పాతబస్తీలో భారీ బందోబస్తు
పంద్రాగస్టు సందర్భంగా పాతబస్తీలోని చార్మినార్, మీర్‌చౌక్, ఫలక్‌నుమా, సంతోష్‌నగర్ ఏసీపీలతో పాటు ఇన్స్పెక్టర్లతో కలిసి దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ ఇప్పటికే సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా దక్షిణ మండలం పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు.
ఇందులో భాగంగా చార్మినార్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో చార్మినార్ ఏసీపీ పరిధిలోని హుస్సేనీఆలం,బహదూర్‌పురా,కామాటిపురా పోలీసు స్టేషన్ల పరిధిలోని హోటళ్లు,లాడ్జీలలో తనిఖీలు నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాతబస్తీలోని కీలకమైన అన్ని ప్రాంతాలలో తనిఖీలు కొనసాగించారు. తనిఖీల సందర్భంగా బ్యాగులు, టిఫిన్ బాక్స్‌లు, వాహనాల డిక్కీలను క్షుణ్ణంగా పరిశీలించారు.
రద్దీ గల ప్రాంతాలలో ఈ తనిఖీలు కొనసాగాయి. ఎక్కడైనా అనుమానిత వస్తువులు కనిపించిన వెంటనే స్థానికులు తమకు సమాచారం అందజేయాలని పోలీసులు కోరుతున్నారు. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు. సైకిళ్లు, టిఫిన్ బాక్స్‌లు, బ్యాగులు అనుమానంగా కనిపిస్తే సంబంధిత పోలీసులకు సమాచారం అందజేయాలని డీసీపీ సత్యనారాయణ పాతబస్తీ ప్రజలను కోరారు.