ఎన్నికల క్రతువును ప్రకటించిన ఎలక్షన్ కమిషన్, షెడ్యూల్ ఖరారు చేయడంతో సమర శంఖం పూరించినట్టయింది. మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు.. నెల రోజుల్లో అసలు యుద్ధం జరగబోతోంది. ఈ మాసం వ్యవధిలో ప్రచారాలు, విమర్శలు, ఆగ్రహావేశాల సంగతి అటుంచితే.. నాయకులంతా ఓటరు దేవుడిని ప్రసన్నం చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో ఆ ఓటరు మహాశయుడి అంతరంగం ఎలా ఉందో.. అతనిలో అసలు మనిషి ఏమంటూ ఉంటాడో నాడి పట్టి చూపేందుకు సరదాగా చేసిన ప్రయత్నమిది.
సాక్షి, విశాఖపట్నం: ప్రతీ ఒక్కరికీ ఒక రోజు ఉంటుందంటాడు ఇంగ్లీషోడు. వాడనే పద్ధతి వేరేలే! అయితేనేం.. ఓ రోజుండకపోదుగా! అలా.. ఇన్నాళ్లకు.. ఐదేళ్లకు.. నాకూ వచ్చిందొక రోజు... సారీ.. ఒక నెల.. కచ్చితంగా చెప్పాలంటే.. ముప్పయి దినాలు. హమ్మయ్య.. ఎన్నాళ్లకెన్నాళ్లకెన్నాళ్లకూ.. అని ఎన్టీవోడి సినిమాలోలా పాడబుద్ధవుతుందిలే కానీ ఎక్స్‌ట్రాలెక్కువంటారని ఊరుకున్నా. ఎక్స్‌ట్రాలంటే గుర్తొచ్చింది కదా.. గడిచిన దాదాపు అయిదేళ్ల కాలంలో నాయకులమని, ఆమాత్యులమని, ప్రజా ప్రతినిధులమని.. ఎన్నెన్ని ఎక్స్‌ట్రాలు చేశారబ్బా మీరు!
ఈ బక్కచిక్కిన, డొక్కెండిన, దిక్కులేని, తల దాచుకునే గూడు లేని, సమస్యలతో సతమతమయ్యే, ఇబ్బందులతో అతలాకుతలమయ్యే.. బడుగు జీవిని ఎంతలా ఆడుకున్నారు మీరు! చదువుకు సీటు దొరక్క.. చేయాలంటే ఉద్యోగం లేక, ఆడపిల్లకు రక్షణ లేక, బడుగు జీవికి ఉపాధి లేక.. బాధల, కత్తుల వంతెన మీద నడుస్తూ.. కన్నీరు, నెత్తురు కారుస్తూ.. ప్రతీ రోజొక అగ్ని పరీక్షలా.. ప్రతీ దినమొక కఠిన శిక్షలా.. మేం సామాన్యులం కాలం గడిపితే.. ‘మీరెంతరా’ అన్నట్టు కూరలో కరేపాకులా తీసి పడేశారు కదయ్యా మీరు!
తస్సాదియ్యా.. ఇప్పుడొచ్చింది మాకూ ఓ రోజు.. ఏప్రిల్ రెండొకట్ల రోజు! ఏప్రిల్ 1 అంటేనే ఆల్ ఫూల్స్ డే అయితే.. రెండొకట్లు రెట్టింపు ఫూల్స్ డే కదా.. చూడండర్రా ఆ రోజు తిప్పుతా చక్రం.. ఓటు సుదర్శన చక్రం.. ఎందరిని ఒకేసారి ఫూల్స్ చేస్తానో చూడండర్రా!
ఓటేసిన రోజునే మేం ప్రభువులమని ఎగతాళి చేస్తూ ‘ఏక్ దిన్‌కా సుల్తాన్’ అంటారు మీరు వెటకారంగా మమ్మల్ని. ఆ పేరున హాస్య బ్రహ్మ జంధ్యాల రాసిన నాటిక చూశారా? ఆ ఒక్క రోజు రాజే అందరినీ గడగడలాడించేస్తాడు చూశారా? ఇద్గో.. ఇలా ఉంటాది నా ప్రతాపం. కాసుకోండి.. లెక్కేసుకోండి! అయిదేళ్లూ పడ్డదానికి లెక్క అప్పజెబుతాలే! మన గురజాడ గురువుగారు అన్నారు కదా..
తాంబూలాలిచ్చేశాను.. అని! ఎలక్షన్ కమిషన్ వోడు తాంబూలాలిచ్చేశాడు.. ఇక మీరూ మీరూ తన్నుకోండి. ఏదైనా నాకు వినోదం ఉండాలి సుమా! దారి తప్పారో.. తాట తీస్తా! మనం మర్యాదస్తులం. మర్యాదగా ఉండండి. శ్రుతి మించిపోకండి. మీ అందరి మీదా ఓటరు బాబు.. అంటే నేనే.. ఓ కన్నేసి ఉంటాడని మరిసిపోకండి. ఆడ కూతుళ్ల గౌరవం కాపాడండి. ఇది లగ్నాల సమయం. అదే.. పెళ్లిళ్ల కాలం. పెద్దోళ్లు జాతకాలు చూసి మరీ యోగ్యుడిని తెచ్చి తాళి కట్టిస్తారు.
నేను మీ అందరికీ పెద్దను కదా! జాగ్రత్తగా మీ తీరుతెన్నులు.. గత చరిత్రలు చూసి మరీ పదవీ వధువును అప్పజెబుతా. జాతకాలు తిన్నంగా లేకపోతే సరి జేస్తా. అందరి లగ్నాల్లో అధిపతి ఒక్కో రాశికీ ఒక్కో రకంగా ఉండొచ్చు గాక.. మీ లగ్నాధిపతి మాత్రం నేనే. అది గుర్తెట్టుకోండి! నన్ను మంచిగా.. ఈ ముప్పయి రోజులే కాదు.. ఆపైన కూడా చూసుకోవాల. మంచిగా చూసుకోవడమంటే మటన్ బిర్యానీ పేకెట్లో.. మందు బాటిళ్లో, మనీ కానుకలో ఇవ్వడం కాదొరేయ్! మందికి.. అంటే మనందరికీ మేలు చేయాల! నాది విశ్వరూపం.
నాలో కార్మికుడు, కర్షకుడు, శ్రామికుడు, యువకుడు, ఉద్యోగి, అక్కచెల్లెమ్మలు, అవ్వతాతలు.. అందరూ ఉన్నారు. అందరి బాగుకూ పూచీ పడాల! అప్పుడే.. ఈ ముగాంబో ఖుష్ అవుతాడు! విశ్వరూపానికి కోపం తెప్పించారో.. మాడి మసైపోతారోయ్! ఓటరు ఓటరనుచూ.. సామాన్యుడినని అశ్రద్ధ చేయుచూ.. అవహేళన చేయుచూ.. అయిదేళ్లు అధికార అహంకారముతో మీరే సామ్రాట్టులని విర్రవీగిన మీది ఎంత అవివేకమెంత అజ్ఞానము!
నేటి నుంచి ముప్పది రోజుల పాటు మా ఎడల భక్తి ప్రపత్తులతో.. గౌరవ మర్యాదలతో మెలగుటయే కాక.. రాబోవు కాలమంతటికీ మేమే రాజులమని పరిగణించి.. మా ఎడల నిరుపమాన ఆదరాభిమానములతో.. ఆప్యాయతానురాగములతో.. మెలగుదమని.. మా ఆకాంక్షలకు.. అవసరాలకు అనుగుణంగా.. జాగ్రత్తగా, జన రంజకముగా పరిపాలింతురని.. సంక్షమమునకు పెద్ద పీట వేసి.. స్వార్థమును త్యజించి.. శాసనములు రూపొందింతురని.. ప్రజలందరి సాక్షిగా ప్రమాణము చేసి తదనుగుణముగా నడచుకుందురేని..
మీరే మా హృదయాధినేతలు. కాదని విర్రవీగితిరేని.. భీషణ హుతాసనకీలా సమాన నిశిత కరవాలమును పోలు ‘ఓటు’ అస్త్ర శస్త్ర ప్రయోగముతో మీ రాజకీయమ్మన్యుల భవితవ్యమును చిందరవందర గావించెద.. మీకు రేపను మాట లేకుండా శంకరగిరి మాన్యములు పట్టించెద. ఇదే నా శపథం. ఎనీ డౌట్స్?
– బి.ఎస్.రామచంద్రరావు
Comments
Please login to add a commentAdd a comment