్రీ ఇచ్చిన ‘పులి’లోనూ హన్సిక తల్లిగా రాణి పాత్రలో శ్రీదేవి నటించినా, హిందీలోనూ వరుసగా అమ్మ పాత్రలే చేస్తున్నారు. ఆ లెక్కన చూస్తే రీ-ఎంట్రీలో అమ్మగా హ్యాట్రిక్ నమోదు చేసినట్టే కదా! -
దర్శకుల జోలికి వెళ్లను
అటు దర్శకత్వం.. ఇటు నిర్మాణం.. రెండింట్లోనూ విపుల్ షా మొనగాడే! ఇతడు దర్శకత్వం వహిస్తే పూర్తిగా దానిపైనే దృష్టి సారిస్తాడు. నిర్మాతగా మారితే దర్శకుల జోలికి కూడా వెళ్లడు. ‘సినిమాకు నిర్మాతగా ఉంటే, దానికి దర్శకుడిగానూ మారాలని నేను అనుకోను. నాతో పనిచేసిన దర్శకుల్లో ఏ ఒక్కరు కూడా.. ఈయన నా మెదడు తింటున్నాడనో.. మా పనుల్లో వేలుపెడుతున్నాడనో ఫిర్యాదు చేయలేదు. నిర్మాతగా నా పని విభిన్నమైనది. దర్శకుడు సినిమాకు తల్లి వంటివాడు. దానిని అతడే సృష్టిస్తాడు. నిర్మాత తండ్రిలాగా షోను నడిపిస్తాడు. ఈ రెండూ నాకు ఇష్టమైనవే’ అని చెప్పిన విపుల్ నమస్తే లండన్, వఖ్త్ సినిమాలకు నిర్మాత, దర్శకుడిగానూ వ్యవహరించాడు. సింగ్ ఈజ్ కింగ్, ఫోర్స్ సినిమాలు నిర్మించాడు. వీటికి అనీస్ బాజ్మీ, నిశికాంత్ కామత్ దర్శకత్వం వహించారు. అయితే నిర్మాతకు కృతజ‘త చూపించే వాళ్లే ఉండబోరని విపుల్ అంటాడు. కెమెరా ముందు కనిపించేవాళ్లే అందరికీ కావాలని, తెర వెనుక శ్రమించే వాళ్లకు ప్రాధాన్యం ఉండదని చెప్పాడు. ‘సినిమాకు నేను ఏం చేస్తానో యూనిట్ సభ్యులకే తెలుస్తుంది. వాళ్లు సంతోషంగా ఉన్నంత వరకు నిర్మాతగా నేను విజయం సాధించినట్టే. వాళ్ల ప్రశంసలు నాకు సరిపోతాయి’ అని అన్నాడు. విశేషమేమంటే మనోడు దర్శకత్వం వహించిన వాటిలో లండన్డ్రీమ్స్ మినహా అన్నింట్లోనూ అక్షయ్‌కుమార్ హీరో. అంతేకాడు తాజాగా ఇతడు తీస్తున్న హాలీడేలోనూ అక్షయ్ కథానాయకుడు. ఇతనితో తీసిన సినిమాలన్నీ విజయం సాధించాయి కాబట్టే ఇద్దరి మధ్య అనుబంధం పెరిగిందని విపుల్ షా చెప్పాడు. ఏఆర్ మురుగుదాస్ దర్శకత్వం వహించిన హాలీడే శుక్రవారం విడుదలవుతోంది. దీంట్లో సోనాక్షి సిన్హా హీరోయిన్గా అలరిస్తుంది. -
నమ్మకాన్ని నిలబెడతా
నిర్మాత విపుల్ షా సినిమాలో మళ్లీ అవకాశం లభించడం సంతోషంగా ఉందని బాలీవుడ్ నటి పూజా చోప్రా తెలిపింది. ‘రూప్ నగర్ కీ ఛీతే’ సినిమాలో నటించడం ఓ వైపు ఆనందాన్ని కలిగి స్తున్నా, అదే సమయంలో తనను తాను నిరూపించుకునేందుకు ఒత్తిడి ఉందని వ్యాఖ్యానించింది. గతంలో విపుల్ షా నిర్మించిన కమాండోలో నటించిన పూజా చోప్రా అప్పటి అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఈ మాటలు మాట్లాడింది. ‘అవును. ఎంతో ఉద్వేగంతో ఉన్నా. విపుల్ షా లాంటి నిర్మాతలు తనకు మరో చాన్స్ ఇచ్చి ప్రోత్సహించడం ఎంతో ఆనందంగా ఉంది. నేను ఎప్పుడు అబద్ధం చెప్పను. ఈ సినిమాలో నటించాలంటే ఎంతో ఒత్తిడిగా ఉంది. అయితే దీనివల్ల వచ్చే ఫలితంతో అమితమైన ఆనందం కలుగుతుంది. షా నాకు రెండో అవకాశమిచ్చారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నటిస్తాన’ని పూజా చోప్రా సోమవారం మీడియాకు తెలిపింది. కమాండో సినిమాలో ఓ చిన్న పట్టణ యువతి సిమ్రిత్ కౌర్ పాత్రను పోషించిన తాను ఈ సినిమాలో విభిన్న పాత్రలో నటిస్తున్నానని వివరించింది. ‘వచ్చే ఏడాది జనవరి నాలుగు నుంచి షూటింగ్ ప్రారంభమవుతుంది. కమాండో సినిమాకు ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. స్నేహం గురించే ఎక్కువగా ఉంటుంది. ఇది మంచి యూత్‌ఫుల్ స్టోరీ’ అని ఆమె పేర్కొంది. ఈ సినిమాలో ఢిల్లీలోని ఓ మోడ్రన్ గర్ల్ పాత్రలో నటిస్తున్నానని తెలిపింది. ఇందుకోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని వెల్లడించింది. షా నిర్మిస్తున్న రూప్ నగర్ కీ ఛీతే సినిమాకి విహాన్ సూర్యవంశీ దర్శకత్వం వహిస్తున్నారు.