సాక్షి, హైదరాబాద్: ‘ఈ బ్యాంకు ఖాతాకు మీరు డబ్బు ఎందుకోసం పంపారు? ఈ ఆర్థిక లావాదే వీలు జరిపిన వ్యక్తులు మీకు ఎలా తెలుసు? ఎప్పటి నుంచి ఈ బ్యాంకు ఖాతాలకు డబ్బులు పంపుతున్నారు?’ ఇలాంటి అనేక కీలక ప్రశ్నలు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు నటుడు నవదీప్‌కు సంధించినట్లు సమాచారం. కొందరు నైజీరియన్ల బ్యాంకు ఖాతాలకు నవదీప్ బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు వెళ్లినట్టుగా ఈడీ అధికా రులు గుర్తించినట్టు తెలిసింది.
2017లో నమోదైన టాలీవుడ్ డ్రగ్స్ కేసులతో పాటు ఇటీవల నమో దైన మాదాపూర్ డ్రగ్స్ కేసులలో ఆర్థిక లావాదేవీ లపై ప్రశ్నించేందుకు తమఎదుట హాజరుకావాలంటూ ఈడీ అధికా రులు నటుడు నవదీప్‌కు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో మంగళవారం ఉదయం 10–40 గంటలకు సైఫాబాద్ లోని ఈడీ కార్యాలయానికి నవదీప్ చేరుకున్నారు.
సమన్లలో పేర్కొన్న విధంగా బ్యాంక్ స్టేట్‌మెంట్లు, పాన్‌కార్డ్ సహా ఇతర డాక్యుమెంట్లను అధికారులకు అందజేశారు. జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్ ఆధ్వర్యంలోని ఐదుగురు అధికారుల ప్రత్యేక బృందం నవదీప్‌ను దాదాపు 8 గంటల పాటు విచారించింది. ముఖ్యంగా నవదీప్‌కు చెందిన 3బ్యాంకు ఖాతాల లావాదేవీలపై ప్రశ్నించినట్టు తెలిసింది.
నైజీరియన్లతో ఆర్థిక లావాదేవీలు..
2017లో తెలంగాణ ఎక్సైజ్‌శాఖ నమోదు చేసిన డ్రగ్స్ కేసులలో కీలక నిందితుడు కెల్విన్ పట్టుబడిన తర్వాత టాలీవుడ్ డ్రగ్స్ లింకులు బయటపడ్డాయి. దీంతో హీరో నవదీప్ సహా పలువురిని ఎక్సైజ్ అధికారులు విచారించారు. ఈడీ మనీలాండరింగ్‌పై దృష్టి పెట్టింది. ప్రత్యేకంగా కేసు నమోదు చేసిన అధికారులు 2021లో నవదీప్‌తో పాటు పలువురు టాలీవుడ్ నటులను ప్రశ్నించారు. ఇప్పటికే ఒకసారి నవదీప్‌ను ప్రశ్నించిన ఈడీ అధికారులు తాజాగా మంగళవారం నాటి విచారణలోనూ ఆయన ఆర్థిక లావాదేవీలపై ఆరా తీశారు.
నవదీప్‌కు ఇటీవల మాదాపూర్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన వరంగల్‌కు చెందిన రామ్‌చంద్ అత్యంత సన్నిహితుడు. రామ్‌చంద్ బెంగళూరులో షెల్టర్ తీసుకుంటున్న నైజీరియన్లు అమోబి చుక్వుడి, మైకేల్, థామస్ అనఘల వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్‌లో కస్టమర్లకు అమ్మేవాడని తేలింది. కాగా హీరో నవదీప్ కూడా డ్రగ్స్ అందించేవాడని దర్యాప్తు సంస్థలు అనుమా నిస్తున్నాయి. ఈ క్రమంలోనే నైజీరియన్లతో నవదీప్ ఆర్ధికపరమైన లావాదేవీలు జరిపినట్టుగా ఈడీ ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.
తాజా డ్రగ్స్ కేసులతో పాటు 2017లో నమోదైన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కూడా నవదీప్ నుంచి వివరాలు రాబడుతున్నట్టు సమాచారం. విచారణ అనంతరం మంగళవారం రాత్రి ఈడీ కార్యాలయం నుంచి తిరిగి వెళుతున్న నవదీప్‌ను మీడియా ప్రతినిధులు పలు అంశాలపై ప్రశ్నించారు. అయితే ఆయన ఏమీ స్పందించకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment