స్నేహ గీతం
విశాఖలో కలిసిన పెద్దాపురం పూర్వ విద్యార్థులు
మధుర స్మృతులను నెమరేసుకొని కేరింతలు
విశాఖపట్నం: మూడున్నర దశాబ్దాలక్రితంనాటి మాట.... పెద్దాపురం ఎస్‌ఆర్‌వీబీఎస్‌జేబీ మహారాణి కళాశాలలో అందరూ కలిసి చదువుకున్నారు....ఆడుకున్నారు...పోటీపడ్డారు...కొండొకచో తలపడ్డారు. ఇన్నాళ్లకు మళ్లీ అందరూ ఒక్కటయ్యారు. గత స్మృతులను నెమరేసుకున్నారు. గొడవలను గుర్తు చేసుకుని మనసారా నవ్వుకున్నారు. అల్లరి ఉదంతాలు మళ్లీ అలరించాయి. వేదికపై రక్తికట్టాయి. భవిష్యత్తుపై ఆనాడు ఏమనుకున్నారో... ఇప్పుడు ఏమైందో లెక్కలు వేసుకున్నారు. తమ లెక్క ఎక్కడ తప్పిందో ఏకరువు పెట్టినవారు కొందరైతే... ఏంచేసి దూసుకుపోయామో వివరించినవారు మరికొందరు. తమ జీవన ప్రయాణంలోని మేలిమలుపులను వెల్లడించారు ఇంకొందరు. ఇదంతా విశాఖ డాబాగార్డెన్స్‌లోని హోటల్ చంద్ర (నెల్లూరు మెస్)లో చోటుచేసుకున్న పండగ. సహ విద్యార్థులుగా ఉండి కనుమూసిన ఏడుగురి స్మృతికి ఈ సమావేశంలో ఘనంగా నివాళులర్పించారు. మహారాణి కళాశాలలో చదువు చెప్పిన గురువుల గురించి... పాఠ్యాంశాల బోధనలో వారు పాటించిన మెలకువల గురించి గుర్తుచేసుకున్నారు.
ఆనాటి ప్రిన్సిపాల్ శేషగిరిరావు, ల్ఛ్చెరర్లు తమ ఉన్నతి కోసం ఎంతగా తపించారో మననం చేసుకున్నారు. పేరుపేరునా స్మరించారు. మనలో సమస్యలెదురై ఇబ్బందులు పడుతున్నవారికి అందరం కలిసి ఆసరాగా నిలుద్దామని ఇప్పుడు విశాఖలో ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్‌గా ఉన్న విద్యావేత్త బి.తిరుపతిరాజు ప్రతిపాదించారు. పారిశ్రామికవేత్తగా ఉన్న యార్లగడ్డ సూర్యారావు సై అన్నారు. తన వంతు సాయం ఏ రూపంలోనైనా ఉంటుందని భరోసా ఇచ్చారు సీబీ సీఐడీ డీఎస్పీ (రాజమండ్రి) రాజగోపాల్. ఎవరమూ ఒంటరి అనుకోవద్దన్నారు శేరు వీరభద్రరావు. ఇకపై తరచు కలుద్దామని ప్రతిపాదించారు.