దర్శకుల జోలికి వెళ్లను
అటు దర్శకత్వం.. ఇటు నిర్మాణం.. రెండింట్లోనూ విపుల్ షా మొనగాడే! ఇతడు దర్శకత్వం వహిస్తే పూర్తిగా దానిపైనే దృష్టి సారిస్తాడు. నిర్మాతగా మారితే దర్శకుల జోలికి కూడా వెళ్లడు. ‘సినిమాకు నిర్మాతగా ఉంటే, దానికి దర్శకుడిగానూ మారాలని నేను అనుకోను. నాతో పనిచేసిన దర్శకుల్లో ఏ ఒక్కరు కూడా.. ఈయన నా మెదడు తింటున్నాడనో.. మా పనుల్లో వేలుపెడుతున్నాడనో ఫిర్యాదు చేయలేదు. నిర్మాతగా నా పని విభిన్నమైనది. దర్శకుడు సినిమాకు తల్లి వంటివాడు. దానిని అతడే సృష్టిస్తాడు. నిర్మాత తండ్రిలాగా షోను నడిపిస్తాడు. ఈ రెండూ నాకు ఇష్టమైనవే’ అని చెప్పిన విపుల్ నమస్తే లండన్, వఖ్త్ సినిమాలకు నిర్మాత, దర్శకుడిగానూ వ్యవహరించాడు. సింగ్ ఈజ్ కింగ్, ఫోర్స్ సినిమాలు నిర్మించాడు. వీటికి అనీస్ బాజ్మీ, నిశికాంత్ కామత్ దర్శకత్వం వహించారు. అయితే నిర్మాతకు కృతజ‘త చూపించే వాళ్లే ఉండబోరని విపుల్ అంటాడు.
కెమెరా ముందు కనిపించేవాళ్లే అందరికీ కావాలని, తెర వెనుక శ్రమించే వాళ్లకు ప్రాధాన్యం ఉండదని చెప్పాడు. ‘సినిమాకు నేను ఏం చేస్తానో యూనిట్ సభ్యులకే తెలుస్తుంది. వాళ్లు సంతోషంగా ఉన్నంత వరకు నిర్మాతగా నేను విజయం సాధించినట్టే. వాళ్ల ప్రశంసలు నాకు సరిపోతాయి’ అని అన్నాడు. విశేషమేమంటే మనోడు దర్శకత్వం వహించిన వాటిలో లండన్‌డ్రీమ్స్ మినహా అన్నింట్లోనూ అక్షయ్‌కుమార్ హీరో. అంతేకాడు తాజాగా ఇతడు తీస్తున్న హాలీడేలోనూ అక్షయ్ కథానాయకుడు. ఇతనితో తీసిన సినిమాలన్నీ విజయం సాధించాయి కాబట్టే ఇద్దరి మధ్య అనుబంధం పెరిగిందని విపుల్ షా చెప్పాడు. ఏఆర్ మురుగుదాస్ దర్శకత్వం వహించిన హాలీడే శుక్రవారం విడుదలవుతోంది. దీంట్లో సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా అలరిస్తుంది.