కెమేరా కురువృద్ధుడు వీకే మూర్తి కన్నుమూత | VK Murthy, renowned cinematographer, dies at 91 | Sakshi
Sakshi News home page

కెమేరా కురువృద్ధుడు వీకే మూర్తి కన్నుమూత

Published Mon, Apr 7 2014 11:33 PM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

కెమేరా కురువృద్ధుడు వీకే మూర్తి కన్నుమూత - Sakshi

కెమేరా కురువృద్ధుడు వీకే మూర్తి కన్నుమూత

 ఛాయాగ్రహణశాఖలో కురువృద్ధుడు, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ గ్రహీత వి.కె. మూర్తి (91) సోమవారం ఉదయం బెంగళూరులోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. 1923 నవంబర్ 26న మైసూరులో జన్మించిన మూర్తికి మొదట్నుంచీ ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. సినిమాటోగ్రఫీ కోర్స్ చేసి, ముంబయ్‌లో పలువురు ప్రముఖ ఛాయగ్రాహకుల దగ్గర అప్రెంటిస్‌గా పనిచేశారు. గురుదత్ తీసిన  ‘బాజీ’తో ఛాయాగ్రాహకునిగా పరిచయమయ్యారు. గురుదత్ తీసిన సినిమాల్లో చాలా వాటికి మూర్తి ఛాయాగ్రహణం చేశారు. ‘ప్యాసా’, ‘సాహెబ్ బీబీ ఔర్ గులామ్’, ‘ఆర్-పార్’ తదితర చిత్రాలన్నీ వీరిద్దరి కలయికలో రూపొందిన ఆణి ముత్యాలే. 
 
 కమల్ అమ్రోహీ దర్శకత్వంలో వచ్చిన కళాఖండం‘పాకీజా’కు మూర్తి కెమెరా పనితనం వన్నెలద్దింది. తొలి భారతీయ సినిమా స్కోప్ చిత్రం ‘కాగజ్ కే ఫూల్’కి ఛాయాగ్రహణ బాధ్యతలు చేపట్టిన ఘనత మూర్తిదే. ప్రమోద్ చక్రవర్తి, శ్యామ్ బెనెగల్ లాంటి దర్శక హేమాహేమీల చిత్రాలక్కూడా ఆయన పనిచేశారు. శ్యామ్ బెనెగల్ దర్శకత్వంలో దూరదర్శన్ నిర్మించిన టీవీ సిరీస్ ‘భారత్ ఏక్ ఖోజ్’కి కూడా మూర్తే ఛాయాగ్రాహకుడు. ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి సినిమాటోగ్రాఫర్ ఆయనే కావడం విశేషం. నాలుగు దశాబ్దాల సినిమా కెరీర్‌లో మూర్తి పలు అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఇక విశ్రాంత జీవితం గడపాలనే ఆలోచనతో 2001లో స్వస్థలం బెంగళూరు వెళ్లిపోయారు మూర్తి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement