రూ.1.91 కోట్ల విలువైన పాత నోట్లు స్వాధీనం
అల్లిపురం (విశాఖ దక్షిణం): రద్దయిన పాతనోట్లు కలిగివున్న ముగ్గురు వ్యక్తులను విశాఖ టాస్క్ఫోర్సు పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి రూ.1.91 కోట్ల విలువైన పాత రూ.500, రూ.1000 నోట్లు స్వాధీనం చేసుకున్నారు. బర్మా క్యాంప్‌కు చెందిన మెడికల్ షాపు యజమాని గెడ్డం కల్యాణ్ కుమార్, అదే ప్రాంతానికి చెందిన గుడ్ల వెంకటరమణ, మాదవధారకు చెందిన కండిబోటి వెంకటరమణ నోట్ల రద్దు సమయంలో 20 శాతం కమీషన్ పద్ధతిలో పాతనోట్లను మార్చేవారు.
పాతనోట్ల మార్పిడికి ఆర్బీఐ ఇచ్చిన గడువు పూర్తవడంతో వీరి వద్ద రూ.1.91 కోట్ల విలువైన పాతనోట్లు మిగిలిపోయాయి. వీటిని అక్కయపాలెంలోని ఓ అపార్ట్మెంట్లో దాచారు. విశ్వసనీయ సమాచారంతో టాస్క్‌ఫోర్స్ ఏసీపీ చిట్టిబాబు, సిబ్బంది దాడిచేసి నిందితుల నుంచి ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.