సాక్షి, హైదరాబాద్: విశాఖపట్టణం పోర్టు ట్రస్టు (వీపీటీ) చైర్మన్ పదవికి కేంద్ర ఓడరేవుల మంత్రిత్వ శాఖ ఐఏఎస్ అధికారి కృష్ణబాబు పేరును ప్రతిపాదించింది. ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్యకార్యదర్శిగా అజయ్ కల్లం బదిలీతో ఖాళీ అయినా ఈ పదవి కోసం రాష్ర్ట కేడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్‌లతో పాటు ఇతర రాష్ట్రాల అధికారులు మొత్తం 36 మంది దరఖాస్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర సర్వీసులోని ఒక అధికారి పేరును ప్రతిపాదిస్తూ ఓడరేవుల మంత్రికి లేఖ రాసినా 10 జన్‌పథ్ కృష్ణబాబు పేరును సూచించినట్లు సమాచారం. దీంతో సీనియారిటీ, సీఎం విజ్ఞప్తి బేఖాతరయ్యాయి. సాధారణంగా సీనియారిటీ ఆధారంగా ముగ్గురు అధికారుల పేర్లను ప్రతిపాదించాలి. కృష్ణబాబుకు అనుకూలంగా రాష్ట్రానికి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు, రాజ్యసభ సభ్యుడు పైరవీ చేసినట్లు ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి.