టీడీపీలో సిగపట్లు  | Seat Panchayath Issue In Tdp Visakha | Sakshi
Sakshi News home page

టీడీపీలో సిగపట్లు 

Published Tue, Mar 12 2019 12:57 PM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

Seat Panchayath Issue In Tdp Visakha - Sakshi

ఎమ్మెల్యే అనితకు వ్యతిరేకంగా సీఎం ఇంటి ముందు ఆందోళన

సాక్షి, విశాఖపట్నం: అధికార టీడీపీలో స్థానికంగానే కాదు.. అమరావతిలో కూడా సీట్ల కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు వ్యతిరేకంగా సొంత పార్టీలోనే పెద్ద ఎత్తున నిరసనలు హోరెత్తాయి. అవినీతి ఎమ్మెల్యే అనితకు టికెట్‌ ఇవ్వొద్దంటూ ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులంతా బాహాటంగానే గత నెలరోజులుగా వివిధ రూపాల్లో నియోజకవర్గంలో ఆందోళనలు కొనసాగాయి.

అభ్యర్థుల ఎంపిక కోసం అమరావతిలో రెండ్రోజులపాటు పార్టీ అధినేత చంద్రబాబు నిర్వహించిన కీలక సమావేశాల్లో సైతం అనిత వ్యతిరేక వర్గీయులు గళమెత్తారు. గత నాలుగు రోజులుగా అమరావతిలోనే మకాం వేసి ఎదుట ఆందోళనలు కొనసాగిస్తున్నారు. సోమవారం చంద్రబాబు ఇంటి వద్దే అనితకు వ్యతిరేకంగా బ్యానర్లు, ప్లకార్డులు చేతబూని నిరసనలు వ్యక్తం చేశారు. అనితకు టికెట్‌ ఇస్తే ఓడిపోవడం ఖాయమని, ఆమెకు టికెట్‌ ఇవ్వొద్దంటూ నినాదాలు చేశారు.

అలాగే నియోజకవర్గంలో కూడా ఆమెకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇక విశాఖ అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌కు వ్యతిరేకంగా రాజుకున్న అసమ్మతి రోజురోజుకు తారాస్థాయికి చేరుకుంటుంది. నిన్నటి వరకు సీటు విషయంలోనే కాదు.. పార్టీలో కూడా ఎడముఖం పెడముఖంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎస్‌ఎ రెహ్మాన్, అర్బన్‌ జిల్లా మాజీ అధ్యక్షుడు జహీర్‌ అహ్మద్‌లు వాసుపల్లికి వ్యతిరేకంగా ఏకమయ్యారు.

ఇరు నేతలు ఒకే వేదికపై కూర్చొని వాసుపల్లి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. మళ్లీ వాసుపల్లికి టికెట్‌ ఇస్తే ఓటమి ఖాయమని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో కనీసం 10 స్థానాలైనా ముస్లింలకు కేటాయించకుంటే ఆ వర్గం నుంచి ఈసారి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుగోకతప్పదని హెచ్చరించారు. ఇంకో వైపు పాడేరు టికెట్‌ తనదేనంటూ ఫిరాయిం పు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సోమవారం క్యాంపు కార్యాలయంలోనే పార్టీ కీలకనేతలతో భేటీ నిర్వహించారు.

ఈ భేటీకి పార్టీ సమన్వయ కమిటీ సభ్యులైన మాజీ మంత్రి మత్య్సరాస మణికుమారి, మాజీ ఎమ్మెల్యే ఎంవీవీ సత్యనారాయణ కుమారుడు, జీసీసీ చైర్మన్‌ ఎంవీ వీ ప్రసాద్, జిలా ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు బొర్రా నాగరాజు హాజరుకాలేదు. గిడ్డి ఈశ్వరి అభ్యర్థిత్వాన్ని తాము అంగీకరించే ప్రసక్తే లేదని వారు తెగేసి చెబుతున్నారు. ఈశ్వరి టికెట్‌ ఇస్తే ఓడించేందుకు సిద్ధంగా ఉండాలని అనుచరుల వద్ద అన్నట్టు సమాచారం.

విశాఖ ఉత్తరం నుంచి లోకేష్‌?

భీమిలి నుంచి తన పుత్రరత్నం లోకేష్‌బాబును బరి లోకి దింపాలని భావించిన టీడీపీ అధినేత చంద్రబాబు  పునరాలోచనలో పడినట్టుగా చెబుతున్నారు. లోకేష్‌ను భీమిలి నుంచి కాకుండా విశాఖ ఉత్తరం నుంచి బరిలోకి దింపాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. భీమిలి నుంచి చినబాబును బరిలోకి దింపితే అవంతి శ్రీనివాస్‌పై గెలుపొందడం కష్టమని ఇంటెలిజెన్స్‌ వర్గాల సమాచారం మేరకు నియోజకవర్గ మార్పు ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి చినబాబు ను బరిలోకి దింపాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చారు. ఈ సీటును ఆశిస్తున్న ఆశావాహులతో సోమవారం సాయంత్రం భేటీ అయిన చంద్రబాబు పార్టీ యువనేత లోకేష్‌ను పంపిస్తున్నా.. గెలిపించి పంపండి, మీకు న్యాయం చేస్తానని తేల్చి చెప్పారు.. ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావును విశాఖ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దింపాలని యోచిస్తున్నట్టుగా చెబుతున్నారు.

భీమిలి నుంచి మాత్రం గంటా పోటీ చేసేందుకు భయపడుతున్నాడన్న వార్తలు విన్పిస్తున్నాయి. ఈ కారణంగానే ఈ స్థానం నుంచి ఇటీవలే టీడీపీలోకి వచ్చిన కర్రి సీతారాంను బరిలోకి దింపాలన్న ఆలోచన చేస్తున్నట్టుగా చెబుతున్నారు. విశాఖ లోక్‌సభ సీటును ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్‌ మూర్తి మనుమడు, బాలయ్య చిన్న అల్లుడు ఎం.శ్రీభరత్‌ను పూర్తిగా పక్కన పెట్టేసినట్టుగానే చెబుతున్నారు.

ఒక వేళ ఎంపీగా గంటా బరిలోకి దిగకపోతే ఈ స్థానం నుంచి విభజన హామీల సాధన సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌ పేరును పార్టీ అధినేత చంద్రబాబు పరిశీలిస్తు న్నట్టుగా చెబుతున్నారు. మరో వైపు అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగేందుకు కొణతాల ఆసక్తి చూపడంలేదని.. ఈ కారణంగా విశాఖ డెయిరీ చైర్మన్‌ ఆడారి తుల సీరావు కుమారుడు ఆడారి ఆనంద్‌ను బరిలోకి దింపనున్నట్టు చెప్పారు.

దీంతో విశాఖ ఉత్తరం సీటును ఆశిస్తున్న ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌కు తిరిగి యలమంచలి నుంచే బరిలోకి దింపనున్నట్టు చెబుతున్నారు. చోడవరం నుంచి మళ్లీ కేఎస్‌ఎన్‌ రాజు వైపే చంద్రబాబు మొగ్గు చూపుతుండగా, మాడుగుల సీటు విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement