అవరోధ శ్రేణి 19,337-19,525
అధికశాతం షేర్లు నిలువునా పతనం అవుతున్నా, కొద్ది నెలల నుంచి స్టాక్ సూచీలు గరిష్టస్థాయిలో స్థిరపడేందుకు ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఆయిల్ షేర్లు సహకరిస్తూ వచ్చాయి. క్రితం వారం ఐటీ మినహా ఎఫ్ఎంసీజీ, ఆయిల్ షేర్లు కూడా కరెక్షన్ బాట పట్టడంతో స్టాక్ సూచీల్లో కూడా పతనవేగం పెరిగింది. రూపాయి క్షీణతను అదుపుచేయడానికి రిజర్వుబ్యాంక్, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన చర్యలేవీ ఫలితాల్ని ఇవ్వకపోవడంతో బ్యాంకింగ్, రియల్టీ, ఇన్ఫ్రా రంగాల షేర్లను సంస్థాగత ఇన్వెస్టర్లు ఆఫ్‌లోడ్ చేస్తున్నారు. 1998లో ఆగ్నేయాసియా దేశాల్లో సంభవించిన కరెన్సీ సంక్షోభ(కరెన్సీ విలువలు నిలువునా పతనంకావడం) ఛాయలు, ప్రస్తుతం భారత కరెన్సీ మార్కెట్లో కన్పిస్తున్నాయి. అప్పట్లో ఆయా దేశాలతో పాటు మన స్టాక్ మార్కెట్లో కూడా ఎన్నో కీలక రంగాలకు చెందిన పెద్ద షేర్లు పెన్నీ(కారు చౌకగా లభించే) షేర్లుగా మారిపోయాయి. అదేతరహాలో ఇప్పటి మార్కెట్ పతనం కొనసాగుతోంది.