విశాఖ విమానాశ్రయంలో దాడి వీరభద్రరావు, రత్నాకర్‌లకు స్వాగతం పలుకుతున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు
అనకాపల్లి/ గోపాలపట్నం: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఇటీవల పార్టీలో చేరి.. తొలిసారిగా సోమవారం జిల్లాకు వచ్చిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఆయన తనయుడు రత్నాకర్‌లకు విశాఖ విమానాశ్రయంలో అఖండ స్వాగతం లభించింది. జై జగన్..జై దాడి.. నినాదాలతో విమానాశ్రయ పరిసరాలు మార్మోగాయి.
ఈ సందర్భంగా పార్టీ అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త గుడివాడ అమర్‌నాథ్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ సత్తి రామకృష్ణారెడ్డి, దామా సుబ్బారావు, బొడ్డపాటి చిన రాజారావు, విల్లూరి పైడా రావు, కొణతాల కాశీ, కోరుకొండ రాఘవ, వేగిదొరబాబు, మళ్లరాజా తదితర నాయకులు, పెద్ద సంఖ్యలో శ్రేణులు, అభిమానులతో ఘనస్వాగతం పలికారు.
పుష్పగుచ్ఛాలతో అభిమానాన్ని ప్రదర్శించారు. పూలజల్లులు కురిపించారు. అనకాపల్లితో పాటు జిల్లా నలుమూలల నుంచి భారీగా నాయకులు, శ్రేణులు పాల్గొన్నారు. ఇక్కడి నుంచి కార్లతో భారీ ర్యాలీగా అనకాపల్లికి వెళ్లారు.
జగన్ నాయకత్వాన్ని బలపర్చనున్న జనం: రత్నాకర్
రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని బలపరచడానికి జనం సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్‌సీపీ నేత దాడి రత్నాకర్ అన్నారు. విశాఖ విమానాశ్రయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. జగన్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని, రాక్షసపాలనకు చమరగీతం పాడేందుకు ఓటే శర్యణ్యంగా జనం సిద్ధమయ్యారన్నారు. చంద్రబాబు తాత్కాలిక తాయిలాలతో ఓట్లు పొందాలనుకుంటున్నా అలాంటి దురాలోచనలు ఫలించవన్నారు.
ఓటమి భయంతో చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ ఓటర్లను తొలగించే కుట్రపన్నిందని ఆరోపించారు. తాను ఐటీ స్థాపకునిగా ప్రచారం చేసుకునే చంద్రబాబు ఘనకార్యం ఏమిటో ఇపుడు బయటపడిందన్నారు. ఓట్ల తొలగింపు మాయాజాలంతో చంద్రబాబు సైబరు క్రైంకి పాల్పడ్డ ఘనత సాధించారని తేలిపోయిందని విమర్శించారు. ఆంధ్రప్రజల ఉనికి ప్రశ్నార్ధకంగా మారేలా చంద్రబాబు చర్యలు ఉన్నాయని, ప్రజల సమాచారాన్ని దుర్వినియోగం చేస్తున్న నేపథ్యంలో క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
దాడి రాక శుభపరిణామం: గుడివాడ అమర్‌నాథ్
మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఆయ తనయుడు రత్నాకర్ వైఎస్సార్ సీపీలో చేరడం శుభపరిణామమని అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. వీరభద్రరావు, రత్నాకర్ చేరికతో జిల్లాలో వైఎస్సార్ సీపీ బలోపేతం అవుతోందన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో అభిమానులు స్వాగతం పలకడానికి రావడం పార్టీలో ఉత్సాహాన్ని నింపుతోందన్నారు. జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment