VK Murthy
-
కెమేరా కురువృద్ధుడు వీకే మూర్తి కన్నుమూత
ఛాయాగ్రహణశాఖలో కురువృద్ధుడు, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ గ్రహీత వి.కె. మూర్తి (91) సోమవారం ఉదయం బెంగళూరులోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. 1923 నవంబర్ 26న మైసూరులో జన్మించిన మూర్తికి మొదట్నుంచీ ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. సినిమాటోగ్రఫీ కోర్స్ చేసి, ముంబయ్‌లో పలువురు ప్రముఖ ఛాయగ్రాహకుల దగ్గర అప్రెంటిస్‌గా పనిచేశారు. గురుదత్ తీసిన ‘బాజీ’తో ఛాయాగ్రాహకునిగా పరిచయమయ్యారు. గురుదత్ తీసిన సినిమాల్లో చాలా వాటికి మూర్తి ఛాయాగ్రహణం చేశారు. ‘ప్యాసా’, ‘సాహెబ్ బీబీ ఔర్ గులామ్’, ‘ఆర్-పార్’ తదితర చిత్రాలన్నీ వీరిద్దరి కలయికలో రూపొందిన ఆణి ముత్యాలే. కమల్ అమ్రోహీ దర్శకత్వంలో వచ్చిన కళాఖండం‘పాకీజా’కు మూర్తి కెమెరా పనితనం వన్నెలద్దింది. తొలి భారతీయ సినిమా స్కోప్ చిత్రం ‘కాగజ్ కే ఫూల్’కి ఛాయాగ్రహణ బాధ్యతలు చేపట్టిన ఘనత మూర్తిదే. ప్రమోద్ చక్రవర్తి, శ్యామ్ బెనెగల్ లాంటి దర్శక హేమాహేమీల చిత్రాలక్కూడా ఆయన పనిచేశారు. శ్యామ్ బెనెగల్ దర్శకత్వంలో దూరదర్శన్ నిర్మించిన టీవీ సిరీస్ ‘భారత్ ఏక్ ఖోజ్’కి కూడా మూర్తే ఛాయాగ్రాహకుడు. ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి సినిమాటోగ్రాఫర్ ఆయనే కావడం విశేషం. నాలుగు దశాబ్దాల సినిమా కెరీర్లో మూర్తి పలు అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఇక విశ్రాంత జీవితం గడపాలనే ఆలోచనతో 2001లో స్వస్థలం బెంగళూరు వెళ్లిపోయారు మూర్తి. -
ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ వీకే మూర్తి కన్నుమూత
బెంగళూరు: ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత వీకే మూర్తి కన్నుమూశారు. ఆయన వయస్సు 91 సంవత్సరాలు. 1923లో మైసూర్ లో జన్మించారు. గత కొద్ది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వీకే మూర్తికి ఛాయా మూర్తి అనే కూతురు ఉంది. బాలీవుడ్ నటుడు, దర్శకుడు గురుదత్ ఊహలకు దృశ్యరూపం కల్పించని వ్యక్తి పేర్కొనే వీకే మూర్తి ప్యాసా, సాహిబ్, బీబీ, ఔర్ గులామ్, కాగజ్ కే పూల్ చిత్రాలకు పని చేశారు. ఇంకా ఆర్ పార్, పాకీజా, రజియా సుల్తానా లాంటి చిత్రాలకు తన సినిమాటోగ్రఫితో అదనపు ఆకర్షణగా నిలిచారు. వీకే మూర్తి చిత్రీకరించిన 'చౌదవీన్ కా చాంద్' పాట ఇప్పటికి హిందీ సినిమా చిరిత్రలో గొప్పపాటగా నిలిచిపోయింది. సాహిబ్, బీబీ, ఔర్ గులామ్, కాగజ్ కే పూల్ చిత్రాలకు ఫిలిం ఫేర్ అవార్డులు లభించాయి. భారతీయ టెక్నిషియన్లలో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న మొట్టమొదటిగా వీకే మూర్తి రికార్డుల్లోకెక్కారు. హువా హన్ను అనే కన్నడ చిత్రంతో కెరీర్ ఆరంభించారు. విద్యార్ధి జీవితంలో స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న ఆయన 1943లో ఆయన జైలు జీవితాన్ని అనుభవించారు.