సాక్షి, విశాఖపట్నం: ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమైనదే.. గెలుపు ఓటములను శాసించేదే.. ఒక్క ఓటు చాలు.. అభ్యర్థుల తలరాతలను తారుమారు చేయడానికి.. ఆ ఒక్క ఓటు నీదే కావచ్చు..!.. అభ్యర్థి విజయాన్ని నీ ఓటే నిర్దేశించవచ్చు.. నీకు ఓటు హక్కు ఉంటేనే.. ఆ హక్కును వినియోగించుకుంటేనే.. నీ భావి పాలకులను నిర్దేశించే స్థితిలో ఉంటావు..
అసలు ఉంటే ఎంత.. లేకపోతే ఎంత.. అని నిర్లిప్తత వహిస్తే.. రాజ్యాంగం ప్రసాదించిన హక్కును నీకు నీవే కాలరాసుకున్నవాడివవుతావు.. ప్రజాప్రతినిధులను ప్రశ్నించే నైతిక అర్హత కోల్పోతావు.. కానీ దురదృష్టవశాత్తు ఆ నిర్లక్ష్యమే మన ఘన ప్రజాస్వామ్య స్ఫూర్తిని వెక్కిరిస్తోంది. ఓటరుగా చేరడం, ఓటు హక్కు వినియోగించుకోవడంలో విద్యావంతులే అనాసక్తత ప్రదర్శిస్తుండటంతో సగం ఓట్లు కూడా పొందనివారు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైపోతున్నారు. అధికార మదంతో విర్రవీగుతున్నారు.
జనాభాలో ఓటుహక్కు పొందే వయసు వచ్చినా వేలాదిమంది దానిపై ధ్యాస చూపడం లేదు. జనాభా, ఓటర్ల సంఖ్య మధ్య కనిపించే భారీ వ్యత్యాసమే దీనికి నిదర్శనం. తాజా గణాంకాల ప్రకారం.. ఓటు హక్కు వచ్చే 18–29 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 3,97,224 మంది ఇంకా ఓటర్లు చేరనేలేదంటే నిర్లిప్తత ఎంతగా పేరుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు.
ఈ పరిస్థితి ఇకనైనా మారాలి.. వచ్చే నెలలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయాలని అందరూ శపథం పూనాలి. సరైన ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు కంకణబద్ధులు కావాలి.. అయితే దానికి ఎంతో సమయం లేదు..
మిగిలింది నాలుగు రోజులే.. ఈ నెల 15 వరకే కొత్త ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. అందుకే యువతా మేలుకో.. ఓటు ఉత్సాహం ఉరకలెయ్.. ఓటరు జాబితాలను ముంచెత్తు.. భావి నేతల ఎన్నికలో క్రియాశీల పాత్ర పోషించు..!
Comments
Please login to add a commentAdd a comment