visakha air port
-
విశాఖ నుంచి కొత్త విమాన సర్వీసులు ప్రారంభం
సాక్షి, విశాఖపట్నం: దీపావళి పండగ వేళ విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఆదివారం నుంచి మరో కొత్త సర్వీస్‌ను స్పైస్ జెట్ ప్రారంభించింది. విశాఖపట్నం-విజయవాడ మధ్య స్పైస్ జెట్ సర్వీసు ను విశాఖ ఎంపీ ఎం.వి.వి సత్యనారాయణ లాంఛనంగా ప్రారంభించారు. స్పైస్‌జెట్ విమాన సంస్థ విశాఖ నుంచి గన్నవరానికి మంగళవారం మినహా వారంలో ఆరు రోజులు పాటు సర్వీసులు నడపనుంది. వైజాగ్ నుంచి ఉదయం 8.30 గంటలకు బయలుదేరి 9.30 గంటలకు గన్నవరం చేరుకుంటుంది. తిరిగి 9.50 గంటలకు బయలుదేరి 10.50కు వైజాగ్ చేరుకుంటుంది. నేటి నుంచి చెన్నై, సింగపూర్‌లకు కూడా నూతన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఎన్నికల సమయంలో అనివార్య కారణాల వల్ల రద్దయిన విమాన సర్వీసుల పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. -
టీమిండియా క్రికెటర్లను వర్షంలో తడిపారు..
విశాఖ: భారత క్రికెటర్లకు వీడ్కోలు పలికే సందర్భంలో ఎయిర్పోర్ట్ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఆదివారం తొలి టెస్టు మ్యాచ్ ముగియగా, ఈరోజు(సోమవారం) పుణె బయల్డేరడానికి ఇరు జట్ల క్రికెటర్లు సిద్ధమయ్యారు. అయితే టీమిండియా క్రికెటర్లను వర్షంలో తడిసేలా చేశారు అధికారులు. ప్లాట్‌ఫామ్-1పై నిలపాల్సిన బస్సును ప్లాట్‌ఫామ్-3పై నిలిపారు. దాంతో భారత క్రికెటర్లు ప్లాట్‌ఫామ్-3 నుంచి నడుచుకుంటూ ప్రత్యేక విమానం వద్దకు చేరుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో వర్షం పడటంతో లగేజీని మోసుకుంటూ ప్లాట్‌ఫామ్-1పైకి వెళ్లాల్సి వచ్చింది. అయితే దీనిపై క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆటగాళ్లతో వచ్చిన బస్సు ఎయిర్పోర్ట్ ఎంట్రీకి ముందుగా నిలిపివేసిన కారణంగా తాము తడవాల్సి వచ్చిందంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటూ రోహిత్ శర్మ నిలదీయడంతో నిర్వహకులు తమను సమర్ధించుకునే యత్నం చేశారు. ఎయిర్ పోర్ట్ ఎంట్రీ మరమ్మత్తుల కారణంగానే కొన్ని అడుగుల దూరంలో బస్సును నిలిపివేయాల్సి వచ్చిందంటూ వివరణ ఇచ్చుకున్నారు. కాగా, ఎలాగోలా అక్కడికి చేరుకుని ప్రత్యేక విమానంలో భారత క్రికెటర్లు పుణెకు బయల్డేరారు. గురువారం నుంచి భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు జరుగనుంది. -
దాడికి ఘన స్వాగతం
అనకాపల్లి/ గోపాలపట్నం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఇటీవల పార్టీలో చేరి.. తొలిసారిగా సోమవారం జిల్లాకు వచ్చిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఆయన తనయుడు రత్నాకర్‌లకు విశాఖ విమానాశ్రయంలో అఖండ స్వాగతం లభించింది. జై జగన్..జై దాడి.. నినాదాలతో విమానాశ్రయ పరిసరాలు మార్మోగాయి. ఈ సందర్భంగా పార్టీ అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త గుడివాడ అమర్నాథ్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ సత్తి రామకృష్ణారెడ్డి, దామా సుబ్బారావు, బొడ్డపాటి చిన రాజారావు, విల్లూరి పైడా రావు, కొణతాల కాశీ, కోరుకొండ రాఘవ, వేగిదొరబాబు, మళ్లరాజా తదితర నాయకులు, పెద్ద సంఖ్యలో శ్రేణులు, అభిమానులతో ఘనస్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలతో అభిమానాన్ని ప్రదర్శించారు. పూలజల్లులు కురిపించారు. అనకాపల్లితో పాటు జిల్లా నలుమూలల నుంచి భారీగా నాయకులు, శ్రేణులు పాల్గొన్నారు. ఇక్కడి నుంచి కార్లతో భారీ ర్యాలీగా అనకాపల్లికి వెళ్లారు. జగన్ నాయకత్వాన్ని బలపర్చనున్న జనం: రత్నాకర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని బలపరచడానికి జనం సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్సీపీ నేత దాడి రత్నాకర్ అన్నారు. విశాఖ విమానాశ్రయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. జగన్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని, రాక్షసపాలనకు చమరగీతం పాడేందుకు ఓటే శర్యణ్యంగా జనం సిద్ధమయ్యారన్నారు. చంద్రబాబు తాత్కాలిక తాయిలాలతో ఓట్లు పొందాలనుకుంటున్నా అలాంటి దురాలోచనలు ఫలించవన్నారు. ఓటమి భయంతో చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్సీపీ ఓటర్లను తొలగించే కుట్రపన్నిందని ఆరోపించారు. తాను ఐటీ స్థాపకునిగా ప్రచారం చేసుకునే చంద్రబాబు ఘనకార్యం ఏమిటో ఇపుడు బయటపడిందన్నారు. ఓట్ల తొలగింపు మాయాజాలంతో చంద్రబాబు సైబరు క్రైంకి పాల్పడ్డ ఘనత సాధించారని తేలిపోయిందని విమర్శించారు. ఆంధ్రప్రజల ఉనికి ప్రశ్నార్ధకంగా మారేలా చంద్రబాబు చర్యలు ఉన్నాయని, ప్రజల సమాచారాన్ని దుర్వినియోగం చేస్తున్న నేపథ్యంలో క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దాడి రాక శుభపరిణామం: గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఆయ తనయుడు రత్నాకర్ వైఎస్సార్ సీపీలో చేరడం శుభపరిణామమని అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త గుడివాడ అమర్నాథ్ అన్నారు. వీరభద్రరావు, రత్నాకర్ చేరికతో జిల్లాలో వైఎస్సార్ సీపీ బలోపేతం అవుతోందన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో అభిమానులు స్వాగతం పలకడానికి రావడం పార్టీలో ఉత్సాహాన్ని నింపుతోందన్నారు. జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. -
విశాఖ విమానాశ్రయం చేరుకున్న షర్మిల
విశాఖ : సుదీర్ఘ మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ముగించుకున్న మహానేత రాజశేఖరరెడ్డి తనయ షర్మిల నేడు హైదరాబాద్ రానున్నారు. సోమవారం ఉదయం వైఎస్ విజయమ్మతో కలిసి ఆమె విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. షర్మిల విశాఖపట్నం నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి నేరుగా చంచల్‌గూడ జైలుకు చేరుకుంటారు. తన సోదరుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఆమె ములాఖత్ అవుతారు. పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన ప్రజల కన్నీళ్లు, కష్టాలను షర్మిల నేరుగా జగన్మోహన్రెడ్డికి వివరించనున్నారు. ప్రపంచ చరిత్రలో ఏ మహిళ చేయని విధంగా 3112 కిలో మీటర్ల పాదయాత్రతో రికార్డు సృష్టించిన షర్మిలకు శంషాబాద్‌లో పార్టీ శ్రేణులు, వైఎస్ కుటుంబ అభిమానులు భారీ స్వాగతం పలకనున్నారు. శంషాబాద్ నుంచి కాటేదాన్, చాంద్రాయణగుట్ట క్రాస్‌రోడ్డు ఫ్లైఓవర్ కింద నుంచి కంచన్‌బాగ్, ఒవైసీ ఆస్పత్రి, ఐఎస్ సదన్ మీదుగా చంచల్‌గూడకు చేరుకుంటారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.