అరకు విస్టాడోమ్ కోచ్‌లో ప్రయాణం(పాతచిత్రం)
సాక్షి, విశాఖపట్నం: ప్రకృతి రమణీయతతో విలసిల్లుస్తున్న అద్భుత పర్వత పంక్తి అరకు. ఈ ప్రాంతం ఎంత అందంగా ఉంటుందో.. ఆ అందాల నడుమ చేసే ప్రయాణమూ అంతే అద్భుతంగా ఉంటుంది. ఎత్తైన కొండలు, కోనలు, గుహల మధ్య వయ్యారంగా సాగిపోయే రైల్లో ప్రయాణం సరికొత్త అనుభూతినిస్తుంది. ఈ ప్రయాణాన్ని మరింత మజాగా మార్చింది అద్దాల పెట్టె. విశాఖ నుంచి అరకు వెళ్లే రైలుకు అమర్చిన ఈ అద్దాల పెట్టె నుంచి అణువణువూ అందాలతో తొణికిసలాడే అద్భుతాలను వీక్షిస్తూ.. ప్రయాణికులు లెక్కలేనన్ని మధురానుభూతులను ఆస్వాదించారు. ఇప్పుడు మొత్తం అద్దాల పెట్టెలతోనే ఓ సరికొత్త రైలు.. విశాఖ– అరకు మధ్య ప్రకృతి సౌందర్యాన్ని అత్యద్భుతంగా చూపించేందుకు సిద్ధమవుతోంది.
పర్యాటకుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని విశాఖ– అరకు మధ్య 5 విస్టాడోమ్ కోచ్‌లతో సర్వీస్ ప్రారంభించాలి. గతంలో దీనికి సంబంధించి ఇచ్చిన హామీ త్వరితగతిన అమల్లోకి వచ్చేలా చూడాలి.
– రైల్వే మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో ఎంపీ విజయసాయిరెడ్డి
ఈ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. అరకుకు కచ్చితంగా విస్టాడోమ్ కోచ్‌లను కేటాయిస్తాం. ప్రస్తుతం ఈ కోచ్‌లు తయారీలో ఉన్నాయి. పర్యాటకుల డిమాండ్‌కు అనుగుణంగా విస్టాడోమ్ కోచ్‌లు కేటాయిస్తాం.
– విజయసాయిరెడ్డి లేఖకు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పందన
ఈ నేపథ్యంలో విదేశాలకే పరిమితమైన అద్దాలతో కూడిన విలాసవంతమైన విస్టాడోమ్ రైలు విశాఖ– అరకు మధ్య త్వరలోనే చక్కర్లు కొట్టనుంది. ఆంధ్రా ఊటీగా పిలవబడే అరకు ప్రయాణానికి మరింత అందాన్ని, సరికొత్త అనుభూతిని పంచేలా కొత్త రైలు మొదలుకానుంది. అరకు రైలు ప్రయాణమంటే ఇష్టపడని వారెవ్వరూ ఉండరు. రైలు నుంచి ప్రకృతి అందాన్ని తనివితీరా చూసేందుకు విశాఖ నుంచి అరకు వెళ్లే రైలులో 2017 ఏప్రిల్ 16 విస్టాడోమ్ కోచ్(అద్దాల పెట్టె)ను ఏర్పాటు చేశారు. ఈ కోచ్ నుంచి అద్భుతాలను చూసేందుకు పర్యాటకుల నుంచి డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో మరో కోచ్ ఏర్పాటు చేయాలని 2017లోనే ప్రతిపాదించారు. అప్పటి నుంచి ఈ ప్రతిపాదన బుట్టదాఖలవుతూ వస్తోంది. తాజాగా విస్టాడోమ్ కోచ్‌లతో రైల్వే సరీ్వస్ ప్రారంభించాలని ఎంపీ విజయసాయిరెడ్డి రైల్వే మంత్రిత్వ శాఖకు లేఖ రాయడం, దీనికి కేంద్ర రైల్వే మంత్రి స్పందిస్తూ విస్టాడోమ్ కోచ్‌లు కేటాయిస్తామని చెప్పారు. ఈ మేరకు రైల్వే బోర్డు ఐదు విస్టాడోమ్ కోచ్‌లు సిద్ధం చేస్తోంది. వీటితో పాటు ప్రస్తుతం ఉన్న కోచ్ కలిపి మొత్తం 6 అద్దాల పెట్టెలతో స్పెషల్ టూరిస్ట్ రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది.
గతేడాది ప్రకటన
అరకు పర్యాటకానికి విస్టాడోమ్ కోచ్‌లు అదనంగా ఇవ్వాలంటూ వైఎస్సార్‌సీపీ ఎంపీలు రైల్వే మంత్రిత్వ శాఖతో పాటు రైల్వే బోర్డుపైనా ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో ఏకంగా 5 విస్టాడోమ్ కోచ్‌లు అరకుకు అందించేందుకు రైల్వే బోర్డు గతేడాది అంగీకారం తెలిపింది. 2019 చివరిలో విశాఖలో పర్యటించిన రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి సైతం.. అరకు కోసం 5 అద్దాల కోచ్‌లు ఇస్తున్నట్లు ప్రకటించారు.
స్పెషల్ టూరిస్ట్ ట్రైన్: అరకు పర్యాటకానికి మరింత అందాన్నిచ్చేలా స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ అందుబాటులోకి రానుంది. కొత్తగా రానున్న 5 విస్టాడోమ్ కోచ్‌లతో పాటు విశాఖ–కిరండూల్ రైలుకు ప్రస్తుతం ఏర్పాటు చేసిన విస్టాడోమ్ కోచ్‌తో కలిపి మొత్తం 6 అద్దాల పెట్టెలతో స్పెషల్ టూరిస్ట్ రైలు చక్కర్లు కొట్టేలా వాల్తేరు డివిజన్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఒ క్కో కోచ్‌లో 45 సీట్లుంటాయి. గతంలో కేవలం 45 మంది పర్యాటకులకు మా త్రమే అద్దాల పెట్టెలో ప్రయాణించే వీలుండేది. కొత్తగా రానున్న టూరిస్ట్ రైలులో ఏకంగా 270 మంది అరకు అందాలను అద్దాల్లో వీక్షించే అవకాశం కలగనుంది.
కోచ్‌లు అందుబాటులోకి రాగానే...
ఇన్ని విశిష్టతలతో కూడుకున్న ఈ రైలు పట్టాలెక్కించేందుకు డివిజన్ అధికారులు ఆసక్తి చూపిస్తున్నారు. కోచ్‌లు అందుబాటులోకి వచ్చిన వెంటనే.. ఏ సమయంలో నడపాలన్న అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు వాల్తేరు అధికారులు తెలిపారు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అరకు సరీ్వసును రద్దు చేశారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత సర్వీసులు ప్రారంభించనున్నారు. కోచ్‌లు వచ్చిన వెంటనే ట్రయల్ రన్ నిర్వహించి.. నెల రోజుల్లోనే సరీ్వసు ప్రారంభించేందుకు సన్నద్ధమవుతామని డివిజన్ అధికారులు చెబుతున్నారు.
84 వంతెనలు.. 58 సొరంగాలు..
ఈ విస్టాడోమ్ కోచ్‌ల్లో సీట్లు 180 డిగ్రీల కోణంలో తిరిగే సౌకర్యం ఉంటుంది. ఒకవైపు అందాల్ని చూస్తున్న సమయంలో మరోవైపు తిరగాలంటే శ్రమించాల్సిన అవసరం లేకుండా రొటేటింగ్ సీట్‌లో సులువుగా తిరిగి 360 డిగ్రీల కోణంలో అందాలు వీక్షించవచ్చు. అనంతగిరి అడవులు, ఎత్తైన కొండలు.. వాటిపై పరచుకున్న పచ్చదనం.. జలపాతాలు.. ఇలా.. ఎన్నో అందాలు కళ్లార్పకుండా చూసే అవకాశం కలగనుంది. 84 ప్రధాన వంతెనలు.. 58 సొరంగాల గుండా ఈ రైలు ప్రయాణించనుంది. ఒక్కో సొరంగం అర కిలోమీటర్ నుంచి ఒకటిన్నర కిలోమీటర్ వరకు పొడవుంటుంది. ఇలా.. ఎన్నో అనుభూతుల్ని మూటగట్టుకునేలా రైలు ప్రయాణం సాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment