అరకు రైల్వేస్టేషన్
విదేశాలకే పరిమితమైన అద్దాలతో కూడిన విలాసవంతమైన విస్టాడోమ్ రైలు విశాఖలో చక్కర్లు కొట్టనుంది. ఆంధ్రా ఊటీగా పిలవబడే అరకు ప్రయాణానికి మరింత అందాన్ని, సరికొత్త అనుభూతిని పంచేలా కొత్త రైలు మొదలుకానుంది.అరకు రైలు ప్రయాణమంటే ఇష్టపడని వారెవ్వరూ ఉండరు. ఈ అందాల్ని రైలు నుంచి మరింత అందంగా చూసేందుకు విస్టోడామ్ కోచ్‌ని రెండేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. అద్దాల పెట్టెలోంచి అద్భుతాల్ని చూసేందుకు పర్యాటకుల నుంచి డిమాండ్ పెరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరో ఐదు విస్టోడామ్ కోచ్‌లు ఏర్పాటుకు రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ 5 కోచ్‌లతోపాటు ప్రస్తుతం ఉన్న కోచ్ కలిపి మొత్తం 6 అద్దాల పెట్టెలతో స్పెషల్ టూరిస్ట్ రైలు త్వరలోనే చక్కర్లు కొట్టనుంది.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అరకు ఎంత అందంగా ఉంటుందో.. ఆ అందాల నడుమ చేసే ప్రయాణమూ అంతే అందంగా ఉంటుంది. అద్భుతాల్ని వీక్షించేందుకు అందమైన రైలులో ప్రయాణిస్తే.. లెక్కలేనన్ని మధురానుభూతుల్ని మూటకట్టుకోవచ్చు. ఈ ప్రయాణాన్ని మరింత మజాగా మార్చింది అద్దాల పెట్టె. విశాఖ నుంచి అరకు వెళ్లే రైలులో 2017 ఏప్రిల్ 16 విస్టాడోమ్ కోచ్(అద్దాల పెట్టె) అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి ఈ కోచ్ నిత్యం కిటకిటలాడుతూ ఉంది. విశాఖ నుంచి అరకు 130 కిలోమీటర్లు ప్రయాణం సాగించేందుకు ప్రతి రోజూ ఉదయం 7 గంటలకు విశాఖ–కిరండూల్ రైలులో ఈ విస్టాడోమ్ కోచ్‌ని ఏర్పాటు చేశారు. పర్యాటకులు ఈ బోగీలో ప్రయాణించేందుకు అమితాసక్తి చూపుతుండటంతో మరో కోచ్ ఏర్పాటు చేయాలని 2017లోనే ప్రతిపాదించారు. అప్పటి నుంచి ఈ ప్రతిపాదన బుట్టదాఖలవుతూ వస్తోంది.
వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలో చొరవతో..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు తరచూ అరకు పర్యాటకానికి విస్టాడోమ్ కోచ్‌లు అదనంగా ఇవ్వాలంటూ రైల్వే మంత్రిత్వ శాఖతో పాటు రైల్వే బోర్డుపైనా ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో.. ఏకంగా 5 విస్టాడోమ్ కోచ్‌లు అరకుకు అందించేందుకు రైల్వే బోర్డు అంగీకారం తెలిపింది. గత నెల 27న ఉదయ్ రైలు ప్రారంభించేందుకు వచ్చిన రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి 5 అద్దాల కోచ్‌లు ఇస్తున్నట్లు ప్రకటించారు.
అద్దాల పెట్టెలతో స్పెషల్ టూరిస్ట్ ట్రైన్
అరకు పర్యాటకానికి మరింత అందాన్నిచ్చేలా స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ అందుబాటులోకి రానుంది. కొత్తగా రానున్న 5 విస్టాడోమ్ కోచ్‌లతో పాటు విశాఖ–కిరండూల్ రైలుకు ఏర్పాటు చేసిన విస్టాడోమ్ కోచ్‌తో కలిపి మొత్తం 6 అద్దాల పెట్టెలతో స్పెషల్ టూరిస్ట్ రైలు చక్కర్లు కొట్టనుంది. ఒక్కో కోచ్‌లో 45 సీట్లుంటాయి. గతంలో కేవలం 45 మంది పర్యాటకులకు మాత్రమే అద్దాల పెట్టెలో ప్రయాణించే వీలుండేది. కానీ.. కొత్తగా రానున్న టూరిస్ట్ రైలులో ఏకంగా 270 మంది అరకు అందాల్ని అద్దాల్లో వీక్షించే అవకాశం కలగనుంది.
84 వంతెనలు.. 58 సొరంగాలు..
ఈ విస్టాడోమ్ కోచ్‌లలో సీట్లు 180 డిగ్రీల కోణంలో తిరిగే సౌకర్యం ఉంటుంది. ఒకవైపు అందాల్ని చూస్తున్న సమయంలో మరోవైపు తిరగాలంటే శ్రమించాల్సిన అవసరం లేకుండా రొటేటింగ్ సీట్‌లో సులువుగా తిరిగి 360 డిగ్రీల కోణంలో అందాలు వీక్షించవచ్చు. అనంతగిరి అడవులు, ఎల్తైన కొండలూ.. వాటిపై పరచుకున్న పచ్చదనం.. జలపాతాలు.. ఇలా.. ఎన్నో అందాలు కళ్లార్పకుండా చూసే అవకాశం కలగనుంది. 84 ప్రధాన వంతెనలు.. 58 సొరంగాల గుండా ఈ రైలు ప్రయాణించనుంది. ఒక్కో సొరంగం అర కిలోమీటరు నుంచి ఒకటిన్నర కిలోమీటరు వరకూ పొడవుంటుంది. ఇలా.. ఎన్నో అనుభూతుల్ని మూటగట్టుకునేలా రైలు ప్రయాణం సాగుతుంది. కదిలే రైల్లో విస్టాడోమ్ కోచ్ నుంచి వీటిని చూస్తుంటే గాల్లో తేలుతున్న అనుభూతి కలుగుతుంది.
త్వరలోనే ప్రారంభం...
ఇన్ని విశిష్టతలతో కూడుకున్న ఈ రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇప్పటికే ఏ సమయంలో నడపాలన్నది నిర్ణయించినట్లు వాల్తేరు అధికారులు తెలిపారు. ప్రస్తుతం దసరా సెలవుల నేపథ్యంలో అరకు అందాల్ని వీక్షించేందుకు ఉదయం 8.10 గంటలకు విశాఖ నుంచి స్పెషల్ రైలు నడుపుతున్నారు. ఇదే సమయంలో స్పెషల్ టూరిస్ట్ విస్టాడోమ్ రైలు నడపాలని నిర్ణయించారు. ఈ నెలాఖరులో విశాఖకు కోచ్‌లు వచ్చే అవకాశాలున్నాయి. ఆ తర్వాత ట్రయల్ రన్ నిర్వహించి.. రానున్న రెండు నెలల్లోనే సర్వీసు ప్రారంభించే అవకాశాలున్నాయని వాల్తేరు రైల్వే అధికారులు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment