ప్రకృతి రమణీయతతో విరాజిల్లుతున్న అద్భుత పర్వత పంక్తి అరకు. ఇక్కడి అందాల గురించి చెప్పాలన్నా అక్షరం పులకిస్తుంది. ఈ ప్రాంతం ఎంత అందంగా ఉంటుందో.. ఆ అందాల నడుమ చేసే ప్రయాణమూ అంతే అద్భుతంగా ఉంటుంది. మంచుదుప్పటి కప్పుకున్న గిరుల సోయగాలు, చినుకు తాకిడికి మెరిసిపోయే పచ్చదనం, గుహల మధ్య వయ్యారంగా సాగిపోయే రైల్లో ప్రయాణం.. ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు మనసుకు హత్తుకుంటాయి. ఈ ప్రయాణాన్ని మరింత మజాగా మార్చింది అద్దాల పెట్టె. విశాఖ నుంచి అరకు వెళ్లే రైలుకు అమర్చిన ఈ అద్దాల పెట్టె నుంచి అణువణువూ అందాలతో తొణికిసలాడే అద్భుతాలను వీక్షిస్తూ.. ప్రయాణికులు లెక్కలేనన్ని మధురానుభూతులను ఆస్వాదించారు. ఇప్పుడు రెండు అద్దాల పెట్టెలు, స్లీపర్ కోచ్‌తో అత్యాధునిక రైలు అందుబాటులోకి వచ్చేసింది. అన్నీ అనుకూలిస్తే ఈ నెల 22న పట్టాలెక్కనుంది.
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా ఊటీగా పిలవబడే అరకు ప్రయాణానికి మరింత అందాన్ని, సరికొత్త అనుభూతిని పంచేలా కొత్త రైలు మొదలుకానుంది. అరకు రైలు ప్రయాణమంటే ఇష్టపడని వారెవ్వరూ ఉండరు. 1968 ఏప్రిల్ 30న తొలిసారిగా అరకు–కిరండూల్ మధ్య రైలు సర్వీసు ప్రారంభించారు. అప్పటి నుంచి పాత కోచ్‌లతోనే కాలం వెళ్లదీస్తోంది. అయినప్పటికీ ఈ రైలుకు మాత్రం ఫుల్ డిమాండ్ ఉంది. అరకు అందాలు చూడాలంటే కచ్చితంగా రైలు మార్గంలోనే వెళ్లాలన్నది పర్యాటకుల కోరిక. అందుకే రైలు ప్రయాణానికి మొదటి ప్రాధాన్యం ఇస్తారు. అక్కడి ప్రకృతిని రైలు నుంచి మరింత అందంగా చూసేందుకు నాలుగేళ్ల కిందట విస్టాడోమ్ కోచ్‌ను ఏర్పాటు చేశారు. అద్దాల పెట్టెలోంచి అద్భుతాలను చూసేందుకు పర్యాటకుల నుంచి డిమాండ్ పెరిగింది. అయితే పాత కోచ్‌ల స్థానంలో అత్యాధునిక కోచ్‌లను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పటినుంచో వస్తున్నా.. ఈస్ట్‌కోస్ట్ పట్టించుకోలేదు. కొన్ని నెలల కిందటే అరకు రైలు కోసం అత్యాధునిక కోచ్‌లు, విస్టాడోమ్ కోచ్ వచ్చినా.. పాతవాటితోనే కాలం వెళ్లదీశారు. ఇప్పుడు ఎట్టకేలకు ఆ రైలుకు మోక్షం లభించనుంది.
తొలిసారిగా స్లీపర్ క్లాస్
అరకు ఎంత అందంగా ఉంటుందో.. ఆ అందాల నడుమ చేసే ప్రయాణమూ అంతే అందంగా ఉంటుంది. అద్భుతాలను వీక్షించేందుకు అరకు–కిరండూల్ మధ్య అత్యాధునికమైన లింక్ హాఫ్‌మన్ బుష్(ఎల్‌హెచ్‌బీ) కోచ్‌లతో రైలు పట్టాలెక్కనుంది. ఈ ట్రైన్‌లో తొలిసారిగా స్లీపర్ క్లాస్ బోగీ ఏర్పాటు చేశారు. ఒక స్లీపర్ క్లాస్, 8 సెకండ్ సిట్టింగ్‌తో పాటు రెండు విస్టాడోమ్ కోచ్‌లతో ఈ రైలు రాకపోకలు సాగించనుంది.
ఎల్‌హెచ్‌బీ కోచ్ ప్రత్యేకతలివీ..
గతంలో పాత బోగీల్లో ప్రయాణించే పర్యాటకులు కుదుపులతో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఇప్పుడు మాత్రం జర్మన్ టెక్నాలజీతో స్టెయిన్‌లెస్ స్టీల్‌తో రూపుదిద్దుకున్న ఎల్‌హెచ్‌బీలు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయి. ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఇంజిన్, బయో టాయిలెట్స్, సౌకర్యవంతమైన సీట్లు ఉంటాయి. ప్రమాదవశాత్తూ కాలు జారి పడిపోకుండా కోచ్‌ల్లో పీవీసీ ఫ్లోరింగ్ ఉంటుంది. ఒక్కో కోచ్ బరువు 39.5 టన్నులు ఉండటం వల్ల ప్రమాదాలు జరిగే సమయంలో ఒకదానికొకటి ఢీకొట్టకుండా, పడిపోకుండా ఉంటాయి. అగ్ని ప్రమాదాలు సంభవించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. గంటకు గరిష్టంగా 200 కిమీ వేగంతో ప్రయాణించగలవు. సాధారణ బోగీల కంటే ఎల్‌హెచ్‌బీలు పొడవుగా ఉండటం వల్ల ప్రస్తుతం ఉన్న బోగీల కంటే అదనంగా మరో 10 సీట్లు ఉంటాయి. ప్రతి కోచ్‌లో అధిక వేగంతో సమర్థవంతమైన బ్రేకింగ్ కోసం ‘అధునాతన ఎయిర్ డిస్క్ బ్రేక్ సిస్టమ్‘ఉంటుంది. సాధారణ కోచ్‌లు 100 డెసిబెల్స్ శబ్దాన్ని చేస్తే.. ఇవి మాత్రం కేవలం గరిష్టంగా 60 డెసిబెల్‌ల శబ్దం ఉత్పన్నం చేస్తుంటాయి.
రెండు విస్టాడోమ్‌లతో హాయ్.. హాయ్
విశాఖ నుంచి అరకు వెళ్లే రైలులో 2017 ఏప్రిల్ 16 విస్టాడోమ్ కోచ్ (అద్దాల పెట్టె) అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి ఈ కోచ్ నిత్యం కిటకిటలాడుతోంది. విశాఖ నుంచి అరకు 130 కిలోమీటర్లు ప్రయాణం సాగించేందుకు ప్రతి రోజూ ఉదయం 7 గంటలకు విశాఖ–కిరండూల్ రైలులో ఈ విస్టాడోమ్ కోచ్‌ను ఏర్పాటు చేశారు. పర్యాటకులు ఈ బోగీలో ప్రయాణించేందుకు అమితాసక్తి చూపుతుండటంతో మరో కోచ్ ఏర్పాటు చేయాలని 2017లోనే ప్రతిపాదించారు. అప్పటి నుంచి ఈ ప్రతిపాదన బుట్టదాఖలవుతూ వస్తోంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కొద్ది నెలల కిందట వచ్చిన మరో కోచ్‌ను ఈ రైలుకు జత చేస్తున్నారు. దీంతో రెండు విస్టాడోమ్‌లు పర్యాటకులను కనువిందు చేయనున్నాయి. రెండు అద్దాల బోగీల్లో మొత్తం 88 సీట్లు అందుబాటులోకి వస్తాయి.
84 వంతెనలు.. 58 సొరంగాలు
ఈ విస్టాడోమ్ కోచ్‌లలో సీట్లు 180 డిగ్రీల కోణంలో తిరిగే సౌకర్యం ఉంటుంది. ఒకవైపు అందాలను చూస్తున్న సమయంలో మరోవైపు తిరగాలంటే శ్రమించాల్సిన అవసరం లేకుండా రొటేటింగ్ సీట్‌లో సులువుగా తిరిగి 360 డిగ్రీల కోణంలో వీక్షించవచ్చు. అనంతగిరి అడవులు, ఎత్తైన కొండలు.. వాటిపై పరచుకున్న పచ్చదనం.. జలపాతాలు.. ఇలా ఎన్నో అందాలు కళ్లార్పకుండా చూసే అవకాశం కలగనుంది. 84 ప్రధాన వంతెనలు.. 58 సొరంగాల గుండా ఈ రైలు ప్రయాణించనుంది. ఒక్కో సొరంగం అర కిలోమీటర్ నుంచి ఒకటిన్నర కిలోమీటర్ పొడవుంటుంది. ఇలా.. ఎన్నో అనుభూతులను మూటగట్టుకునేలా రైలు ప్రయాణం సాగుతుంది.
రైల్వే బోర్డు అనుమతించిన వెంటనే...
అరకు– కిరండూల్ మార్గంలో రెండు విస్టాడోమ్ కోచ్‌లతో ఎల్‌హెచ్‌బీ ట్రైన్ నడిపేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ నెల 22న ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. రైల్వే బోర్డు నుంచి ఇంతవరకు ఎలాంటి సమాచారం అధికారికంగా అందలేదు. ఎప్పుడు సమాచారం వస్తే అప్పుడు ప్రారంభించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే రెండుసార్టు ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించాం. ఎల్‌హెచ్‌బీ ట్రైన్ ప్రారంభమైతే.. పర్యాటకులు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతి పొందుతారు.
– అనూప్‌కుమార్ సత్పతి, డీఆర్‌ఎం, వాల్తేరు డివిజన్
Comments
Please login to add a commentAdd a comment