అమిత్ షా మేనల్లుడిలా నటించి..
బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మేనల్లుడినని చెప్పుకుంటూ ఓ యువకుడు ఘరానా మోసాలకు పాల్పడుతున్నాడు. అతని బాధితల్లో ఎమ్మెల్యేలు చేరిపోతున్నారంటే ఆలోచించండి ఎంతటి తెలివైన దొంగో!. శాంతి ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తున్న సమయంలో ల్యాప్ టాప్, పర్సు, వాచ్, మొబైల్, కొన్ని ఆభరాణలు కలిగి దాదాపు 11 లక్షల విలువజేసే వస్తువులను ఏ1 బోగీలో నుంచి ఎవరో దొంగిలించారంటూ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన పేరు విరజ్ సింగ్ అని, పూణె నుంచి తాను వస్తున్నానని దారిలో బ్యాగ్ మిస్సయిందని సాయం చేయాలంటూ ఉజ్జయిని ఎమ్మెల్యే మోహన్ యాదవ్ కు ఫోన్ చేశాడు.
దీనిపై స్పందించిన మోహన్ తన అసోసియేట్ ను శర్మను ఉజ్జయిని స్టేషన్ కు పంపారు. రైల్వే పైస్థాయి అధికారులకు ఫోన్ చేసి సత్వరమే సమస్యను పరిష్కారం చేయాలని కోరారు. స్టేషన్ కు చేరుకున్న శర్మ విరజ్ ను మోహన్ యాదవ్ నివాసానికి తీసుకెళ్లారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మేనల్లుడు కావడంతో ఆయన దగ్గర కావొచ్చనే ఉద్దేశంతో రోజంతా ఉజ్జయినిలోని ప్రదేశాలను విరజ్ కు మోహన్ తిప్పి చూపించారు. అక్కడి నుంచి అహ్మదాబాద్ కు బయలుదేరే ముందు శర్మ విరజ్ కు రూ.50 వేల నగదు, 15 వేల రూపాయల విలువైన మొబైల్, విమానం టిక్కెట్ ను ఏర్పాటుచేశారు.
జీఆర్పీ పోలీసులు జరిపిన విచారణలో విరజ్ తాను రిజర్వ్ చేసిన సీటుగా పేర్కొన్నది అతనిది కాదని తేలింది. అంతేకాకుండా విరజ్ ఇచ్చిన మొబైల్ నంబర్ కూడా స్విచాఫ్ రావడంతో పోలీసులు షాక్ కు గురయ్యారు. గత వారం రాజస్థాన్ లోని అబు రైల్వేస్టేషన్ లో ఇలాంటి సంఘటనే రైల్వే అధికారులకు ఎదురైంది. రాజస్థాన్ కు చెందిన జాల్నా నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే కూడా విరజ్ మాయలో పడి పెద్ద మొత్తంలో అతనికి ముట్టజెప్పినట్లు సమాచారం.
ఈ కేసుపై విచారణ చేపట్టిన అధికారులు విరజ్ భార్యను ప్రశ్నించగా దొంగతనం లాంటివేం జరుగలేదని పేర్కొంది. యువకుడు తనను మోసం చేయడంపై మాట్లాడిన మోహన్ యాదవ్.. యువకుడు మోసగాడని గుర్తించలేకపోయానని చెప్పారు. ఎమ్మెల్యే, జీఆర్పీ అధికారులు కూడా అతనో మోసగాడని గుర్తించలేకపోయారు. యువకుడి కోసం వెతుకులాట ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.