
సాక్షి, విశాఖపట్నం: దీపావళి పండగ వేళ విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఆదివారం నుంచి మరో కొత్త సర్వీస్‌ను స్పైస్ జెట్ ప్రారంభించింది. విశాఖపట్నం-విజయవాడ మధ్య స్పైస్ జెట్ సర్వీసు ను విశాఖ ఎంపీ ఎం.వి.వి సత్యనారాయణ లాంఛనంగా ప్రారంభించారు. స్పైస్‌జెట్ విమాన సంస్థ విశాఖ నుంచి గన్నవరానికి మంగళవారం మినహా వారంలో ఆరు రోజులు పాటు సర్వీసులు నడపనుంది. వైజాగ్ నుంచి ఉదయం 8.30 గంటలకు బయలుదేరి 9.30 గంటలకు గన్నవరం చేరుకుంటుంది. తిరిగి 9.50 గంటలకు బయలుదేరి 10.50కు వైజాగ్ చేరుకుంటుంది. నేటి నుంచి చెన్నై, సింగపూర్‌లకు కూడా నూతన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఎన్నికల సమయంలో అనివార్య కారణాల వల్ల రద్దయిన విమాన సర్వీసుల పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది.