యువతరం గుండెల్లో నిలిచిన 'వివేక్': వరవరరావు
సూర్యాపేట (నల్లగొండ): వివేక్ యువతరం గుండెల్లో చిరకాలంగా నిలిచిపోయాడని, తమ కుటుంబంలో వీరన్న, ఎమ్మెస్సార్‌లా మెలిగాడని విప్లవ ప్రజాస్వామ్య ఫ్రంట్ (ఆర్డీఎఫ్) జాతీయ అధ్యక్షుడు, విరసం నేత వరవరరావు తెలిపారు. ఆదివారం నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణంలో ఆయన ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్లో చనిపోయిన వివేక్ మృతదేహాన్ని సందర్శించి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కరీంనగర్‌కు చెందిన నల్లా ఆదిరెడ్డే అంటే వివేక్ కు ఎంతో ఆదర్శమని.. అతని పేరునే తనకు అలియాస్ రఘుగా పెట్టి పిలవాలని.. కోరినట్లు తెలిపారు. వివేక్ మేధావి కాబట్టే సమ సమాజ నిర్మాణం కోసం దళ సభ్యునిగా కొనసాగుతూ.. లంకపల్లి గ్రామంలోని ఆదివాసీల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్నారని తెలిపారు. శుక్రవారం ఛత్తీస్‌గఢ్‌లో ఆదివాసీల సమస్యలను తెలుసుకొని తిరిగి వస్తుండగా పోలీసులు ఎన్కౌంటర్లో చంపారని తెలిపారు.
వివేక్ అంతిమయాత్ర..
పట్టణంలోని భగత్‌సింగ్‌నగర్‌లోని వివేక్ అలియాస్ రఘు నివాసం నుంచి చేపట్టిన అంతిమయాత్రలో విప్లవయోధులు, ప్రజలు లాల్ సలాం పలికారు. వివేక్ మృతదేహం వద్ద పలువురు ఆలపించిన విప్లవ గేయాలు అందరినీ కంటతడి పెట్టించాయి. వివేక్ అంతిమయాత్రలో విరసం నేత వరవరరావు ముందుభాగంలో నిలిచారు. వివేక్‌కు నివాళులర్పించిన వారిలో ప్రజాసంఘాలు, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల, ఆయా పార్టీల నాయకులు ఉన్నారు.