పిపీలికం.. ఈవారం కథ
పూర్వం కృతయుగంలో, ఒకానొక ప్రజాపతి రాజ్యం చేసే కాలంలో, గౌతమీ నదికి ఉత్తరంగా శ్యామవనం అనే అడవిలో ఓ పెద్ద మర్రిచెట్టొకటి ఉండేదిట. ఆ మర్రిచెట్టు కింద, దాని మానుని ఆనుకొని ఓ పెద్ద చీమలపుట్ట ఉండేదిట. అందులో నివసించే ఒకానొక చీమకి ఒకనాడు ఉన్నట్టుండి తనెవరో ఏమిటో తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగిందట.
తనెవరో అనే విషయం గురించి ఆ చీమ చాలా తీవ్రంగా ఆలోచించనారంభించిందట (ఆలోచించి పనిచెయ్యడం మంచిదే? కాని, ఆలోచన ఒకప్పుడు పనికి అంతరాయం కలిగిస్తుంది). పనీ పాటు సరిగా చెయ్యకుండా ఆ చీమ ఆలోచనల్లో పడి కూర్చుండిపోయేసరికి తోటి చీమలు దానిని చీవాట్లు పెట్టేయట. ‘పని చెయ్యని ప్రాణులు చెడి పోతాయిస్మా!’ అని అవి దాన్ని హెచ్చరించేయిట. అయినప్పటికీ దాని ఆలోచనలది మానింది కాదట.
నేనెవర్ని? కళ్లనా, కాళ్లనా, తలనా, మొండేన్నా? ఎవరు నేను? నేను తినే తిండినా నేను? నా ఆలోచించే శక్తినా నేను? ఎవర్ని నేను? ఎందుకు పుట్టేన్నేను? ఎందుకు జీవిస్తున్నాన్నేను? ఎందుకు ఛస్తాను? చచ్చి నేనేమవుతాను? ఎవర్ని, నేనెవర్ని? ఇటువంటి ఆలోచనలతో చీమకి నిద్ర చెడిందట. ఆరోగ్యం క్షీణించిందట. తల కూడా చీమవాసంత పాడైందట. ఆరోగ్యం క్షీణించి, ఆలోచనలు ఎక్కువవడంతో దాని పరిస్థితి చాలా గందరగోళంగా మారిందట.
అప్పుడు, ఆ చిరుచీమ దురవస్థ చూసి, దానికి మరొక చీమ హితబోధ చేసిందట.. ‘ఒరే సోదరా అంతుచిక్కని ఆలోచనలతో ఎందుకలా తల బద్దలు కొట్టుకుంటావు? అలా చేసుకొనేదానికి మారుగా అనుభవశాలినెవరినైనా అడిగి చూడకూడదా? నే చెప్పేమాట విను. ఇక్కడికి మూడు ఆమడల దూరంలో గొపన్నపాలెం అనే గ్రామం ఉంది. అక్కడ నిగమశర్మ అనే బ్రాహ్మణుడున్నాడు. నీ ప్రశ్నలన్నింటికీ ఆయన సమాధానం చెప్పగలడేమో వెళ్లి అడుగు! అలా చెయ్యి!’ అని హితబోధ చేసిందిట సోదర పిపీలికం.
ఆ హితబోధ విని ఆనందించిన మన చిరుచీమ, పనికట్టుకొని, పెను ప్రయాసలకోర్చి ప్రయాణం చేసి, గోపన్నపాలెం చేరుకొని, నిగమశర్మ ఇంటికి వెళ్లిందట. ఆత్మపదార్థానికైనా సరే, బ్రహ్మపదార్థానికైనా సరే ఆకలి మాత్రం తప్పదని గోపన్నపాలెపు నిగమశర్మకు బాగా తెలుసునట.
మన చిరుచీమ అతని ఇల్లు చేరుకునే సమయానికి అతడు గొప్ప ఆకలి మీద ఉన్నాడట. మన చీమ అతని వైపు జ్ఞానకాంక్షతో చూస్తే, అతడు మన చీమని ఆకలి చూపు చూసేడట. కాని, నిగమశర్మ సర్వభక్షకుడు కాడట. అతడు చీమలని కాని, మానవులను కాని తినడట (వారి కష్టాన్నే తినగలడట).
చీమని చికాకుగా చూసి ‘ఏమిరా పిల్లవాడా! ఎందుకొచ్చేవు? నీకు నాతో ఏమి పనుంది?’ అని ప్రశ్నించేట్ట నిగమశర్మ.
అప్పుడు ఆ చీమ ముందు కాళ్లు వంచి, తల నేలకి ఆన్చి, ‘స్వామీ! నేనెవర్ని? ఎందుకు పుట్టేను? ఎందకు బతుకుతున్నాను? ఎందుకు ఛస్తాను?’ అని సవినయంగా ప్రశ్నించి తన రాకకి కారణం నిగమశర్మకి తెలియజేసిందట.
గోపన్నపాలెపు గోపకుమారుల్లో కొంతమందికి విద్యాభ్యాసం చేయాలనే వాంఛ కలిగినపుడు ‘ఆలమందలు కాసుకొనేవాళ్లకి ఓనమాలెందుకురా!’ అని వారిని నిగమశర్మ లోగడ నిరుత్సాహపరిచేవాడుట. అందుచేత వాడు ఓనమానాలవంక రావడం మానివేసేరట. ఆ గ్రామంలో క్షత్రియులెవరూ లేరు. ఒక వైశ్యుడున్నాడట! కాని, అతనికి లాభాల చదువే కాని ఓనమాల చదువు అక్కరలేకపోయిందట.
మరింక బ్రాహ్మణులున్నారా అంటే.. ఆ గ్రామానికి నిగమశర్మ ఒంటి బ్రాహ్మణుడుట. దానా దీనా, నలుగురికి నాలుగేసి అక్షరాలు చెప్పి నాలుగు నూకలు సంపాదించే అవకాశం నిగమశర్మకీ లేకపోయిందిట. ఇంటికి మూడేసి నూకలు చొప్పున ముష్టెత్తుకుంటూ, సగం ఆకలితో బతికే నిగమశర్మకి జ్ఞానకాంక్షతో వచ్చిన చిరుచీమని చూడగానే బెండెడాస, కొండంత ఉత్సాహమూ కలిగేయట.
‘మానవేతర జీవుల్లో జాతి భేదప్రమేయం లేదు కాబట్టి’ ఈ చీమకి చదువు చెప్పి నాలుగు నూకలు లాగొచ్చు కదా అని అతను చాలా సంబరపడ్డాట్ట.
చీమ మాటలు విన్నాక నిగమశర్మ క్షణంసేపు ఆలోచించి గొంతుక సవరించుకొని, ‘అబ్బో! మంచి జిజ్ఞాసతోనే వచ్చేవే! కాని చూడు. నువ్వు తెలుసుకోవాలనే విషయాలన్నీ తెలుసుకోవాలంటే చాలా చదువుకోవాలే!’ అన్నాడట.
‘అలాగయితే స్వామీ, ఆ చదువు నాకు మీరే చెప్పాలి!’ అందిట చిరుచీమ.
‘అలాగే చెప్తాను. కాని, ఒక యదార్థం ఉంది. ఆకలితో మాడి చచ్చేవాడు ఆ పరమాత్ముడైనా సరే ఎవరికీ పాఠాలు చెప్పలేడు. వాడికి ఆ శక్తికాని, ఆ ఇచ్ఛకాని ఉండవు. నేనిప్పుడు ఆ స్థితిలోనే ఉన్నాను’ అని చెప్పి ఊరుకున్నాడు నిగమశర్మ.
చిరుచీమకు ఏం చెయ్యాలో తెలియక.. ‘మరైతే నేనేం చేయాలి స్వామీ?’ అని అమాయకంగా అడిగిందట. అందుకు సమాధానంగా, ‘ప్రతిదినం నాకు ఓ గిద్దెడు నూకలియ్యి. అంతే చాలు! అందుకు సమ్మతిస్తివా, నేన్నీకు చెప్పగలను చదువు’ అని ఆశని గాంభీర్యం వెనకదాచి తన యదార్థపు కోరిక తెలిజేసేడట చీమకి శర్మ.
అప్పుడా చిరుచీమ తెగ సంతోషించి నిగమశర్మకి నమస్కరించి ‘స్వామీ! ఎంతటి కష్టమైనా సరే నేను లెక్కచేయను. నాకు చదువు కావాలి!’ అని తన అభీష్టం గ్రహించి, ఆ క్షణం నుంచీ ఎద్దులా కష్టపడి గింజ గింజ చొప్పున గిద్దెడు గింజలూ ప్రతిదినం గురువుకి సమర్పించి అతని దగ్గర చదువులు కొన్ని నేర్చుకుందిట.
నిగమశర్మ ఆ చీమకి అక్షరమాలంతా నేర్పేడట. గుణింతాలన్నీ మప్పేడట. దానిచేత ‘తల, వల’ అన్నీ చదివించేడట. దానికి అంకెలన్నీ చూపించి, కుడికలూ, కొట్టివేతలూ చెప్పేడట. అంతకంటే ఎక్కువ చదువులు అతనికి రావట. అందుచేత తను చెప్పగలిగినమేరకి వీలైనంత ఆలస్యంగా చదువులన్నీ చెప్పి చివరిదినం చీమని పిలిచి, ‘నువ్వెవరవో నీకిప్పుడు తెలిసిందా?’ అని అడిగేడట నిగమశర్మ.
‘నేనెవర్ని స్వామీ! వేగిరం చెప్పండి స్వామీ!’ అని ఎంతో కుతూహలంగా తొందర తొందరగా అడిగిందట చీమ.
అప్పుడు నిగమశర్మ పరబ్రహ్మంలా నవ్వి, ‘మరెవరికీ కావు! నువ్వు చీమవి!’ అన్నాట్ట.
‘ఆహా! నేను చీమనా!!’ అని ఆశ్చర్యచకితురాలైపోయి, ఆ తరవాత పరమానందభరితురాలైపోయిందట చిరుచీమ.
‘మరింక చదువైపోయింది. నువ్వు వెళ్లవచ్చు’ అని నిట్టూర్చి అన్నాడట చీమశిష్యుడితో గురుశర్మ.
చీమ జ్ఞానం సంపాదించిన చిరుచీమ కృతజ్ఞతాపూర్వకంగా మరొక నాలుగు దినాల నూకలు నిగమశర్మకి కట్నంకింద సమర్పించుకొని, ఎగురుతూ, గెంతుతూ, శ్యామవనం వెళ్లి తన సోదరులందరికీ జ్ఞానం పంచిందట. ఆ చీమలన్నీ కూడా ‘ఆహా! అయితే, మనమంతా చీమలన్నమాట!’ అని సంబరపడి చీమలు పండుగ జరుపుకున్నాయట.
అయితే – మన చీమ సంతోషంగా శ్యామవనం చేరుకొని పుట్టినింటికి వెళ్లిందేకాని దానికి ఆ సంతోషం ఎక్కువ దినాలుండలేదట. దానికి అనుమానాలన్నీ మళ్లీ పుట్టుకురాసాగేయట.
‘చీమంటే ఏమిటి? కళ్లా, కాళ్లా, తలా, మొండెమా? కాళ్లు లేకపోతే నేను చీమని కానా? కళ్లు లేకపోతే నేను చీమకంటే భిన్నమవుదునా? చీమ అనే ఈ పదార్థం ఎందులో వుంది? ఇది ఇలాగే ఎందుకు పుట్టాలి? ఇది ఇలాగే ఎందుకు బతకాలి? ఈలాగే ఎందుకు చావాలి?’
ఇటువంటి చిక్కు ప్రశ్నలన్నీ ఆ చీమని తిరిగి చికాకుపెట్టసాగేయట. దాని ఆరోగ్యం మళ్లీ పాడవనారంభించిదట. ఈ పెను ప్రశ్నలన్నీ నేను చీమని అనే చిరుజ్ఞానంతో విడవని తెలుసుకొని, అది తిరిగి పాత గురుశర్మ దగ్గరకి పరుగెట్టుకుంటూ వెళ్లి తన సందేహాలన్నీ నివృత్తి చేయమని పాదం పట్టుకొని ప్రార్థించిందట.
‘ఆ జ్ఞానమే నాకుంటే అరసోలడు నూకలకి నీ అన్ని సందేహాలు తీర్చేయనా?’ అని లోలోపల అనుకున్నాడట. ఆకలితో ఉన్న నిగమశర్మ, ప్రకాశంగా చీమతో.
‘నీ సందేహ నివృత్తి నేను చెయ్యలేను’ అన్నాడట.
‘పోనీ! చేసే జ్ఞానిని చూపించండి స్వామీ!’ అని బతిమాలిందట చిరుచీమ.
అందుమీదట, తనకి తెలిసిన జ్ఞానుల గురించి ఆలోచించి ‘శిష్యుడా! నీ సందేహాలకు సమాధానాలు చెప్పగలిగే మహానుభావుడు నాకొక్కడే కనిపిస్తున్నాడు. ఇక్కడికి మూడు ఆమడల దూరంలో జన్నాలపల్లె అనే అగ్రహారం ఒకటుంది. ఆ అగ్రహారంలో చతుర్వేది అనే సద్బ్రాహ్మణుడున్నాడు. నువ్వు వెళ్లి ఆయన కాళ్ల మీద పడి, జ్ఞానభిక్ష పెట్టమని ప్రార్థించు’ అని చెప్పేడట నిగమశర్మ. ఆ చతుర్వేదికి చీమ విషయాలన్నీ తెలియజేస్తూ ఓ తాటాకు మీద జాబు కూడా రాసేడట శర్మ.
ఆ తాటాకు ఈడ్చుకుంటూ, కొన్ని దినాలు కాలినడకన ప్రయాణం చేసి జన్నాలపల్లె చేరుకొందిట చీమ.
నిగమశర్మ చెప్పినట్టుగానే జన్నాలపల్లెలో ‘చతుర్వేది’ అని పిలువబడే వేదవేదాంగవేద్యుడు తప్పక ఉన్నాడట. కాని, చీమ వెళ్లే సమయానికి ఆయన వేదపారాయణంలో ఉన్నాడట. ఆ పిమ్మట ఆయన శిష్యులచే పరివేష్టించబడి ఉన్నాడట. పరమగురువు దరికి పరదేశి చీమ చేరకుండా వారి సచ్ఛిష్యులంతా చాలా తంటాలు పడ్డారట. యమ ప్రయాసలకి ఓర్చి మన చీమ ఆ చతుర్వేదిని కలుసుకొని నిగమశర్మ నుంచి తెచ్చిన పరిచయపత్రం ఆయనకి చూపించగలిగేసరికి దానికి తల ప్రాణం తోకకి వచ్చిందట.
తాటాకు చదివి చిరుచీమని చూసి చతుర్వేదిగారు స్మితవదనులయేరట. ‘అయితే, వేదాలన్నీ తెలుసుకోవాలనుందా నీకు?’ అని చీమని వారు పృచ్ఛించేరట.
‘తమరు అనుగ్రహిస్తే తెలుసుకోగలను’ అందిట సవినయపు చీమ.
‘నాలో ఏమీ లేదు నాయనా! అంతా భగవదనుగ్రహం!’ అన్నారట చతుర్వేదిగారు.
‘వేదాలు తెలుసుకొందికి భగవదనుగ్రహం ఉండాలంటే అది బ్రాహ్మణపు చీమ అయివుండవలెను కదా?’ అని అంతలో చతుర్వేదిగారి శిష్యుడొకడు ఒక చిన్న సందేహరూపంలో తన అభ్యంతరం తెలియజేశాడట. ఆ విషయం గురించి కొంత చర్చ జరగవలసిందే కాని చతుర్వేదిగారు వేదాలు తెలిసిన అధికారంతో చర్చ జరగనీయకుండా చేసేరట.
‘సద్భుద్ధి కలవాడే సద్బ్రాహ్మణుడు. పుట్టు బ్రాహ్మణులు వచ్చేటికాలం కలికాలం కాని ఈ కాలం కాదు. ఈ చీమకి సద్బుద్ధికలదని నా బుద్ధికి తోస్తోంది. చిన్న చిన్న చిరుపాపాలేవయినా ఈ చీమ చేసి వున్నప్పటికీ, శుద్ధిచేసి ఈ చీమని మనం బ్రాహ్మణ్యంలోకి మార్చుకోవచ్చును’ అన్నారట చతుర్వేదిగారు.
శిష్యులంతా గురువాక్యం శిరసావహించవలసి వచ్చిందట! కాని వారు తమ కోపాల్ని తమతమ కడుపుల్లో దాచుకొని, చీమకి వాతలు పెట్టి శుద్ధిచేద్దామని సంకల్పించేసరికి, ‘వాతలు పెట్టినట్లయితే ఎందుకు చస్తానో తెలుసుకోకుండానే చస్తాను మొర్రో’ మని చిరుచీమ పెనుకేకలు వేసి, గోల చేసిందిట. కేకలు విని పరుగిడి వచ్చిన చతుర్వేదిగారు శిష్యుల్ని వారించి, వాతలకి మారుగా మంత్రజలం జల్లి, ఆ చీమని శుద్ధిచేసి దానికి బ్రాహ్మణ్యం ఇప్పించేరట.
చతుర్వేదిగారు నిర్దిష్టంగా గురుకట్నం నిర్ణయించే అలవాటు ఎన్నడూ చేసుకోలేదటగాని, వారు యజ్ఞం చేయదలచుకున్నారట. హిరణ్యం కొంతైనా లేనిదే యజ్ఞం జరగడం కష్టంట. అందుచేత చీమకి వేదాలూ, వాటి సారాలూ తెలియజేసేముందు చతుర్వేదిగారు ఓ చిన్న నిబంధన చేసేరట.
ఆ నిబంధన ఏమిటో వినిన చీమ, ‘అయ్యో! బంగారపు బరువు నేనే భరించలేనే! తాటాకే మొయ్యలేకపోయేను కదా!’ అందిట.
‘రేణువు రేణువు చొప్పున ఎంత తేగలిగితే అంతే తే! చాలు!’ అని చాలా సౌమ్యంగా సెలవిచ్చేరట చతుర్వేదిగారు.
రేణువు రేణువు చొప్పున తేగలిగినంత హిరణ్యం తెచ్చుకున్న చీమ సంవత్సరాలపాటు శ్రమించి, చతుర్వేదిగారి వల్ల వేదవేదాంగాలన్నీ తెలుసుకొని ధన్యుడయేననుకుందిట మన చిరుచీమ.
అధ్యయనం అంతా అయిన పిమ్మట చతుర్వేదిగారి వల్ల వేదసారం అంతా ఒకేఒక మాటలో ఉన్నదని తెలుసుకున్నదట మన చీమ.
ఏమిటది!
‘సోహం!’ అన్నారట చతుర్వేదిగారు.
‘సోహం’ అందిట చిరుచీమ. అన్నాక – ‘అంటే ఏమిటి స్వామీ!’ అని అడిగిందట చీమ.
అంటే ఏమిటో అంతా బోధించేరట చతుర్వేదిగారు. అంటే ఏమిటో అంతా విన్నాక,
‘అయితే ఏమిటి?’ అని ప్రశ్నించిందిట పిపీలికం. చదువైపోయిందన్నారట చతుర్వేదిగారు.
శ్యామవనం చేరుకొంది పిపీలికం. బ్రహ్మజ్ఞానం పొందినప్పటికీ బ్రతుకులో ఏం తేడా కూడా కనిపించకపోయేసరికి చీమ చాలా నిరుత్సాహపడిపోయిందట. బ్రహ్మజ్ఞానంతో దాని తలంతా నిండిపోయి దాదాపు పండిపోయినప్పటికి కూడా బతుకులో దానికి వెతుకులాటలూ, పీకులాటలూ, బరువులూ, బాధ్యతలూ, కష్టాలూ, కడగళ్లూ ఏమీ తప్పలేదుట!
బ్రహ్మజ్ఞానం పొంది కూడా నీరసించిపోతున్న మన చీమని చూసి మరొక చీమ చాలా వగచి ఈ విధంగా హితవు చెప్పిందట.. ‘నువ్వెందుకు తమ్ముడా, అలా నీరసించిపోతావు. వేదవేద్యుల కంటె గొప్పవారు మహా రుషులని పిలువబడేవారున్నారని విన్నాను. మన ఈ వనంలోనే ఏడు కొండల అవతల నుంచి వచ్చిన సోదరుణ్ణి ఒకణ్ణి ఈమధ్యనే నేను కలియడం తటస్థించింది.
వాళ్లు ఉన్న దగ్గర ఒక మహారుషి ఎన్నాళ్లనుంచో తపస్సు చేస్తున్నాడట. ఆ మహారుషి చుట్టూనే వాళ్లంతా పుట్ట పెట్టుకుని జీవిస్తున్నారట. పోయి నీ బాధంతా ఆ మహానుభావునితో చెప్పుకోకూడదా!’ అని హితబోధ చేసిందట ఆ మరోక చీమ.
హితవు చెప్పినందుకు ఆ మరొక చీమకి నమస్కరించి రుషిపుంగవుణ్ణి వెతుక్కుంటూ ఏడుకొండలూ దాటి వెళ్లిందట మన చీమ.
అక్కడ ఒక చిన్న గుట్టంత పుట్ట వుందిట. అందులో చీమలెన్నెన్నో వున్నాయిట. ఆ పుట్టలోనే మహారుషి ఉన్నారని తెలుసుకొని ఆ పుట్ట అధికారులైన చీమల అనుమతి పొంది అందులోనికి ప్రవేశించి, అక్కడ మట్టితో, జటలతో, చీమలతో నిండిపోయినప్పటికీ నిశ్చింతగా తపస్సు చేసుకొంటున్న ఆ తాపసోత్తముల వారిని కళ్లారా చూచి ఆ మహానుభావునికి వినయాతి వినయంగా వంగి నమస్కరించి వారిని మృదువుగా, వినయంగా సంస్కృత శబ్దాలతో పిలిచిందిట చీమ.
చీమలపుట్టలో దేవభాష వినబడగానే రుషిపుంగవులవారు ఉలికిపడి కళ్లుతెరచి మన చీమని గుర్తించి, ‘నీకు ఏమి కావలెను నాయనా?’ అని దాన్ని శాంతంగా అడిగేరట. వెదురు బొంగులోంచి గాలి వచ్చినట్టుగా గంభీరంగా ఉన్నదట వారి స్వరం.
చీమ అప్పుడు తన విషయం అంతా వారితో వివరంగా చెప్పుకున్నదట. ‘నాలో నిజంగా భాగవత్పదార్థం ఉన్నదా? ఉంటే భగవంతుడికంటే భిన్నమేరీతిగా అయేను? నాలో భగవంతుడు లేకనేపోయినట్లయితే భగవంతుడు సర్వవ్యాపకుడు కానట్టే కదా! అందుచేతా అతడు నాలో ఉన్నట్టే లెక్క చేసుకోవాలి కదా! అతను నాలో ఉన్నప్పటికీ నేను ఇన్ని బాధలేల పడవలెను?
అది నా పాపకర్మల ఫలితమనుకొన్నచో భగవంతుడు నాలో ఉండగా, ఆ పాపములు నేను చేయుటెట్లు సంభవించినది? భగవంతుడు కూడా పాపము నుంచి తప్పించుకొనలేడా? ఇంతకీ నేనెవర్ని? నేనీరీతిగా ఎందుకుండిపోయాను? ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? అంతా నాకు తెలియజెప్పండి స్వామీ!’ అందిట చీమ.
చీమ వాక్కులు శ్రద్ధగా విన్న రుషిసత్తములు శాంతంగా ఈ విధంగా సెలవిచ్చేరట!
‘బ్రహ్మజ్ఞానం విని విని సాధించేనంటే లాభంలేదు చీమా! ‘సో2హం’ అనేది అందరికీ తెలుసు. దాన్ని ఆచరణలో సాధించి అనుభవం పొందాలంటే యోగంలోనే సాధ్యపడుతుంది. అందుచేత యోగసాధన చేసి తపస్సుచేయి’ అని సెలవిచ్చేరట.
వారు అలా సెలవిచ్చినందుకు వారికి నమస్కరించి, ‘తపస్సు చేస్తే జరిగేదేమిటి స్వామీ?’ అని ప్రశ్నించిందట చిరుచీమ.
‘జన్మరాహిత్యం సంపాదించి మోక్షం పొందడమే ఏ జీవికైనా గమ్యం! తపస్సు వల్ల అది సిద్ధిస్తుంది’ అన్నారట రుషిపుంగవులు.
చిరుచీమ ఒక క్షణం అలా నిలబడి, ‘ఇంతకీ స్వామీ! ఏ జీవికైనా జన్మరాహిత్యం ఎందుకు! మోక్షం ఎందుకు? తెలియక అడుగుతున్నందుకు క్షమించండి’ అన్నదట.
చీమ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా మౌనముద్రాలంకితులయేరట రుషిపుంగవులు. మోక్షం ఎందుకు అంటే ఎవరైనా ఏమి చెప్పగలరు? (అలా అడిగేవారితో భాషించి ఏమి ప్రయోజనము!)
మునీశ్వరులవారి వద్ద కొంతసేపు నిశ్చలంగా నిలబడిందట మన చీమ. వారు సమాధానం చెప్పరని నిశ్చయమయేక చీమ తన ఇంటికి తిరుగుముఖం పట్టిందట.
రాళ్లూ రప్పలూ, చెట్లూ చేమలూ, ఏడు కొండలూ, ఎన్నెన్నో గుట్టలూ అన్నిటికీ దాటుకొని చిరుచీమ తన పుట్ట సమీపానికి చేరుకొనేసరికి దాదాపు నెల దినాలు పట్టింది. వెళ్లేసరికి భానూదయం అవుతోందిట.
మర్రి చెట్టు కింద తన పుట్ట అల్లంత దూరంలో ఉంది. ఉండగా అక్కడ నిలబడిపోయిందిట చిరుచీమ. పుట్టలోంచి చిందరవందరగా పగిలిపోయిన కోటలోంచి చెదిరిపోయిన సైన్యంలా లక్షలాది సంఖ్యలో పారిపోయి వచ్చేస్తున్నాయట చీమ తోడిచీమలు.
మన చీమకి ఒక క్షణంసేపు ఏమీ అర్థంకాలేదట. ఏదో ఆపద సంభవించి వుంటుందని ఆ వెంటనే మాత్రం గ్రహించగలిగిందట. అప్పుడది ఒక సోదరుణ్ణి ఆపి అడిగిందట.
‘అన్నా అన్నా! ఏమి సంభవించింది? ఆపదా? ఏమాపద? ఏం జరిగింది?’ అని చాలా ఆత్రుతగా అడిగిందిట.
అన్న చీమ వగర్చుకొంటూ ఆగి – ‘ఎవడో రాక్షసుడు మన యింట్లో ప్రవేశించేడు’ అని చెప్పి మూర్ఛపోయిందిట.
అప్పుడు మన చీమ తన సోదరులందర్నీ ఆపి, తన చదువునంతా ఉపయోగించి వారికి ధైర్యం చెప్పి వారందర్నీ ఒకచోట నిలిపి తమ పుట్టలోకి తను వంటరిగా వెళ్లిందట.
అక్కడ ఆ చీమల పుట్టింట్లో అట్టడుగున విశాలమైన ఓ చల్లని గదిలో నల్లని ఒకానొక రాక్షాసాకారం చుట్టలు చుట్టుకొని నిద్రపోవడానికి సిద్ధమవుతోందట. చూడ్డానికి అది ఎంతో భయంకరంగానూ, చాలా అసహ్యంగానూ కూడా ఉందిట.
ఆ ఆకారాన్ని చూసి మన చీమ – ‘ఓయీ! ఎవరు నీవు? మా ఇంట్లోకి మా అనుమతిలేకుండా ఎందుకిలా వచ్చేవు? అది అక్రమం కాదా? అన్యాయం కాదా? మాకు అపకారం చేయడం నీకు న్యాయమేనా?’ అని ఆకారాన్ని గౌరవపూర్వకంగానే అడిగిందట మన చీమ.
ఆ ఆకారం చీమ మాటలు విని తలెత్తి చూసి, చీమని కనిపెట్టి, బుసబుసమని నవ్వి ఈ విధంగా చెప్పిందట.
‘ఒరే పిపీలికాధమా! నేనెవరిననా అడిగేవు? నేను సుఖభోగిని. నీ పాలిట మాత్రం కాలయముణ్ణి! ఇప్పుడు తెలిసిందా నేనెవరో? తెలిసింది కద! మరి, నువ్వెవరవో నీకు తెలుసునా? నీ ముఖం చూస్తే నీకింకా ఏమీ తెలియనట్టే ఉందిలే. నువ్వు ఈ లోకంలో ఒకానొక తుచ్ఛపు కష్టజీవివి. కష్టజీవులు కష్టపడాలి. సుఖభోగులు సుఖించాలి. అలా జరుగుతుందనేది ప్రకృతి ధర్మం. అలా జరగాలనేది భగవదాదేశం. అందుచేత, మీ చీమ వెధవలంతా కష్టపడవలసిందే! మీ కష్టమ్మీద మేం సుఖించవలసినదే! మాకు అదే న్యాయం అదే ధర్మం! కాదన్నవాణ్ణి కాటేసి చంపుతాం! ఇది మీరు కష్టపడి కట్టుకున్న యిల్లే.
బాగానే ఉంది. మీ నిర్మాణ కౌశలానికి ముగ్ధుణ్ణయేను. మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను. చాలు నీకది. పొండి! మరింక దీని సౌఖ్యం అనుభవించే భాగ్యం అంటారా? అది మాది! అది మా హక్కు. ఆ హక్కు మాకు వీడూ వాడూ ఇచ్చింది కాదు. భగవంతుడే ఇచ్చాడు. ఇది ఇప్పటి నుంచీ నా ఇల్లు బోధపడిందిరా చిన్నోడా.
నీకేదో చదువులు చదివి పాఠాలు నేర్చుకోవాలని కుతూహలంగా ఉన్నట్టుంది. ఈ దినానికి నీకీ పాఠం చాలు! మరో పాఠానికి మళ్లీ రాకు. వచ్చేవంటే మిగతా పాఠాలన్నీ మరో లోకంలో నేర్చుకోవలసి ఉంటుంది. మరందుచేత వేగిరం నడువిక్కణ్ణుంచి. నాకు రాత్రంతా నిద్రలేదు. ఇప్పుడు నాకు నిద్రాభంగం మరింక చెయ్యక. ప్రాణాల మీద తీపుంటే తక్షణం ఇక్కణ్ణించి ఫో!’ అని చీమకి ఖచ్చితంగా చెప్పి నిద్రపోవడానికి సిద్ధంగా తల వాల్చిందట ఆ రాక్షాసాకారం.
మన చిరుచీమ నివ్వెరపోయిందట.
నువ్వో ప్రాణివన్నారు. నువ్వు చీమ పేరుగల దానివన్నారు. నువ్వు దేవభాషలో పిపీలికానివన్నారు. నువ్వు పిపీలికానివే కాని నువ్వు కూడా బ్రహ్మపదార్థానివేనన్నారు. నువ్వు అదన్నారు, ఇదన్నారు.
అంతే కాని – ‘నువ్వు కష్టజీవివి’ అని మాత్రం అంతవరకూ ఎవ్వరూ చెప్పేరుకారుట చిరుచీమకి. నీ కష్టాన్ని దొంగిలించి ఇతరులు సుఖిస్తారని కూడా ఎవ్వరూ చెప్పలేదుట దానికి. ‘శాస్త్రా’లు చెప్పని సత్యం ‘ధర్మాత్ములు’ దాచిన సత్యం నిజ జీవితంలో ఆ రాక్షాసాకారం వల్ల తెలుసుకొని, ఆ నిజానికి కొంతసేపు నిశ్చేష్టురాలయిపోయిందట మన చిరుచీమ ఆ తరవాత కర్తవ్యం గురించి ఆలోచించనారంభించిందిట. ఆవిధంగా జ్ఞానోదయం కలిగి ‘బుద్ధుడ’యింది కాబట్టి ఆ చిరుచీమకి తనేం చెయ్యాలో వెంటనే తెలిసిపోయిందట.
అప్పుడు మనచీమ ఆ రాక్షసాకారాన్ని సుఖంగా నిద్రపోనివ్వక దానితో ఈవిధంగా చెప్పిందట.
‘ఒరే రాక్షసాధముడా! మేం కష్టజీవులమే కావచ్చు నువ్వు సుఖభోగివే కావచ్చు. కాని నువ్వు మా కష్టాన్ని అపహరించి మాకు అన్యాయం చెయ్యడం మేం సహించం! మేం తిరగబడతాం! నువ్వు చెప్పిన న్యాయం భగవన్న్యాయమైనా సరే అది అన్యాయం కాబట్టి దాన్ని మేం మారుస్తాం! అందుగురించి మేం తిరగబడతాం. మీమీద మేం తిరగబడి తీరుతాం’ అని చెప్పిందట మన చీమ ఆ రాక్షసాకారానికి.
చీమ వాక్కు విన్న రాక్షాసాకారం మొదట కొంచెం వెటకారంగా నవ్విందట. ఆ తరవాత కోపంగా బుసకొట్టిందట.
రాక్షస కోపానికి చీమ నాయకుడు చిరునవ్వు నవ్వుకొని, పట్టుదలతో పైకివెళ్లి సోదరులందరికీ హితబోధ చేసి, ధైర్యం చెప్పి, వారికి వీరులుగా మార్చి ‘రాక్షాసాకారపు భగవన్న్యాయం’ మీద తిరుగుబాటు చేసేందుకు అందర్నీ కూడగట్టకొని ముందుకు రంగంలోకి ఉరికేడట.
తత్ఫలితంగా – శ్యామవనంలో మర్రిచెట్టు కింద ఆ దినం ఓ రాక్షసాకారం విలవిల తన్నుకొని నెత్తురు కక్కుకొని చచ్చిందట. ఆ మేరకి ఆ మూలంగా భూభారం కొంత తగ్గిందట. - రావి శాస్త్రి