అచ్యుతాపురం: యలమంచిలి నియోజకవర్గం వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధి మిళితం. మున్సిపాలిటీ హోదా సాధించింది. ఈ నియోజకవర్గంలో దేశంలోనే చెప్పకోదగ్గ ఏటికొప్పాకలో బొమ్మల తయారీ కళాకారులు ఉన్నారు. అచ్యుతాపురంలో స్పెషల్ ఎకనామికల్ జోన్ ఏర్పాటైంది. రాంబిల్లి మండలంలో రక్షణ శాఖకు చెందిన నేవెల్ బేస్‌ను ఏర్పాటు చేస్తున్నారు.రాష్ట్రంలో కొల్లేటి సరస్సు తరువాత ఆస్థాయిలో కొండకర్ల ఆవ ఉంది.
ప్రధాన జల వనరుగా శారదానది ప్రవహిస్తోంది. ఈ నియోజకవర్గ పరిధిలో వరి, చెరకును ప్రధాన పంటలుగా రైతులు సాగు చేస్తున్నారు. యలమంచిలిలో కనకమహాలక్ష్మి, భూలోకమాంబ, మామిడివాడ పైడితల్లి అమ్మవారు, చోడపల్లి చోడమాంబిక, మునగపాక గౌరీపరమేశ్వరుల ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. అలాగే పంచదార్ల పుణ్యక్షేత్రం జిల్లాలో ఎంతో ప్రసిద్ధిగాంచింది.
రాజకీయ నేపథ్యం...
యలమంచిలి నియోజకవర్గంలో 1952 నుంచి ఇప్పటివరకూ 14 సార్లు ఎన్నికలు జరిగాయి. రాంబిల్లి మండలం దిమిలికి చెందిన వారు ఎక్కువ కాలం పాలన సాగించారు. యలమంచిలి నియోజకవర్గంలో గతంలో ఎస్.రాయవరం, యలమంచిలి, రాంబిల్లి, అచ్యుతాపురం మండలాలు ఉండేవి. దిమిలికి చెందిన పప్పల బాపునాయుడు, నగిరెడ్డి సత్యం ఒక్కొక్కసారి ఎస్.రాయవరం మండలం సైతారుపేటకు చెందిన వీసం సన్యాసినాయుడు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
అచ్యుతాపురం మండలానికి చెందిన కేకేవీ ఎస్ రాజు ఒకసారి గెలుపొందారు. 1983, 1989, 1994 1999 ఎన్నికల్లో వరుసగా నాలుగుసార్లు రాంబిల్లి మండలం దిమిలికి చెందిన పప్పల చలపతిరావు టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొం దారు. అత్యధికంగా పప్పల చలపతిపావు 19,000 మెజారిటీతో నగిరెడ్డి ప్రభాకర్‌పై విజ యం సాధించారు. పప్పల చలపతిరావు, నాలుగు ఎన్నికల్లోనూ, వీసం సన్యాసినాయుడు, కె.కె.వి.ఎస్. రాజు, యు.వి.రమణమూర్తిరాజు, ప్రభాకరరావులను ఓడించారు.
1999 ఎన్నికలో కాంగ్రెస్ తరుపున పోటీచేసి యు.వి.రమణమూర్తిరాజు ఓటమి చెందారు. ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ తరుపున గెలుపొందారు. యు.వి. రమణమూర్తిరాజు తాను గెలి చిన రెండు ఎన్నికల్లోనూ గొంతెన నాగేశ్వరరావుపై 5,863, 10,090 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున పంచకర్ల రమేష్‌బాబు ప్రత్యర్థి ప్రగడ నాగేశ్వరరావుపై 8,375 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ప్రగడ నాగేశ్వరరావు ఓడినప్పటికీ టీడీపీకి దీటుగా జవాబు చెప్పారు.
నియోజకవర్గ ఓటర్లు | 1,88,766 |
పురుషులు | 92,879 |
మహిళలు | 95,875 |
ఇతరులు | 12 |
పోలింగ్ బూత్‌లు | 224 |
గెడ్డకు అవతల–గెడ్డకు ఇవతల...
యలమంచిలి నియోజకవర్గం ఏర్పాటుకు ముందు నుంచి శారదా నది హద్దుగా గెడ్డ అవతల గెడ్డ ఇవతల అనే విభజన ప్రజల్లో ఉండేది. ఎస్.రాయవరం, యలమంచిలి, రాంబిల్లిలో సగం మండలం గెడ్డ అవతల అనేవారు. రాంబిల్లి మండలంలో మిగిలిన సగభాగం, అచ్యుతాపురం మండలాలను గెడ్డ ఇవతల అనేవారు. 1983 వరకూ గెడ్డ అవతల, ఇవతల నినాదం కొనసాగింది. గెడ్డ అవతల వ్యక్తులే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 1981లో గెడ్డ ఇవతల కె.కె.వి.ఎస్.రాజు ఎన్నికయ్యారు. ఆ తరువాత పార్టీలపరంగా రాజకీయ చైతన్యం పెరిగిన తర్వాత ఈ నినాదం సమసిపోయింది.
ఎమ్మెల్యేలుగా పనిచేసినవారు..
కాలపరిమితి | ఎమ్మెల్యే | పార్టీ |
1952 | పి.బాపునాయుడు | కె.ఎల్.పి |
1955 | సి.వి.ఎస్.రాజు | ఇండిపెండెంట్ |
1962 | వి.సన్యాసినాయుడు | కాంగ్రెస్ |
1967 | ఎన్.సత్యనారాయణ | ఇండిపెండెంట్ |
1972 | కె.వి.కాకర్లపూడి | ఇండిపెండెంట్ |
1978 | వి.సన్యాసినాయుడు | కాంగ్రెస్ |
1983 | కె.కె.వి.ఎస్.రాజు | టీడీపీ |
1985 | పప్పల చలపతిరావు | టీడీపీ |
1989 | పప్పల చలపతిరావు | టీడీపీ |
1994 | పప్పల చలపతిరావు | టీడీపీ |
1999 | పప్పల చలపతిరావు | టీడీపీ |
2004 | యు.వి.రమణమూర్తిరాజు | కాంగ్రెస్ |
2009 | యు.వి.రమణమూర్తిరాజు | కాంగ్రెస్ |
2014 | పంచకర్ల రమేష్‌బాబు | టీడీపీ |
పునర్విభజనలో మారిన కులసమీకరణ...
2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో ఎస్.రాయవరం మండలం పాయకరావుపేట నియోజకవర్గంలో కలిసిపోయింది. మునగపాక మండలం యలమంచిలిలో చేరింది. అప్పటివరకు కాపు, వెలమ, మత్స్యకార సామాజికవర్గాల ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. మునగపాక మండలం కలవడంతో గవర సామాజిక వర్గం ప్రాధాన్యత పెరిగింది. నియోజకవర్గంలో అధిక ఓటు బ్యాంకు కాపు సామాజిక వర్గానికి ఉంది.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు...
నియోజకవర్గంలో 224 పోలింగ్ బూత్‌లు ఉన్నాయి. వీటిలో సమస్యాత్మకమైనవి యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని 1, 3, 6, 7 వార్డులు, ఏటికొప్పాక, ఎర్రవరం, రాంబిల్లి మండలంలో కొత్తపట్నం, గజిరెడ్డిపాలెం, వైలోవ, మునగపాక మండలంలోని వాడ్రాపల్లి, నాగవరం, ఉమ్మలాడ, అచ్యుతాపురం మండలంలో తంతడి, కొండకర్ల, పూడిమడక, ఎస్‌ఈజెడ్ కాలనీ, దోసూరు, దొప్పెర్ల, ఇరువాడ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment