ఆది నుంచి ఆయనంతే.!
నగరంలో ఉన్నన్నాళ్లూ వివాదాలే
సంచలన కేసుల్లో తెరవెనుక సెటిల్మెంట్లు
టీడీపీకి అత్యంత విధేయుడిగా నడుచుకున్న అధికారి
ప్రజలు,ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దురుసుతనం
నట్టి కుమార్ నోటి వెంట మరోసారి బహిర్గతం
సాక్షి,విశాఖపట్నం: న్యాయం చేయమంటే నా వల్ల కాదని విశాఖ ఏసీపీ రమణమూర్తి తప్పించుకున్నారని సినీ నిర్మాత నట్టి కుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. గ్యాంగ్ స్టర్ నయీమ్ అక్రమాలకు ఎందరో పోలీసు ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు కొమ్ముకాశారంటూ అదే సమయంలో రమణ పేరును నట్టి కుమార్ ప్రస్థావించడంతో నయీంతో రమణ సంబంధాలపై నగరంలో చర్చ జరుగుతోంది. విశాఖ ఈస్ట్ సర్కిల్ ఏసీపీగా పనిచేసిన రమణ ఆది నుంచి వివాదస్పదుడే. టీడీపీ ప్రభుత్వానికి అత్యంత విధేయునిగా పనిచేస్తూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సైతం లెక్కచేయకుండా వారి పట్ల పలుమార్లు దురుసుగా ప్రవర్తించిన రమణ వివిధ కేసుల్లో సెటిల్మెంట్లు చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. వాటిలో ప్రధానంగా నగరంలో సంచలనమైన ఓ హిజ్రా హత్య కేసును నీరుగార్చడం వెనుక ఏసీపీ ప్రోద్బలం ఉందని అప్పట్లో ఆరోపణలు విన్పించాయి. ఈ కేసులో అధికారపార్టీకి చెందిన ఓ నేతను కాపాడేందుకు అప్పట్లో చాలా తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. చివరికి కేసును పక్కదారి పట్టించి ఆ నేతకు ఎలాంటి సమస్య లేకుండా చేసేశారు. ఇలాంటి సెటిల్మెంట్లు ఆయనకు నిత్యకత్యమనే ఆరోపణలు గుప్పుమన్నప్పటికీ అధికార పార్టీ అండ ఉండటంతో అతనిపై జోలికి వెళ్లేందుకు ఎవరూ సాహసించేవారుకాదు.
ఇక ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేఖంగా ఏ కార్యక్రమం చేపట్టినా అక్కడ రమణ వాలిపోయేవారు. వారిని అణచివేసేవారు. ఒకానొక సందర్భంలో సాక్షాత్తూ ప్రతిపక్ష మహిళా ఎమ్మెల్యే పట్ల అనుచితంగా ప్రవర్తించి విమర్శల పాలయ్యారు. తాజాగా నయీం కేసును కూడా రమణమూర్తి పట్టించుకోలేదని నిర్మాత నట్టికుమార్ బయటపెట్టడంతో రమణకు నయీంకు సంబంధాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నయీం కేసును రమణ ఎందుకు పట్టించుకోలేదనే ప్రశ్న పలు అనుమానాలకు తావిస్తోంది. కొన్ని నెలల క్రితం సాధారణ బదిలీల్లో భాగంగా బదిలీౖయెన రమణకు వెంటనే పోస్టింగ్ ఇవ్వకుండా వేకెన్సీ రిజర్వ్ ఉంచడం వెనక కూడా ఆయపపై వచ్చిన ఆరోపణలే కారణమని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో రమణ విశాఖలో పనిచేసినప్పుడు ఆయన డీల్ చేసిన కేసుల వివరాలను పరిశీలిస్తే అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.