విశాఖ: భారత క్రికెటర్లకు వీడ్కోలు పలికే సందర్భంలో ఎయిర్‌పోర్ట్ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఆదివారం తొలి టెస్టు మ్యాచ్ ముగియగా, ఈరోజు(సోమవారం) పుణె బయల్డేరడానికి ఇరు జట్ల క్రికెటర్లు సిద్ధమయ్యారు. అయితే టీమిండియా క్రికెటర్లను వర్షంలో తడిసేలా చేశారు అధికారులు. ప్లాట్‌ఫామ్-1పై నిలపాల్సిన బస్సును ప్లాట్‌ఫామ్-3పై నిలిపారు. దాంతో భారత క్రికెటర్లు ప్లాట్‌ఫామ్-3 నుంచి నడుచుకుంటూ ప్రత్యేక విమానం వద్దకు చేరుకోవాల్సి వచ్చింది.
ఆ సమయంలో వర్షం పడటంతో లగేజీని మోసుకుంటూ ప్లాట్‌ఫామ్-1పైకి వెళ్లాల్సి వచ్చింది. అయితే దీనిపై క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆటగాళ్లతో వచ్చిన బస్సు ఎయిర్‌పోర్ట్ ఎంట్రీకి ముందుగా నిలిపివేసిన కారణంగా తాము తడవాల్సి వచ్చిందంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటూ రోహిత్ శర్మ నిలదీయడంతో నిర్వహకులు తమను సమర్ధించుకునే యత్నం చేశారు. ఎయిర్ పోర్ట్ ఎంట్రీ మరమ్మత్తుల కారణంగానే కొన్ని అడుగుల దూరంలో బస్సును నిలిపివేయాల్సి వచ్చిందంటూ వివరణ ఇచ్చుకున్నారు. కాగా, ఎలాగోలా అక్కడికి చేరుకుని ప్రత్యేక విమానంలో భారత క్రికెటర్లు పుణెకు బయల్డేరారు. గురువారం నుంచి భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment