అనువాదం కత్తి మీద సాము
అన్నానగర్, న్యూస్‌లైన్: అనువాదం చేయడమంటే కత్తి మీద సాము వంటిదేనని కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు విశ్వనాథ్ ప్రసాద్ తివారీ పేర్కొన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ ఉత్తమ అనువాదకుల అవార్డుల-2012 ప్రదానోత్సవం చెన్నైలోని సర్ పిట్టీ త్యాగరాయ హాలులో శుక్రవారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విశ్వనాథ్ ప్రసాద్ తివారీ ప్రసంగిం చారు. అనువాదాలు పాఠకులకు ఇతర భాషా రచయితలతో పరిచయూలు పెంచుతాయన్నారు. భిన్నభాషల మధ్య వారధి అనువాదమే అన్నారు. అనంతరం ప్రముఖ తమిళ రచయిత అశోక్మిత్రన్ మాట్లాడారు. అనువాదకులను ప్రోత్సహించేందుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవిరళ కృషి చేస్తోందన్నారు.
అకాడమీకి తమిళనాడు నుంచే అత్యధిక ఆర్డర్లు అందుతున్నాయన్నారు. రచయితలు ఏ భాషలో రచన చేసినా అందులోని భావం ప్రధానమన్నారు. ఈ విషయూన్ని అనువాదం ఇతర ప్రాంతీయ భాషల పాఠకులకు విశదీకరిస్తుందన్నారు. అకాడమీ ప్రతియేటా అనువాదకుల విభాగంలో 24 మంది కొత్త అనువాదకులకు స్థానం కల్పిస్తోందన్నారు. అనువాదాల ద్వారా అకాడమీ వివిధ భాషా రచనలను-రచయితలను దేశానికి పరిచయం చేయడం అభినందనీయమన్నారు.
అనంతరం ఉత్తమ అనువాదాలు చేసిన 24 మందికి ప్రసాద్తివారీ, అశోక్ మిత్రన్, కె.శ్రీనివాసరావు తదితరులు అవార్డులను అందజేశారు. అవార్డు గ్రహీతలకు తామ్రపత్రం, రూ.50 వేల చొప్పున అందజేశారు. అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు అనువాదకులను, ఇతర ప్రముఖులను సభకు పరిచయం చేశారు. అకాడమీ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ కంబార్ వందన సమర్పణ చేశారు. ప్రసంగాల అనంతరం నృత్యాలను ప్రదర్శిం చారు. ఈ కార్యక్రమంలో కె.శివారెడ్డి, ఎం.నరేంద్ర, ఆచార్య ఎన్.గోపి తదితరులు పాల్గొన్నారు.