శాస్త్రబాలకు శుభాకాంక్షలు
ఈరోజుకొక ప్రత్యేకత ఉంది.
కానీ ఆ ప్రత్యేకతను మన దేశానికిచ్చిన అమ్మాయికి...
మనం ఏ విధమైన ప్రత్యేకతనూ ఇవ్వలేకపోయాం!
ఈ ‘డే’ అనీ, ఆ ‘డే’ అనీ...
డే బై డే... ఏదో ఒక ‘డే’ జరుపుకుంటూనే ఉన్నాం.
ఆమె గుర్తుకొచ్చేలా మాత్రం ఒక్క ‘డే’నైనా ఘనంగా, గౌరవంగా ప్రకటించుకోలేకపోయాం.
ఇవాళ ఆమె బర్త్ డే. పేరు హర్షాచావ్డా.
భారతదేశపు మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ!
పండంటి బిడ్డ పుడితే ‘పూజాఫలం’ అంటారు.
ఆ మాటను సైన్స్ అంగీకరించదు కాబట్టి...
హర్షాచావ్డాను ‘శాస్త్రవిజ్ఞాన విజయఫలం’ అనాలి.
అంతటి విజయాన్ని ప్రసాదించిన ఈ ‘శాస్త్రబాల’ఇప్పుడు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు?
శాస్త్రం ‘సంతానప్రాప్తిరస్తు..’ అని దీవించింది! దాదాపు నాలుగుదశాబ్దాల కిందట వైద్య జీవశాస్త్రంలో జరిగిన ఈ అద్భుతం... అలుపెరగక జనాభా వృద్ధి చెందుతున్న దేశంలోనూ కొందరు అభాగ్య నిస్సంతు తల్లిదండ్రులకు ఆశాకిరణంగా నిలిచింది. అలా తొలిసారి ఉదయించిన ఆ ఆశాకిరణమే ‘హర్షా చావ్డా’. కృత్రిమ గర్భధారణ. (ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్.. మహిళ అండాన్ని, పురుషుడి శుక్రకణాన్ని సేకరించి, ఫలదీకరణ చేయించి, ఈ పిండాన్ని గర్భంలో ప్రవేశపెట్టే విధానం) ద్వారా భారతదేశంలో జన్మించిన తొలిబిడ్డ ‘హర్షాచావ్డా’. ఈ రోజు ఆమె పుట్టినరోజు. 1986 ఆగస్ట్ ఆరో తేదీన ముంబైలోని కేఈఎమ్ ఆసుపత్రిలో హర్షాచావ్డా జన్మించింది. నేటితో 27 ఏళ్లు నిండిన సందర్భంలో హర్ష గురించి, టెస్ట్ట్యూబ్ బేబీల ప్రస్థానం గురించిన వివరాలివి.
మహారాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న కింగ్ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్(కేఈఎమ్) ఆసుపత్రిలో ప్రతి రోజూ ఎంతో మంది పిల్లలు జన్మిస్తుంటారు. దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ ఆసుపత్రి డాక్టర్లు వేలాదిమంది గర్భిణులకు ఆసరాగా ఉంటారు. ఇలాంటి ఆసుపత్రికి హర్షాచావ్డా చరిత్రలో నిలబడిపోయే గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ ఆసుపత్రి డాక్టర్ ఇందిరా హిందూజా సంరక్షణలో శామ్జీ చావ్డా, మణిచావ్డా దంపతులకు హర్ష జన్మించింది. వీరిదొక సాధారణ మధ్యతరగతి కుటుంబం. సంతాన సాఫల్యం కోసం వైద్యులను ఆశ్రయించిన ఆ దంపతుల సమ్మతితో ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ ప్రక్రియను ప్రయోగించారు డాక్టర్ ఇందిర. అది విజయవంతం అయ్యి హర్ష జన్మించింది.
పుట్టుక ఒక సంచలనం...
భారతీయ వైద్యులు సాధించిన ఘనతగా, సృష్టికి ప్రతి సృష్టి అనదగ్గ ప్రక్రియలో జన్మించిన అద్భుతంగా హర్ష గొప్ప గుర్తింపు దక్కించుకుంది. అప్పటికే వందకోట్ల జనాభాకు దగ్గరపడ్డ దేశంలో పుట్టుకతోనే ప్రత్యేకమైన బేబీగా గుర్తింపు తెచ్చుకున్న హర్ష గురించిన ప్రతి అంశమూ చాలా ఆసక్తికరమే అయ్యింది. ఇప్పటికీ దేశంలోని తొలి టెస్ట్ట్యూబ్ బేబీగా హర్షకు అంతే ప్రత్యేకత ఉంది. అయితే ఈ ప్రత్యేకత ఆమె వ్యక్తిగత జీవితానికి ఏ విధంగానూ ఉపయోగపడలేదు. అసహజమైన పద్ధతిలో జన్మించిన హర్ష మనదేశంలోని సహజమైన సమస్యలతో సహవాసం చేస్తోంది. ఆర్థికపరమైన ఇబ్బందులు, నిరుద్యోగం వంటి సమస్యలు హర్ష వంటి ప్రత్యేకమైన బేబీని కూడా వదల్లేదు. ముంబైలోని జోగేశ్వరి ప్రాంతంలో తన తల్లి మణితో కలిసి ఉంటోంది హర్ష.
ఆమె తండ్రి మరణించాడు. దీంతో పెద్దదిక్కులేని ఈ కుటుంబానికి ఆసరా లేకుండా పోయింది. ముంబై యూనివర్సిటీ నుంచి కామర్స్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన హర్ష కుటుంబ పరిస్థితులతో ఏదో ఒక జాబ్ చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో నాలుగైదు వేల జీతాన్నిచ్చే ఉద్యోగాలను చేస్తూ వచ్చిన హర్ష రెండేళ్ల క్రితం నిరుద్యోగిగా మారింది. తల్లి అనారోగ్యం కారణంగా డ్యూటీకి వెళ్లలేకపోవడంతో ఉద్యోగం నుంచి తీసేశారని హర్ష చెప్పింది. ‘ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ పద్ధతిలో జన్మించాను అనే ప్రత్యేకత తప్ప నా జీవితంలో మరే ప్రత్యేకతా లేకుండా పోయింది..’అంటూ హర్ష నిర్వేదం వ్యక్తం చేసింది.
హర్ష తల్లి కూడా ఇలాంటి భావననే వ్యక్తపరిచారు. ‘మేం పేదవాళ్లం. భర్త పోయాక పరిస్థితి మరింత దిగజారింది. దేశంలో పుట్టిన తొలి టెస్ట్ట్యూబ్ బేబీకి తల్లిని అనే గొప్ప తప్ప నాకు మిగిలిందేమీ లేదు...’ అని మణి చావ్డా అన్నారు. ఇది జరిగి రెండేళ్లయింది. అయితే ఇప్పటికీ హర్షకు మంచి ఉద్యోగం వచ్చిన దాఖలాలు లేవు. చిన్న చిన్న ఉద్యోగాలతో, చాలీచాలని జీతంతో జీవితాన్ని నెట్టుకొస్తోంది.
పుట్టిన రోజు పండగ కాలేదు!
ఈ రోజు హర్ష పుట్టినరోజు! ఇది భారతీయ వైద్యశాస్త్రంలో ఒక ప్రత్యేకమైన రోజు. మన డాక్టర్ల నైపుణ్యానికి కొత్త గుర్తింపు తెచ్చిపెట్టిన రోజు. ఒక పండగ రోజు! ఈ విషయాన్నే హర్ష తల్లివద్ద ప్రస్తావిస్తే... ఇప్పుడు తన కూతురి పుట్టినరోజును పండగగా జరుపుకునే స్థాయిలో లేమని అంటారు. ఈ విధంగా భారతదేశంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి అయిన హర్ష పుట్టిన రోజు ఎటువంటి ప్రత్యేకత లేకుండానే గడిచిపోతోంది. మనమైనా ఈ శాస్త్రబాలకు శుభాకాంక్షలు చెబుదాం.
- జీవన్
టెస్ట్ట్యూబ్ బేబీల జనాభా 50 లక్షలు..!
ప్రస్తుతం ప్రపంచ జనాభా దాదాపు 700 కోట్లు. వీరిలో ప్రకృతి సహజంగా జన్మించిన వారు ఎంతమంది? అంటే 50 లక్షల మంది టెస్ట్ట్యూబ్ బేబీలను మైనస్ చేసుకోవాల్సిందే. మన దేశంలో మాత్రం టెస్ట్ట్యూబ్ బేబీల సంఖ్య బాగా తక్కువ. దేశ జనాభాతో పోల్చినప్పుడు వీరి నిష్పత్తి అంతర్జాతీయ స్థాయి కన్నా చాలా తక్కువగా ఉంది. దేశంలో టెస్ట్ట్యూబ్బేబీలు వేల సంఖ్యలో మాత్రమే ఉన్నారని ఒక అంచనా. ఇక్కడి వాతావరణ పరిస్థితులతో టెస్ట్ట్యూబ్ బేబీ ప్రక్రియ విజయవంతం అయ్యే అవకాశాలు తక్కువేనని నిపుణులు అంటారు.
ఉద్యోగాన్ని సృష్టించడం సాధ్యం కాలేదా!
సృష్టికి ప్రతిసృష్టి చేస్తూ... మనిషి తన మేధస్సుతో మరో మనిషికి జన్మనివ్వగలడేమో కానీ.. ఆ మనిషికి తగిన కనీస సదుపాయాలను కల్పించే స్థితిలో మాత్రం లేడని హర్షను చూస్తే అనుకోవాల్సి వస్తోంది. విద్యార్హతలున్నప్పటికీ, ఒక వ్యక్తికి ఉద్యోగాన్ని సృష్టించడం మనిషిని సృష్టించినంత సులభం కాదని అర్థమౌతోంది! ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ బాధ్యతను ప్రభుత్వం ఎందుకు తీసుకోలేదు? క్రీడాకారుల కోటాలో, ఇంకా వివిధ కోటల్లో ప్రభుత్వం ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. అలాంటిది దేశంలోనే తొలి టెస్ట్ట్యూబ్ బేబీ అనే ప్రత్యేకతను కలిగి ఉన్న హర్షను ప్రభుత్వం కానీ, వైద్య శాస్త్ర ప్రముఖులు కానీ పట్టించుకోకపోవడం దురదృష్టకరం.
హర్ష, ఇందిర లకే ఈ గుర్తింపు ఎలా దక్కిందంటే..
వాస్తవంగా చెప్పాలంటే భారతదేశంలో పుట్టిన తొలి టెస్ట్ట్యూబ్ బేబీ హర్ష కాదు! ‘దుర్గ’ అలియాస్ కనుప్రియా అగర్వాల్. ప్రపంచంలో తొలిసారి 1978 జూలై 25న లూసీ బ్రౌన్ కళ్లు తెరవగా... అదే ఏడాది అక్టోబర్ మూడున మనదేశంలో ‘దుర్గ’ జన్మించింది. ఇలా దేశంలో తొలి ఐవీఎఫ్ విజయాన్ని అందించింది డాక్టర్ సుభాష్ ముఖోపాధ్యాయ. కలకత్తాకు చెందిన సుభాష్ ఆవిష్కరించిన అద్భుతం ఆయన పాలిట ఒక శాపంగా మారింది. అవమానాలు ఎదురయ్యాయి. సామాజికంగా వేధింపులు ఎదురయ్యాయి. పశ్చిమబెంగాల్ ప్రభుత్వమే ‘దుర్గ’ జననాన్ని నైతికంగా ప్రశ్నిస్తుండటంతో మానసిక వేదనకు గురై ఉపాధ్యాయ 1981 జూన్19న ఆత్మహత్య చేసుకున్నారు. దుర్గ పుట్టిన ఎనిమిదేళ్ల తర్వాత హర్ష జన్మించింది. ఈ ప్రకియకు అధికారిక ధ్రువీకరణ రావడంతో హర్షాచావ్డా, గైనకాలజిస్ట్ ఇందిర హిందూజాలు రికార్డు పుటల్లో స్థానం సంపాదించారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి యేటా 1.5 లక్షల మంది టెస్ట్ట్యూబ్ బేబీస్ జన్మిస్తున్నారని అంచనా.
ఈ విషయంలో మనదేశంలో బాగా వెనుకబడి ఉంది. సాంఘికపరమైన పరిస్థితులు, ఖర్చు, సక్సెస్ రేటు.. ఈ మూడు విషయాలూ మన దేశంలో టెస్ట్ట్యూబ్బేబీస్ సంఖ్యను ప్రభావితం చేస్తోందని వైద్యులు
చెబుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఐవీఎఫ్ పద్ధతిలో సక్సెస్ రేటు చాలా తక్కువగా ఉంది. 35 యేళ్లలోపు మహిళల్లో కూడా 33.1 శాతం ప్రయోగాలు మాత్రమే విజయవంతం అవుతున్నాయి.
టెస్ట్ట్యూబ్ బేబీస్ హెల్త్ రిస్క్ గురించి అనేక అధ్యయనాలు జరిగాయి. కొన్ని అధ్యయనాలేమో ఐవీఎఫ్ పద్ధతిలో జన్మించిన వారి ఆరోగ్యస్థితి, ఆయుఃప్రమాణం సాధారణ మనిషిలాగే ఉంటుందని అభ్రిపాయపడ్డాయి.
మరికొన్ని అధ్యయనాలు ప్రీమెచ్యూర్ డెలివరీకి అవకాశం ఉంటుందని, పుట్టిన పిల్లల ఎమోషన్స్, సైకలాజికల్ స్ట్రెస్, ఎక్కువ మెడిసిన్స్ వాడాల్సి రావడం వంటి సమస్యలు ఉంటాయని అభిప్రాయపడ్డాయి.