Visakapatnam Port
-
తెన్నేటి పార్కులో ఫ్లోటింగ్ రెస్టారెంట్‌గా ఎంవీ మా కార్గోషిప్
సాక్షి, విశాఖపట్నం : సిటీ ఆఫ్ డెస్టినీ సాగర తీరంలో మరో సరికొత్త ప్రాజెక్ట్ సందర్శకులకు ఆహ్వానం పలకనుంది. విశాఖ నగర ప్రజలతో పాటు దేశ విదేశీ పర్యాటకులకు విభిన్న అనుభూతిని అందించేందుకు పర్యాటక శాఖ సిద్ధమైంది. సరకు రవాణా కోసం వచ్చి అలల తాకిడికి ఒడ్డుకొచ్చిన బంగ్లాదేశ్ నౌకను నీటిపై తేలియాడే రెస్టారెంట్ గా మార్పు చేస్తోంది. పీపీపీ పద్ధతిలో నాలుగు నెలల్లో నౌకను ఫ్లోటింగ్ రెస్టారెంట్‌గా అభివృద్ధి చేసి..పర్యాటకులకు అందించనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా బలమైన గాలుల ధాటికి 2020 అక్టోబర్ 12 అర్ధరాత్రి 2 గంటల సమయంలో బంగ్లాదేశ్‌కు చెందిన ఎంవీ–మా షిప్ బోల్తా పడకుండా తెన్నేటి పార్కు సమీపానికి కొట్టుకువచ్చింది. ఆ సమయంలో నౌకలో కెప్టెన్ సహా 15 మంది సిబ్బంది ఉన్నారు. విశాఖ పోర్టు ట్రస్ట్, భారత తీరగస్తీ దళం(కోస్ట్ గార్డ్), మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్, మర్చెంటైల్ మెరైన్ డిపార్ట్మెంట్(ఎంఎండీ), ఇండియన్ నేవీ, హిందూస్థాన్ షిప్ యార్డ్ ఇలా.. మొత్తం ఎనిమిది సంస్థలు షిప్‌ను తిరిగి సముద్రంలోకి పంపించేందుకు ప్రయత్నాలు ప్రారంభించినా సాధ్యం కాలేదు. దీంతో ఈ నౌకను ఇక్కడే వదిలేసేందుకు యాజమాన్యం నిర్ణయించుకుంది. ఈ తరుణంలో ఈ కార్గో షిప్‌ను ఫ్లోటింగ్ రెస్టారెంట్‌గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసింది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మారీటైమ్ యూనివర్సిటీకి చెందిన నిపుణుల బృందం నౌకను వారం రోజుల పాటు పరిశీలించి.. టూరిజం శాఖకు నివేదిక ఇచ్చింది. నివేదికను పరిశీలించిన ప్రభుత్వం ఈ కార్గో నౌకను ప్లాటింగ్ రెస్టారెంట్‌గా మార్చాలని నిర్ణయించింది. ఇందుకు కొన్ని నెలల కిందట కేబినెట్ కూడా ఆమోదముద్ర వేసింది. రూ.4.50 కోట్లకు విక్రయించేందుకు యాజమాన్యం పీఎన్‌ఐ క్లబ్ సిద్ధమవగా.. రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపి రూ.1.25 కోట్లకు పర్యాటక శాఖ సొంత నిధులతో కొనుగోలు చేసింది. ఫ్లోటింగ్ రెస్టారెంట్ ప్రత్యేకతలివే.. నౌకను అరుదైన ఫ్లోటింగ్ రెస్టారెంట్‌గా తీర్చిదిద్దేందుకు టూరిజం శాఖ సిద్ధమవుతోంది. ప్రపంచదేశాల పర్యాటకులను ఇట్టే ఆకర్షించేలా.. టూరిస్ట్ ఎమినిటీస్‌తో కూడిన ప్రాజెక్ట్‌గా డిజైన్ చేశారు. పుట్టిన రోజు, పెళ్లి రోజు, ఇతర శుభ కార్యాలు నిర్వహించేందుకు అనుగుణంగా బాంక్వెట్ హాళ్లు ఏర్పాటు చేయనున్నారు. దేశ విదేశీ రుచులు అందుబాటులో ఉండేలా 500 మందికి సరిపడా మల్టీ క్యూసిన్ రెస్టారెంట్ రానుంది. ఒక సందర్శకుడికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు ఇందులో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. పీపీపీ పద్ధతిలో రూ.10.50కోట్లతో ఫ్లోటింగ్ రెస్టారెంట్‌ను మిస్టర్ గిల్ మెరైన్స్ సంస్థతో కలిపి అభివృద్ధి చేయనున్నారు. తెన్నేటి పార్కుతో కలిపి దీనిని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడంతో.. ఆ పార్కును కూడా తమకు అప్పగించాలని జీవీఎంసీ, వీఎంఆర్డీఏ అధికారులకు పర్యాటక శాఖ లేఖలు రాసింది. అంతర్జాతీయంగా ఆకర్షిస్తుంది విశాఖ తీరంలో ఐఎన్ఎస్ కురుసుర సబ్‌మెరైన్ మ్యూజియం, టీయూ–142 యుద్ధ విమాన మ్యూజియం సందర్శకులకు సరికొత్త అనుభూతిని అందిస్తున్నాయి. త్వరలోనే సీ హారియర్ మ్యూజియం కూడా అందుబాటులోకి రానుంది. ఈ మూడింటితో పాటు ఎంవీ మా ఫ్లోటింగ్ రెస్టారెంట్ అందుబాటులోకి వస్తే.. ప్రపంచ పర్యాటక పటంలో ఈ తరహా మ్యూజియంలు, రెస్టారెంట్లు ఉన్న నగరంగా విశాఖపట్నం వినుతికెక్కనుంది. గిల్ సంస్థ డీపీఆర్ తయారు చేస్తోంది. నాలుగు నెలల్లో షిప్‌ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తాం. రెస్టారెంట్, ఏసీ గదులు, రూఫ్‌టాప్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ నెల 29 నుంచి నౌక సందర్శించేందుకు పర్యాటకులను అనుమతినిస్తున్నాం. – ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి -
విశాఖ సాగర తీరంలో విషాద దృశ్యం
విశాఖ సాగర తీరంలో విషాద దృశ్యం చోటు చేసుకుంది. శరీరం మీద గాయాలతో ఒక డాల్ఫిన్ మృతదేహం విశాఖలోని యారాడ సముద్ర తీరానికి కొట్టుకువచ్చింది. డాల్ఫిన్ మృత దేహాన్ని పరిశీలించిన స్థానిక మత్సకారులు దాని శరీరం మీద గాయాలు ఉన్నట్లు గమనించారు. డాల్ఫిన్ సమాచారాన్ని అధికారులకు అందజేశారు. విశాఖ తీరంలో తిరిగే భారీ షిప్ రెక్కలు తగిలి తరచూ ఇలాంటి భారీ జలజీవులు, డాల్ఫిన్స్ తరచూ మృత్యువాత పడుతున్నట్లు మత్స్యకారులు తెలిపారు. మృతిచెందిన డాల్ఫిన్ పొడవు 6 అడుగులు ఉంటుందని పేర్కొన్నారు. మానవుడి తన విలాస జీవితం కోసం వాడే ప్లాస్టిక్ భూతం కారణంగా కూడా సముద్ర జీవులు మరణిస్తున్నాయి. మనం వాడి పారవేసే 80 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలు ఇటీవల ఒక నివేదికలో తేలింది. చదవండి: ఆ విమానాన్ని ఇండియా ఏం చేయబోతోంది? -
విశాఖ పోర్టుకు అతి భారీ రవాణా నౌక
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని విశాఖ ఓడ రేవుకు భారీ నౌక వచ్చింది. సోమవారం పోర్ట్ ఇన్నర్ హార్బర్లోకి ఓస్లో అనే అతి భారీ రవాణా నౌక చేరింది. ఈ నౌక 229.20 మీటర్ల పొడవు, 38 మీటర్ల భీమ్ కలిగి ఉంది. గత ఏడాది భారీ నౌకలను ఇన్నర్ హార్బర్లోకి తీసుకు వచ్చేందుకు విశాఖ పోర్ట్ అధికారులు సింగపూర్‌లో సిములేషన్ స్టడీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ భారీ నౌక నేటి ఉదయం పోర్టు చేరగా.. అధికారలు ఏడో బెర్త్‌ను ఇచ్చారు. ఓస్లో భారీ రవాణా నౌక సౌత్ ఆఫ్రికాలోని రిచర్డ్ బే పోర్ట్ నుంచి బయలుదేరి స్టీమ్ కోల్‌తో విశాఖ పోర్టుకు చేరుకుంది. ఈ రవాణ(కార్గో) నౌక చూపరులను తెగ ఆకర్షిస్తోంది. పోర్టు చరిత్రలో మొట్ట మొదటిసారిగా ఇటువంటి భారీ లోడ్‌ను కలిగిన కార్గో నౌక రావటం గొప్ప విషయమని ఓడరేవు అధికారులు భావిస్తున్నారు. -
‘కరోనా వైరస్‌పై జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం’
సాక్షి, విశాఖపట్నం: కరోనా వైరస్‌కు సంబంధించి అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని విశాఖపట్నం పోర్టు అధికారులు బుధవారం తెలిపారు. కరోనా వైరస్‌పై పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉన్నట్లు పేర్కొన్నారు. బుధవారం ఉదయం 8. 25 గంటలకు సింగపూర్ నుంచి ఎం వీ ఫార్చ్యూన్ సన్ నౌక విశాఖపట్నం పోర్టుకు చేరిందని సిబ్బంది తెలిపారు. అంతే కాకుండా ఆ నౌకలో 21 మంది చైనా దేశానికి చెందనవారు ఉన్నారని వెల్లడించారు. దీంతో వారందరికీ కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోర్టు ఆరోగ్య అధికారి డాక్టర్ క్రాంతి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారని తెలిపారు. (‘కరోనా’ ఎఫెక్ట్; ఐకియా కీలక నిర్ణయం) ఈ పరీక్షల అనంతరం పోర్టు ఆరోగ్య అధికారి కాంత్రి మాట్లాడుతూ.. ఆ నౌక నుంచి వచ్చిన వారికి ఎటువంటి ఆరోగ్య ఇబ్బందులు, వైరస్ సమస్యలు లేవని నిర్ధారించామన్నారు. తర్వాత 10: 35 గంటలకు పోర్టు అధికారులు ఆ నౌకలోకి సరకు నింపేందుకు అనుమతి ఇచ్చారు. పోర్టుకు వచ్చిన ప్రతి నౌకకు సంబంధించిన సిబ్బందిని క్షుణ్ణంగా తనిఖీలు చేసిన అనంతరమే పోర్టులో కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతిస్తున్నామని విశాఖపోర్టు అధికారులు తెలిపారు. (‘కరోనా’ నుంచి రక్షణకు హెల్మెట్) కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సూచించిన అన్ని జాగ్రత చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కరోనాకు సంబంధించి పోర్టు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని.. సిబ్బందికి 95 మాస్కులు, గ్లౌజులు, అన్ని రక్షణ పరికరాలను అందుబాటులో ఉంచామని విశాఖ పట్నం పోర్టు అధికారులు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని పోర్టు అధికారులు పేర్కొన్నారు. (చైనాలో చిక్కుకుపోయిన తెలుగు ఇంజనీర్లు..) -
కిలాడి లేడి; గవర్నర్ సంతకం నుంచి మొదలుపెట్టి..
సాక్షి, విశాఖపట్నం : సాక్షాత్తూ రాష్ట్ర మాజీ గవర్నర్ నరసింహన్‌తో పాటుగా అప్పటి ఆంధ్రాయూనివర్సిటీ అధికారి ప్రొఫెసర్ ప్రసాదరావు సంతకాలను ఫోర్జరీ చేసిన కేసులో నిందితురాలు సత్యను అరెస్టు చేయడంలో మూడో పట్టణ పోలీసులు విఫలమయ్యారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం ఆమె జాడ కూడా కనుక్కోలేకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఆంధ్రాయూనివర్సిటీలో ఉద్యోగాల నియామక ఉత్తర్వులలో సంతకాలు ఫోర్జరీ చేసి మోసం చేశారని త్రీటౌన్ పోలీసులకు అక్టోబర్ 18వ తేదీన ఫిర్యాదు అందిన విషయం తెలిసిందే. మాజీ గవర్నర్, పూర్వ అధికారి సంతకాలను ఫోర్జరీ చేసి నియామక ఉత్వర్వులు జారీచేశారంటూ నిందితురాలు సత్యపై ఏయూ రిజి్రస్టార్ కృష్ణమోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గొంతిన సత్య హైదరాబాద్‌లోని ఓ అపార్ట్మెంట్లో కుమారుడు దినేశ్‌తో కలిసి నివసించేవారు. కాగా, తన తల్లి సత్య ఏయూలో ఉన్నత విద్య ఎంప్లాయిమెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారని ఎదురు ఫ్లాటులో ఉంటున్న రాజశేఖర్‌ని నమ్మించాడు. దీంతో రాజశేఖర్‌తోపాటుగా అతని బంధువులు, స్నేహితులు కలిపి 12 మంది రూ.1.7కోట్లు సమరి్పంచుకున్నారు. పెద్ద పోస్టులకు రూ.15 లక్షలు, చిన్న పోస్టులకు రూ.6లక్షలు వంతున వసూలు చేశారు. తరువాత ఏయూలో నియామకాలు వచ్చేశాయంటూ అప్పటి గవర్నర్ సంతకాలు ఫోర్జరీ చేసి ఉత్తర్వులు ఇచ్చేశారు. ఈ ఉత్తర్వులు సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో ఏయూ అధికారి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌కు ఎస్ఐ స్థాయి అధికారి కాకుండా ఒక కానిస్టేబుల్ వెళ్లడం గమనార్హం. ఆయన సత్య నివసించిన ఫ్లాట్ వద్దకు వెళ్లగా సత్య, కుమారుడి ఆచూకీ లభించలేదు. వారు ఫ్లాట్ మాత్రం ఖాళీచేయలేదన్న సమాచారంతో మాత్రమే కొద్దిరోజుల క్రితం విశాఖ తిరిగిచేరుకున్నారు. కాగా ఈ కేసుపై త్రీటౌన్‌పోలీసులు పెద్దగా దృష్టి సారించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతనెలలోనే కొందరు బాధితులు త్రీటౌన్స్టేషన్కు వచ్చి తాము సత్య చేతిలో మోసపోయామని చెప్పగా..మోసం జరిగింది హైదరాబాద్‌లో కాబట్టి అక్కడే ఫిర్యాదు ఇవ్వాలని చెప్పడంతో వారంతా వెనుదిరిగారు. కాగా సత్య సుదీర్ఘకాలం సెలవులు తీసుకోవడంతో 2016 సంవత్సరంలో సస్పెండ్ అయ్యారు. సస్పెన్సన్‌లో ఉన్న మహిళ ఏకంగా రాష్ట్ర గవర్నర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి మరీ డబ్బులు స్వాహా చేయడంతో అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటివరకు సత్య ఆచూకీ తెలియకపోవడంతో ఏయూ అధికారులు సైతం కలవరపడుతున్నారు. ఇదిలా ఉండగా సత్య ఏయూలోని ఓ బ్యాంకులో పొదుపుఖాతా నిమిత్తం తన చిరునామాను పాండురంగాపురం, సెక్టార్–5, ఆరిలోవ అని తప్పుడు చిరునామా ఇచ్చినట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసును త్రీటౌన్‌సీఐ కోరాడ రామారావు పర్యవేక్షణలో ఎస్ఐ ధర్మేంద్ర దర్యాప్తు చేస్తున్నారు. -
విశాఖ పోర్టు ట్రస్టు చైర్మన్ పదవికి కృష్ణబాబు పేరొక్కటే!
సాక్షి, హైదరాబాద్: విశాఖపట్టణం పోర్టు ట్రస్టు (వీపీటీ) చైర్మన్ పదవికి కేంద్ర ఓడరేవుల మంత్రిత్వ శాఖ ఐఏఎస్ అధికారి కృష్ణబాబు పేరును ప్రతిపాదించింది. ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్యకార్యదర్శిగా అజయ్ కల్లం బదిలీతో ఖాళీ అయినా ఈ పదవి కోసం రాష్ర్ట కేడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్‌లతో పాటు ఇతర రాష్ట్రాల అధికారులు మొత్తం 36 మంది దరఖాస్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర సర్వీసులోని ఒక అధికారి పేరును ప్రతిపాదిస్తూ ఓడరేవుల మంత్రికి లేఖ రాసినా 10 జన్‌పథ్ కృష్ణబాబు పేరును సూచించినట్లు సమాచారం. దీంతో సీనియారిటీ, సీఎం విజ్ఞప్తి బేఖాతరయ్యాయి. సాధారణంగా సీనియారిటీ ఆధారంగా ముగ్గురు అధికారుల పేర్లను ప్రతిపాదించాలి. కృష్ణబాబుకు అనుకూలంగా రాష్ట్రానికి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు, రాజ్యసభ సభ్యుడు పైరవీ చేసినట్లు ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి.