Vistadome train
-
స్వేచ్ఛా విగ్రహం కంటే ఐక్యతా విగ్రహమే ఘనం
అహ్మదాబాద్: అమెరికాలోని స్వేచ్ఛా విగ్రహం(స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ) కంటే గుజరాత్‌లోని సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ ఐక్యతా విగ్రహాన్ని(స్టాచ్యూ ఆఫ్ యూనిటీ) సందర్శించడానికే ఎక్కువ మంది వస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. గుజరాత్‌లోని గిరిజన ప్రాంతమైన కేవాడియాలో నెలకొల్పిన ఈ విగ్రహాన్ని 2018 అక్టోబర్‌లో ప్రారంభించగా, ఇప్పటివరకు 50 లక్షల మంది సందర్శించారని పేర్కొన్నారు. అహ్మదాబాద్, వారణాసి, దాదర్, హజ్రత్ నిజాముద్దీన్, రేవా, చెన్నై, ప్రతాప్‌నగర్ ప్రాంతాలను కేవాడియాతో అనుసంధానించేందుకుగాను కొత్తగా 8 రైళ్లను ప్రధాని మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ రైళ్లతో ప్రపంచంలోనే అతి ఎత్తయిన ఐక్యతా విగ్రహాన్ని చూసేందుకు వచ్చే సందర్శకుల సంఖ్య భారీగా పెరుగుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో నిత్యం లక్ష మంది ఐక్యతా విగ్రహాన్ని సందర్శిస్తారని ఒక సర్వేలో తేలిందని వివరించారు. దబోయి, చందోడ్, కేవాడియా రైల్వే స్టేషన్లను, దబోయి–చందోడ్, చందోడ్–కేవాడియా బ్రాడ్‌గేజ్ లైన్లను, నూతనంగా విద్యుదీకరించిన ప్రతాప్‌నగర్–కేవాడియా సెక్షన్‌ను కూడా ఆయన ప్రారంభించారు. ఒకే గమ్యస్థానానికి చేరుకునే 8 రైళ్లకు ఒకే సమయంలో పచ్చజెండా ఊపడం ఇదే మొదటిసారి అని వెల్లడించారు. కేవాడియా అనేది ఇకపై మారుమూల చిన్న పట్టణం కాదని, ప్రపంచంలోనే అతిపెద్ద పర్యాటక ప్రాంతంగా మారబోతోందని స్పష్టం చేశారు. పర్యావరణ హిత రైల్వే ప్రాజెక్టులకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని నరేంద్ర మోదీ అన్నారు. అందుకు కేవాడియా రైల్వే స్టేషన్ ఒక ఉదాహరణ అని చెప్పారు. మోదీ ప్రారంభించిన 8 రైళ్లలో అహ్మదాబాద్–కేవాడియా జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ కూడా ఉంది. ఈ రైల్లో ప్రత్యేక ఏమిటంటే ఇందులో విస్టాడోమ్ కోచ్‌లు ఉన్నాయి. కోచ్ కిటీకలు, తలుపులే కాకుండా పైభాగాన్ని కూడా అద్దాలతోనే తీర్చిదిద్దారు. -
న్యూవిస్టాడోమ్ కోచ్‌తో మరుపురాని ప్రయాణం!
న్యూఢిల్లీ: దేశీయంగా తయారుచేసిన న్యూ డిజైన్ విస్టాడోమ్ కోచ్‌లపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. వీటిలో ప్రయాణాలు చిరస్మరణీయాలుగా మారతాయన్నారు. ► ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో వీటిని ఉత్పత్తి చేశారు. ఈ కోచ్‌లో 44 ప్యాసెంజర్ సీట్లుంటాయి. వీటిని 180 డిగ్రీల మేర తిప్పుకోవచ్చు. ► పైకప్పు గాజుతో చేయడం వల్ల వ్యూ ఏరియా మరింత పెరుగుతుంది. మంగళవారం ఈ కోచ్‌లు 180 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ వద్ద ట్రయిల్ రన్ పూర్తి చేసుకున్నాయి. ► వీటిని తొలిసారి ఎల్‌హెచ్‌బీ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు. కోచ్‌లో వైఫై ఆధారిత ప్రయాణీకుల సమాచారం ఉంటుంది. ► ఎయిర్ స్ప్రింగ్ సస్పెన్షన్లు, పెద్ద గాజు కిటికీలు, ప్రతిసీటుకి మొబైల్ చార్జింగ్ సాకెట్, డిజిటల్ డిస్ప్లే స్క్రీన్లు, స్పీకర్లు, వెడల్పైన ఎంట్రన్స్ డోర్లు, ఎల్ఈడీ డెస్టినేషన్ బోర్డులు, మల్టీటైర్ లగేజ్ ర్యాక్స్, మిని ప్యాంట్రీ, సీసీటీవీ నిఘా, మాడ్యులర్ టాయిలెట్స్, ఆటోమేటిక్ ఫైర్ డిటెక్షన్ సిస్టమ్ తదితరాలు ఈ కోచ్‌ల ప్రత్యేకతలు. ► ప్రస్తుతం ఐసీఎఫ్ పది విస్టాడోమ్ కోచ్‌లను తయారుచేస్తోంది. ఇప్పటికే రెండింటి ఉత్పత్తి పూర్తికాగా మిగిలినవి వచ్చేమార్చి చివరకు పూర్తి చేస్తారు. వీటిని పర్యాటకులు ఎక్కువగా ప్రయాణించే మార్గాల్లో ఉపయోగిస్తారు. -
అద్దాల పెట్టెల్లో.. ఆంధ్రా ఊటీకి..
సాక్షి, విశాఖపట్నం: ప్రకృతి రమణీయతతో విలసిల్లుస్తున్న అద్భుత పర్వత పంక్తి అరకు. ఈ ప్రాంతం ఎంత అందంగా ఉంటుందో.. ఆ అందాల నడుమ చేసే ప్రయాణమూ అంతే అద్భుతంగా ఉంటుంది. ఎత్తైన కొండలు, కోనలు, గుహల మధ్య వయ్యారంగా సాగిపోయే రైల్లో ప్రయాణం సరికొత్త అనుభూతినిస్తుంది. ఈ ప్రయాణాన్ని మరింత మజాగా మార్చింది అద్దాల పెట్టె. విశాఖ నుంచి అరకు వెళ్లే రైలుకు అమర్చిన ఈ అద్దాల పెట్టె నుంచి అణువణువూ అందాలతో తొణికిసలాడే అద్భుతాలను వీక్షిస్తూ.. ప్రయాణికులు లెక్కలేనన్ని మధురానుభూతులను ఆస్వాదించారు. ఇప్పుడు మొత్తం అద్దాల పెట్టెలతోనే ఓ సరికొత్త రైలు.. విశాఖ– అరకు మధ్య ప్రకృతి సౌందర్యాన్ని అత్యద్భుతంగా చూపించేందుకు సిద్ధమవుతోంది. పర్యాటకుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని విశాఖ– అరకు మధ్య 5 విస్టాడోమ్ కోచ్‌లతో సర్వీస్ ప్రారంభించాలి. గతంలో దీనికి సంబంధించి ఇచ్చిన హామీ త్వరితగతిన అమల్లోకి వచ్చేలా చూడాలి. – రైల్వే మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో ఎంపీ విజయసాయిరెడ్డి ఈ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. అరకుకు కచ్చితంగా విస్టాడోమ్ కోచ్‌లను కేటాయిస్తాం. ప్రస్తుతం ఈ కోచ్‌లు తయారీలో ఉన్నాయి. పర్యాటకుల డిమాండ్‌కు అనుగుణంగా విస్టాడోమ్ కోచ్‌లు కేటాయిస్తాం. – విజయసాయిరెడ్డి లేఖకు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పందన ఈ నేపథ్యంలో విదేశాలకే పరిమితమైన అద్దాలతో కూడిన విలాసవంతమైన విస్టాడోమ్ రైలు విశాఖ– అరకు మధ్య త్వరలోనే చక్కర్లు కొట్టనుంది. ఆంధ్రా ఊటీగా పిలవబడే అరకు ప్రయాణానికి మరింత అందాన్ని, సరికొత్త అనుభూతిని పంచేలా కొత్త రైలు మొదలుకానుంది. అరకు రైలు ప్రయాణమంటే ఇష్టపడని వారెవ్వరూ ఉండరు. రైలు నుంచి ప్రకృతి అందాన్ని తనివితీరా చూసేందుకు విశాఖ నుంచి అరకు వెళ్లే రైలులో 2017 ఏప్రిల్ 16 విస్టాడోమ్ కోచ్(అద్దాల పెట్టె)ను ఏర్పాటు చేశారు. ఈ కోచ్ నుంచి అద్భుతాలను చూసేందుకు పర్యాటకుల నుంచి డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో మరో కోచ్ ఏర్పాటు చేయాలని 2017లోనే ప్రతిపాదించారు. అప్పటి నుంచి ఈ ప్రతిపాదన బుట్టదాఖలవుతూ వస్తోంది. తాజాగా విస్టాడోమ్ కోచ్‌లతో రైల్వే సరీ్వస్ ప్రారంభించాలని ఎంపీ విజయసాయిరెడ్డి రైల్వే మంత్రిత్వ శాఖకు లేఖ రాయడం, దీనికి కేంద్ర రైల్వే మంత్రి స్పందిస్తూ విస్టాడోమ్ కోచ్‌లు కేటాయిస్తామని చెప్పారు. ఈ మేరకు రైల్వే బోర్డు ఐదు విస్టాడోమ్ కోచ్‌లు సిద్ధం చేస్తోంది. వీటితో పాటు ప్రస్తుతం ఉన్న కోచ్ కలిపి మొత్తం 6 అద్దాల పెట్టెలతో స్పెషల్ టూరిస్ట్ రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. గతేడాది ప్రకటన అరకు పర్యాటకానికి విస్టాడోమ్ కోచ్‌లు అదనంగా ఇవ్వాలంటూ వైఎస్సార్సీపీ ఎంపీలు రైల్వే మంత్రిత్వ శాఖతో పాటు రైల్వే బోర్డుపైనా ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో ఏకంగా 5 విస్టాడోమ్ కోచ్‌లు అరకుకు అందించేందుకు రైల్వే బోర్డు గతేడాది అంగీకారం తెలిపింది. 2019 చివరిలో విశాఖలో పర్యటించిన రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి సైతం.. అరకు కోసం 5 అద్దాల కోచ్‌లు ఇస్తున్నట్లు ప్రకటించారు. స్పెషల్ టూరిస్ట్ ట్రైన్: అరకు పర్యాటకానికి మరింత అందాన్నిచ్చేలా స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ అందుబాటులోకి రానుంది. కొత్తగా రానున్న 5 విస్టాడోమ్ కోచ్‌లతో పాటు విశాఖ–కిరండూల్ రైలుకు ప్రస్తుతం ఏర్పాటు చేసిన విస్టాడోమ్ కోచ్‌తో కలిపి మొత్తం 6 అద్దాల పెట్టెలతో స్పెషల్ టూరిస్ట్ రైలు చక్కర్లు కొట్టేలా వాల్తేరు డివిజన్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఒ క్కో కోచ్‌లో 45 సీట్లుంటాయి. గతంలో కేవలం 45 మంది పర్యాటకులకు మా త్రమే అద్దాల పెట్టెలో ప్రయాణించే వీలుండేది. కొత్తగా రానున్న టూరిస్ట్ రైలులో ఏకంగా 270 మంది అరకు అందాలను అద్దాల్లో వీక్షించే అవకాశం కలగనుంది. కోచ్‌లు అందుబాటులోకి రాగానే... ఇన్ని విశిష్టతలతో కూడుకున్న ఈ రైలు పట్టాలెక్కించేందుకు డివిజన్ అధికారులు ఆసక్తి చూపిస్తున్నారు. కోచ్‌లు అందుబాటులోకి వచ్చిన వెంటనే.. ఏ సమయంలో నడపాలన్న అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు వాల్తేరు అధికారులు తెలిపారు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అరకు సరీ్వసును రద్దు చేశారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత సర్వీసులు ప్రారంభించనున్నారు. కోచ్‌లు వచ్చిన వెంటనే ట్రయల్ రన్ నిర్వహించి.. నెల రోజుల్లోనే సరీ్వసు ప్రారంభించేందుకు సన్నద్ధమవుతామని డివిజన్ అధికారులు చెబుతున్నారు. 84 వంతెనలు.. 58 సొరంగాలు.. ఈ విస్టాడోమ్ కోచ్‌ల్లో సీట్లు 180 డిగ్రీల కోణంలో తిరిగే సౌకర్యం ఉంటుంది. ఒకవైపు అందాల్ని చూస్తున్న సమయంలో మరోవైపు తిరగాలంటే శ్రమించాల్సిన అవసరం లేకుండా రొటేటింగ్ సీట్లో సులువుగా తిరిగి 360 డిగ్రీల కోణంలో అందాలు వీక్షించవచ్చు. అనంతగిరి అడవులు, ఎత్తైన కొండలు.. వాటిపై పరచుకున్న పచ్చదనం.. జలపాతాలు.. ఇలా.. ఎన్నో అందాలు కళ్లార్పకుండా చూసే అవకాశం కలగనుంది. 84 ప్రధాన వంతెనలు.. 58 సొరంగాల గుండా ఈ రైలు ప్రయాణించనుంది. ఒక్కో సొరంగం అర కిలోమీటర్ నుంచి ఒకటిన్నర కిలోమీటర్ వరకు పొడవుంటుంది. ఇలా.. ఎన్నో అనుభూతుల్ని మూటగట్టుకునేలా రైలు ప్రయాణం సాగుతుంది. -
‘అరకు రైలుకు మరిన్ని విస్టాడోమ్ కోచ్‌లు కావాలి’
సాక్షి, న్యూఢిల్లీ : విశాఖపట్నం-అరకులోయ మధ్య నడిచే పర్యాటక రైలుకు అదనంగా ఐదు విస్టాడోమ్ కోచ్‌లను ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రైల్వేమంత్రికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో బుధవారం ప్రత్యేక ప్రస్తావన (స్పెషల్ మెన్షన్) ద్వారా ఆయన ఈ అంశంపై మాట్లాడుతూ.. బీచ్‌లు, గుహలు, జలపాతాలు, ఘాట్లతో విశాఖపట్నం జిల్లా పర్యాటకుల స్వర్గధామంగా విరాజిల్లుతోందని అన్నారు. ‘తూర్పు కోస్తాకు మణిహారంగా విశాఖ జిల్లా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతంలో పర్యాటకానికి విశేష ఆకర్షణగా నిలిచిన వాటిలో విస్టాడోమ్ కోచ్ ఒకటి. ప్రస్తుతం పర్యాటక రైలుగా పరిగణించే విశాఖపట్నం-అరకు లోయ రైలుకు అనుసంధానించిన ఈ విస్టాడోమ్ కోచ్‌లో ప్రయాణం పట్ల పర్యాటకులు అమితమైన ఆసక్తి చూపుతున్నారు’ ఆయన అన్నారు. తూర్పు కనుమల్లో విస్తరించిన సువిశాలమైన ఆకుపచ్చని అడవులు, లోయలు, టన్నెల్స్ వంటి ప్రకృతి దృశ్యాలను పర్యాటకులు నిలువెత్తు అద్దాల గుండా నలుదిక్కులా వీక్షించే విధంగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన విస్టాడోమ్ కోచ్ ప్రారంభించిన రోజు నుంచే పర్యాటకుల నుంచి విశేష ఆదరణ పొందుతున్నట్లు ఆయన చెప్పారు. అమిత ప్రజాదరణ పొందిన విస్టాడోమ్ కోచ్‌కు అనూహ్యమైన డిమాండ్ ఏర్పడినప్పటికీ రైలులో కేవలం ఒకే ఒక కోచ్ అందుబాటులో ఉండటం పర్యాటకులను తీవ్ర నిరాశకు గురిచేస్తోందని అన్నారు. ‘విస్టాడోమ్ కోచ్‌లో ప్రయాణానికి టిక్కెట్ల కోసం ప్రతి రోజు సుదీర్ఘమైన వెయిటింగ్ లిస్ట్ ఉంటోంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం-అరకులోయ రైలుకు కనీసం మరో అయిదు విస్టాడోమ్ కోచ్‌లను సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేసి పర్యాటకుల అవసరాన్ని తీర్చాలి. అదనంగా ఏర్పాటు చేసే విస్టాడోమ్ కోచ్‌ల వలన విశాఖపట్నంలో పర్యాటక రంగానికి మరింత ఊపు ఇచ్చినట్లువుతుంది. అలాగే రైల్వేలకు కూడా దండిగా ఆదాయం లభిస్తుంది’ అని విజయసాయిరెడ్డి అన్నారు. ఈ కారణాల దృష్ట్యా అరకు రైలుకు అదనంగా అయిదు విస్టాడోమ్ కోచ్‌ల ఏర్పాటు కోసం తగిన చర్యలు చేపట్టవలసిందిగా రైల్వే మంత్రికి ఆయన విజ్ఞప్తి చేశారు. -
ఆంధ్రా ఊటీకి అద్దాల రైలు!
విదేశాలకే పరిమితమైన అద్దాలతో కూడిన విలాసవంతమైన విస్టాడోమ్ రైలు విశాఖలో చక్కర్లు కొట్టనుంది. ఆంధ్రా ఊటీగా పిలవబడే అరకు ప్రయాణానికి మరింత అందాన్ని, సరికొత్త అనుభూతిని పంచేలా కొత్త రైలు మొదలుకానుంది.అరకు రైలు ప్రయాణమంటే ఇష్టపడని వారెవ్వరూ ఉండరు. ఈ అందాల్ని రైలు నుంచి మరింత అందంగా చూసేందుకు విస్టోడామ్ కోచ్‌ని రెండేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. అద్దాల పెట్టెలోంచి అద్భుతాల్ని చూసేందుకు పర్యాటకుల నుంచి డిమాండ్ పెరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరో ఐదు విస్టోడామ్ కోచ్‌లు ఏర్పాటుకు రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ 5 కోచ్‌లతోపాటు ప్రస్తుతం ఉన్న కోచ్ కలిపి మొత్తం 6 అద్దాల పెట్టెలతో స్పెషల్ టూరిస్ట్ రైలు త్వరలోనే చక్కర్లు కొట్టనుంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అరకు ఎంత అందంగా ఉంటుందో.. ఆ అందాల నడుమ చేసే ప్రయాణమూ అంతే అందంగా ఉంటుంది. అద్భుతాల్ని వీక్షించేందుకు అందమైన రైలులో ప్రయాణిస్తే.. లెక్కలేనన్ని మధురానుభూతుల్ని మూటకట్టుకోవచ్చు. ఈ ప్రయాణాన్ని మరింత మజాగా మార్చింది అద్దాల పెట్టె. విశాఖ నుంచి అరకు వెళ్లే రైలులో 2017 ఏప్రిల్ 16 విస్టాడోమ్ కోచ్(అద్దాల పెట్టె) అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి ఈ కోచ్ నిత్యం కిటకిటలాడుతూ ఉంది. విశాఖ నుంచి అరకు 130 కిలోమీటర్లు ప్రయాణం సాగించేందుకు ప్రతి రోజూ ఉదయం 7 గంటలకు విశాఖ–కిరండూల్ రైలులో ఈ విస్టాడోమ్ కోచ్‌ని ఏర్పాటు చేశారు. పర్యాటకులు ఈ బోగీలో ప్రయాణించేందుకు అమితాసక్తి చూపుతుండటంతో మరో కోచ్ ఏర్పాటు చేయాలని 2017లోనే ప్రతిపాదించారు. అప్పటి నుంచి ఈ ప్రతిపాదన బుట్టదాఖలవుతూ వస్తోంది. వైఎస్ఆర్సీపీ ఎంపీలో చొరవతో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు తరచూ అరకు పర్యాటకానికి విస్టాడోమ్ కోచ్‌లు అదనంగా ఇవ్వాలంటూ రైల్వే మంత్రిత్వ శాఖతో పాటు రైల్వే బోర్డుపైనా ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో.. ఏకంగా 5 విస్టాడోమ్ కోచ్‌లు అరకుకు అందించేందుకు రైల్వే బోర్డు అంగీకారం తెలిపింది. గత నెల 27న ఉదయ్ రైలు ప్రారంభించేందుకు వచ్చిన రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి 5 అద్దాల కోచ్‌లు ఇస్తున్నట్లు ప్రకటించారు. అద్దాల పెట్టెలతో స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ అరకు పర్యాటకానికి మరింత అందాన్నిచ్చేలా స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ అందుబాటులోకి రానుంది. కొత్తగా రానున్న 5 విస్టాడోమ్ కోచ్‌లతో పాటు విశాఖ–కిరండూల్ రైలుకు ఏర్పాటు చేసిన విస్టాడోమ్ కోచ్‌తో కలిపి మొత్తం 6 అద్దాల పెట్టెలతో స్పెషల్ టూరిస్ట్ రైలు చక్కర్లు కొట్టనుంది. ఒక్కో కోచ్‌లో 45 సీట్లుంటాయి. గతంలో కేవలం 45 మంది పర్యాటకులకు మాత్రమే అద్దాల పెట్టెలో ప్రయాణించే వీలుండేది. కానీ.. కొత్తగా రానున్న టూరిస్ట్ రైలులో ఏకంగా 270 మంది అరకు అందాల్ని అద్దాల్లో వీక్షించే అవకాశం కలగనుంది. 84 వంతెనలు.. 58 సొరంగాలు.. ఈ విస్టాడోమ్ కోచ్‌లలో సీట్లు 180 డిగ్రీల కోణంలో తిరిగే సౌకర్యం ఉంటుంది. ఒకవైపు అందాల్ని చూస్తున్న సమయంలో మరోవైపు తిరగాలంటే శ్రమించాల్సిన అవసరం లేకుండా రొటేటింగ్ సీట్లో సులువుగా తిరిగి 360 డిగ్రీల కోణంలో అందాలు వీక్షించవచ్చు. అనంతగిరి అడవులు, ఎల్తైన కొండలూ.. వాటిపై పరచుకున్న పచ్చదనం.. జలపాతాలు.. ఇలా.. ఎన్నో అందాలు కళ్లార్పకుండా చూసే అవకాశం కలగనుంది. 84 ప్రధాన వంతెనలు.. 58 సొరంగాల గుండా ఈ రైలు ప్రయాణించనుంది. ఒక్కో సొరంగం అర కిలోమీటరు నుంచి ఒకటిన్నర కిలోమీటరు వరకూ పొడవుంటుంది. ఇలా.. ఎన్నో అనుభూతుల్ని మూటగట్టుకునేలా రైలు ప్రయాణం సాగుతుంది. కదిలే రైల్లో విస్టాడోమ్ కోచ్ నుంచి వీటిని చూస్తుంటే గాల్లో తేలుతున్న అనుభూతి కలుగుతుంది. త్వరలోనే ప్రారంభం... ఇన్ని విశిష్టతలతో కూడుకున్న ఈ రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇప్పటికే ఏ సమయంలో నడపాలన్నది నిర్ణయించినట్లు వాల్తేరు అధికారులు తెలిపారు. ప్రస్తుతం దసరా సెలవుల నేపథ్యంలో అరకు అందాల్ని వీక్షించేందుకు ఉదయం 8.10 గంటలకు విశాఖ నుంచి స్పెషల్ రైలు నడుపుతున్నారు. ఇదే సమయంలో స్పెషల్ టూరిస్ట్ విస్టాడోమ్ రైలు నడపాలని నిర్ణయించారు. ఈ నెలాఖరులో విశాఖకు కోచ్‌లు వచ్చే అవకాశాలున్నాయి. ఆ తర్వాత ట్రయల్ రన్ నిర్వహించి.. రానున్న రెండు నెలల్లోనే సర్వీసు ప్రారంభించే అవకాశాలున్నాయని వాల్తేరు రైల్వే అధికారులు స్పష్టం చేశారు. -
అదిగదిగో అద్దాల రైలు!
ఏడాది చివరినాటికి అందుబాటులోకి.. అరకు రైలుకు రెండు అత్యాధునిక కోచ్‌లు ప్రకృతి అందాలు తిలకించే వీలు సాక్షి, విశాఖపట్నం: ఇరుపక్కల నుంచి చూస్తే పచ్చదనం కలబోసిన ప్రకృతి సౌందర్యం.. తల పెకైత్తి చూస్తే నీలాకాశం.. బోగీ లోపల విభిన్న ఆకృతిలో కళ్లు చెదిరేలా రూపొందించిన డిజైన్లు.. అటూ ఇటూ కదిలే కుర్చీలు.. పారదర్శకంగా ఉండే అద్దాలు.. శీతలాన్ని వెదజల్లే బోగీలు.. ఇవన్నీ విశాఖ నుంచి అరకు వెళ్లే అద్దాల రైలుకు సొంతం..! ఎన్నాళ్ల నుంచో ఇదిగో.. అదిగో.. అంటూ ఊరిస్తున్న ఈ అద్దాల (విస్టాడూమ్) రైలు మరో రెండు నెలల్లో అందుబాటులోకి వచ్చేస్తోంది. ఇప్పటికే వారుుదాలపై వారుుదాలు పడుతూ వస్తున్న ఈ రైలుకు మార్గం సుగమం అయింది. విశాఖ నుంచి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అరకులోయ, బొర్రాగుహలను రైలు మార్గంలో సందర్శించడానికి ఈ విశాఖ-కిరండూల్ పాసింజర్ రైలొక్కటే ఉంది. ఈ రైలులో ప్రయాణిస్తుంటే రాశులు పోసినట్టుండే పచ్చని కొండలు, జాలువారే జలపాతాలు, పాతాళంలో ఉన్నట్టుండే లోయలు, గుహల్లాంటి సొరంగాలు, పచ్చని చెట్లు, పక్షుల కిలకిలరావాలు.. ఇలా ఒకటేమిటి? ప్రకృతిలో ఉండే అన్ని ఒంపుసొంపులు, సోయగాలు ఈ రైలులో ప్రయాణించే వారికి దర్శనమిస్తాయి. అందుకే ఈ రైలులో ప్రయాణించడానికి పర్యాటకులు పోటీ పడుతుంటారు. దీన్ని దష్టిలో ఉంచుకునే రైల్వే శాఖ ఈ రైలుకు అదనంగా రెండు అద్దాల బోగీలను అమర్చాలని ఎప్పట్నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఏవేవో కారణాలతో కార్యరూపం దాల్చడం లేదు. చెన్నై పెరంబుదూర్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ విస్టాడూమ్ బోగీలు తయారయ్యాయి. వీటికి దాదాపు రూ.4 కోట్లు ఖర్చవుతోంది. అంటే సాధారణ బోగీలకంటే రూ.25-30 వేలు అధికమన్నమాట! ఈ బోగీల ప్రత్యేకత ఏమిటంటే.. చుట్టూ బలిష్టమైన, పారదర్శకంగా ఉండే తెల్లని అద్దాలు బిగించి ఉంటాయి. ఎటు చూసినా అంతా కనిపిస్తుంది. పైన (బోగీ టాప్) కూడా అద్దాలతోనే నిర్మిస్తారు. అందువల్ల బోగీలోంచి ఆకాశంలోకి కూడా చూసే వీలుంటుంది. బోగీ లోపల ప్రత్యేక డిజైన్లుండేలా రూపొందించడం వల్ల రైలులో కాకుండా ఓ ప్రత్యేక వాహనంలో ప్రయాణిస్తున్న అనుభూతి కలుగుతుంది. బోగీలో ఉన్న కుర్చీలు తమకు నచ్చిన వైపు తిరిగే ఏర్పాటు ఉంటుంది. ఈ రైలు విశాఖ నుంచి 120 కిలోమీటర్ల దూరం ఉండే అరకుకు మూడున్నర గంటల సమయం పడుతుంది. ఈ మార్గ మధ్యలో సుమారు 50 టన్నెల్స్ (గుహలు), లోయలను దాటుకుంటూ పయనిస్తుంది. పర్యాటకులను ఈ విస్టాడూమ్ కోచ్‌లు విశేషంగా ఆకట్టుకుంటాయని ఇటు రైల్వే, అటు పర్యాటకశాఖ అధికారులు ఆశాభావంతో ఉన్నారు. అయితే ఈ కోచ్‌ల్లో ప్రయాణించడానికి టికెట్ ఎంతన్నది ఇంకా నిర్ణయించలేదు. మరో రెండు నెలలు ఆగితే అందాల అద్దాల రైలు అందుబాటులోకి వచ్చేస్తుంది!