సాక్షి, సిటీబ్యూరో: రాచకొండకు చెందిన ఓ గృహిణి వాట్సాప్‌కు ‘జవాన్’ సినిమాకు రేటింగ్ ఇస్తే డబ్బులొస్తాయని మెసేజ్ వచ్చింది. ఆశ్చర్యపోతూనే..నేరస్తులు పంపిన నాలుగైదు సినిమాలకు రేటింగ్, రివ్యూలు ఇచ్చేసరికి ఆమె పేరుతో ఉన్న ప్రత్యేక వాలెట్‌లో రూ.20 వేలు జమ అయ్యాయి. ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించానని తెలిస్తే తన భర్త మెచ్చుకుంటాడని భావించింది. ఈసారికి నేరస్తుల నుంచి ఒకేసారి పది సినిమాలకు రేటింగ్ లింక్‌లు పంపించాలంటే కొంత అమౌంట్ డిపాజిట్ చేయాలని ఆమెకు సందేశం వచ్చింది.
దీంతో వాళ్ల మాటలను నమ్మి రూ.2 లక్షలు బదిలీ చేసింది. సినిమాలకు రేటింగ్ ఇచ్చినా ఆమెకు ఎలాంటి డబ్బులు రాలేదు. కమీషన్ రావాలంటే రూ.50 వేలు చార్జీ అవుతుందని కేటుగాళ్ల సూచన మేరకు అవి కూడా పంపించింది. అంతే అప్పట్నుంచి సైబర్ నేరస్తులు సైలెంటైపోయారు. ఆఖరికి వ్యాలెట్‌లో ఉన్న రూ.20 వేలు డ్రా చేసుకునే అవకాశం కూడా లేకపోయే సరికి తాను మోసపోయానని గ్రహించింది.
..ఇదీ సైబర్ నేరస్తుల రేటింగ్ వలకు చిక్కి విలవిల్లాడిన ఓ గృహిణి ఉదంతం. ఈమె ఒక్కరే కాదు సైబర్ నేరస్తుల సినిమా రేటింగ్ వలకు చాలా మంది నగరవాసులు చిక్కుతున్నారు. గృహిణిలు, నిరుద్యోగులు, యువతను లక్ష్యంగా చేసుకొని కేటుగాళ్లు సరికొత్త మోసాలకు తెరలేపారు.
ఆశే నేరస్తుల పెట్టుబడి..
‘మేము పంపించే సినిమాలకు రేటింగ్‌లు, రివ్యూలు ఇస్తే చాలు..ఇంట్లో కూర్చొని రోజుకు రూ.వేలల్లో సంపాదించవచ్చు’ ఈ ప్రకటన చూస్తే ఎవరికై నా ఆశ కలుగుతుంది. ఇదే నేరస్తుల పెట్టుబడి. ఫేస్‌బుక్, ట్విట్టర్, టెలిగ్రాం, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాలలో ఈ తరహా ప్రకటనలు, పోస్టులు పెడుతూ ఆకర్షిస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా జేబులు ఖాళీ అవుతాయని హెచ్చరిస్తున్నారు. మనం ప్రమేయం లేకుండా వాట్సాప్, టెలిగ్రాం, ఇన్‌స్ట్రాగామ్ గ్రూప్‌లలో చేరకూడదని సూచిస్తున్నారు.
మోసం ఎలా చేస్తారంటే...
తాము సూచించిన సినిమాలకు రేటింగ్ ఇవ్వాలంటూ సోషల్ మీడియాలలో సందేశాలు పంపిస్తారు. రేటింగ్ ఇవ్వాల్సిన తీరు, కమీషన్ ఎలా చెల్లిస్తారు? ఎన్ని రోజుల్లో ఎంత సంపాదన వస్తుందో వివరంగా ఉంటుంది. ఈ లింకును క్లిక్ చేయగానే ఆటోమెటిక్‌గా సైబర్ నేరగాళ్లు ఏర్పాటు చేసిన వాట్సాప్, టెలిగ్రాం గ్రూప్‌లలో చేరతారు. ముందుగా కొన్ని సినిమాల పేర్లను పంపించి వాటికి రివ్యూ ఇవ్వగానే ప్రత్యేక వాలెట్‌లో కొంత డబ్బు జమ చేస్తారు. మనకు నమ్మకం కుదిరేవరకూ మనం డబ్బు డ్రా చేసే అవకాశం ఇస్తారు. ఆ తర్వాత ఎక్కువ సినిమాలకు రేటింగ్ ఇచ్చే అవకాశం ఇస్తామంటూ డబ్బు వసూలు చేస్తారు. ఆ తర్వాత వారితో లింక్ కట్ అవుతుంది.
చదవండి: నాలుగేళ్లుగా సినిమాలకు దూరం.. వంద కోట్ల ప్రాజెక్ట్ వచ్చినా నో చెప్పిన నటుడు!
Comments
Please login to add a commentAdd a comment