హెచ్‌సీయూ విద్యార్థి ఆత్మహత్య
వ్యక్తిగత సమస్యలే కారణం!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) పరిశోధక విద్యార్థి విశాల్ టాండన్ (43) శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. జెండర్ స్టడీస్‌లో పీహెచ్డీ చేస్తున్న విశాల్... నల్లగండ్లలో తాను నివశిస్తున్న అపర్ణాసరోవర్ అపార్టుమెంటు 14వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వ్యక్తిగత సమస్యలే అతడి మరణానికి కారణమని తెలుస్తోంది. పంజాబ్‌కి చెందిన విశాల్ క్యాంపస్ దగ్గర్లోని అపర్ణాసరోవర్లో తల్లితో కలసి ఉంటున్నాడు. కాగా, నెల కిందట తల్లి ముంబైలోని కుమార్తె వద్దకు వెళ్లారు.
జీవితంలో రాణించలేకపోతున్నానని, ఇంకా అమ్మపైనే ఆధారపడాల్సి వస్తోందని విశాల్ కొంతకాలంగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నాడు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో తన సోదరికి మెయిల్ పంపి, అపార్టుమెంటు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘నన్ను క్షమించండి. లవ్ యూ వెరీమచ్’అంటూ విశాల్ సోదరికి పంపిన మెయిల్లో పేర్కొన్నట్టు చందానగర్ సీఐ తిరుపతిరావు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఉద్యమంలో విశాల్ కీలకపాత్ర పోషించాడని, అభ్యుదయ వాదని స్నేహితులు చెబుతున్నారు.