voter card corrections
-
పకడ్బందీగా ఓటరు సవరణ
సాక్షి, మంచిర్యాల : జిల్లాలో సెప్టెంబర్ ఒకటి నుంచి ఇంటింటా ఓటరు సర్వే, జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టనున్నట్లు కలెక్టర్ భారతి హోళీకేరి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 31 వరకు ఓటరు నమోదు, సవరణ చేపడతామని, సెప్టెంబర్ ఒకటి నుంచి 30 వరకు బీఎల్వోలు, వివిధ రాజకీయ పార్టీల బూత్‌లెవల్ నాయకుల సహాయంతో ఇంటింటా పరిశీలనకు వెళ్లాల్సి ఉంటుందని, ఇందులో స్థానికంగా ఉంటున్న వారు, ఇతర వార్డులో ఉన్నవారు, చనిపోయిన, ఓటరు జాబితాల్లో తప్పిదాలను సవరిస్తామని తెలిపారు. 2020 జనవరి ఒకటివరకు 18 ఏళ్లు నిండిన యువత ఓటర్లుగా నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. అభ్యంతరాలు స్వీకరణ అక్టోబర్ 15 నుంచి 30వరకు ఉంటుందన్నారు. ప్రతి పోలింగ్ బూత్‌లో పట్టణ, గ్రామీణ ప్రాంతాలో ఎక్కడైనా 1500 ఓటర్ల లోపు ఉండాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి జియోట్యాగింగ్ ఉంటుందని, ఆన్లైన్, మీసేవ, నేరుగా ఓటరు నమోదుకు అవకాశం కల్పించామని పేర్కొన్నారు. జాబితాలో వివరాలు ప్రత్యేక హెల్ప్‌లైన్ 1950 ద్వారా తెలుసుకోవచ్చన్నారు. భూ సమస్యలకు రెవెన్యూ అధికారులు బాధ్యులు కారు జిల్లాలో నెలకొన్న వివిధ భూ సమస్యలపై గ్రామసభల ద్వారా రైతుల నుంచి వివరాలు సేకరించడంతోపాటు రికార్డులు వారి ముందు ఉంచుతామన్నారు. ప్రభుత్వ భూములు, అసైన్డ్, ఫారెస్ట్, వారసత్వంగా వచ్చినవి, తదితర భూముల సమస్యలు నెలకొన్నాయని, ఇందులో రెవెన్యూ అధికారులు పరిష్కరించేవి కొన్నిఉంటే, సివిల్‌కోర్టు, రిజిస్ట్రేషన్ పరిధిలో ఉన్నాయన్నారు. భూ సమస్యలకు రెవెన్యూ అధికారులది బాధ్యత కాదని పేర్కొన్నారు. మే నెలలో మండల స్థాయిలో నిర్వహించిన భూ సమస్యల పరిష్కార వేదికలో 16వేల వరకు అర్జీలు రాగా అందులో 4 వేల సమస్యలకు పరిష్కారం లభించిందన్నారు. కొన్ని సివిల్ తగాదాలు, కోర్టు పరిధిలోనివి.. తాతలు, తండ్రుల నుంచి వస్తున్న భూములు సాగు చేసుకుంటున్నట్లు రైతులు చెబుతున్నా.. కాస్తులో వారిపేరు, ఇతర రికార్డులు వారివద్ద ఉంటే చూపించాల్సి ఉంటుందని, వాటి ఆధారంగా రెవెన్యూ రికార్డులో ఉన్న వాటిని పరిశీలించి సమస్యకు పరిష్కారం చూపిస్తామని తెలిపారు. వారసత్వ పంపకాలకు సరిహద్దులు చూపించడం కుదురదని, సర్వేనంబర్ల ఆధారంగా హద్దులు చెబుతామని తెలిపారు. కుటుంబంలో పెద్దకుమారుడికి భూమి మొత్తం ఇచ్చి.. ఇప్పుడు అన్నదమ్ములకు సమానంగా ఇవ్వాలని ఫిర్యాదు చేయడం సరికాదని, అలాంటివాటిని సబ్‌కలెక్టర్, సివిల్‌కోర్టులో ఫిర్యాదు చేయాల్సి ఉంటుందన్నారు. ఇలాంటివి సత్వరమే పరిష్కారం కావని పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ కూమర్ దీపక్, జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వర్ పాల్గొన్నారు. -
ఓటరుగా నమోదు చేసుకోండి
సాక్షి, సూర్యాపేట: ఓటరు గుర్తింపు కార్డు.. ఓటు వేసేందుకు కాదు... పింఛన్ మంజూరుకు.. బ్యాంకు ఖాతా తెరిచేందుకు.. వ్యక్తిగత గుర్తింపునకు ఓటరు కార్డే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అంతటి ప్రాధాన్యం కలిగిన ఓటరు కార్డును పొందేందుకు.. అందులో అవసరమైన మారులు, చేర్పులు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది.భారత ఎన్నికల సంఘం ఇందుకోసం ప్రత్యేక షెడ్యూల్ జారీ చేసింది. ఐదు నెలలపాటు కొనసాగనున్న ఈ పక్రియకు యం త్రాంగం సిద్ధమవుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో 18 ఏళ్లు నిండిన ప్రతీ వ్యక్తి కీలకమైన ఓటుహక్కును కలిగి ఉండాలని ఎన్నికల సంఘం చెబుతోంది. అందుకు ఏటా అర్హుల నుంచి ఓటుహక్కు కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. ప్రతీసారి అక్టోబర్‌లో ఈ ప్రక్రియ ప్రారంభించే ఎన్నికల సంఘం ఈసారి నెల ముందుగానే ఓటరు నమోదు, జాబితాలో మార్పున?కు, చేర్పులకు, సవరణలకు ముందుకు వచ్చింది. ఓటరు జాబితను పారద్శకంగా పక్కా సమాచారంతో తయారు చేయాలనే సంకల్పంతో ముందస్తుగా షెడ్యూల్ జారీ చేసింది. ఇందులో భాగంగా ఈ నెల 31వరకు, 2020, జనవరి 1తేదీతో 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు, ఆపై వయస్సుగలవారు ఓటు నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఓటరు జాబితాలో ఏమైనా సవరణలు ఉన్నా.. చిరునామాలో మార్పులు, చేర్పులు ఉన్నా.. ఫొటో తప్పు ఉన్నా.. మరే పొరపాటు ఉన్నా సరిదిద్దుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ఇందుకు ఎన్నికల సంఘం నెల రోజులు గడువు ఇచ్చింది. అందుబాటులో ఉన్న మాధ్యమాల ద్వారా ఓటరు జాబితాను పరిశీలించుకోవాలని సూచనలు చేసింది. ఏం చేయాలంటే ఓటరు నమోదుకు సమీపంలో బీఎల్ఓను సంప్రదించాలి. వీలుకాని పక్షంలో దగ్గర లోని ఈసేవ కేంద్రంలోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. స్వయంగా సందర్శించి ఓటు నమోదు, సవరణ చేసుకోవచ్చును. దరఖాస్తుకు రెండు ఫొటోలు, వయసు ధ్రువీకరణ పత్రం, చదువుకోనివారు ఆధార్‌కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ పత్రం రేషన్ కార్డు జిరాక్సు జత చేయాలి. లేదా ఆన్లైన్ ద్వారా కాని , బీఎల్ఓల ద్వారా ఓటు నమోదు, సవరణలు చేసుకోవచ్చు. సెప్టెంబర్‌లో ఇంటింటి సర్వే సెప్టెంబర్ 1 నుంచి బీఎల్ఓలు ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. నెల రోజులపాటు నిర్వహించే ఈ సర్వేలో ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాల ను తెలుసుకోవడం, ఆ దరఖాస్తు ఆమోదానికి అప్లోడ్ చేయడం, జాబితాలో ఎవరైనా చనిపోయినవారు గానీ, వలస వెళ్లినవారు ఉంటే గుర్తించి వివరాలు సేకరిస్తారు. 18 ఏళ్లు నిండిన వారున్నా వారి వివరాలను నమోదు చేసుకుంటారు. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి 30వ తేదీ వరకు తమ పరిధిలోని ఇంటింటీ సర్వే చేయనున్నారు. 1950కి ఫోన్ చేస్తే చాలు.. ఓటరు జాబితాలో పేరు ఉందా? లేదా ఉంటే ఎక్కడ ఉంది? తెలుసుకోవడానికి సబంధించిన బూత్‌స్థాయి అధికారిని సంప్రదించాలి. లేదంటే 1950 ఓటరు హెల్ప్‌లైన్‌కి పోన్ చేసి తెలుసుకోవచ్చు. కార్యాలయ పనిదినాల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. షెడ్యూల్ ఇదీ... ఓటరు నమోదు, సవరణలు ఆగస్టు 1 నుంచి 31 వరకు బీఎల్ఓల ఇంటింటి సర్వే సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు ముసాయిదా జాబితా విడుదల అక్టోబర్ 10, 2019 అభ్యంతరాల స్వీకరణ అక్టోబర్15 నుంచి నవంబర్30 వరకు తుది జాబితా ప్రకటన జనవరి 01, 2020 -
తేలని ఓట్ల లెక్క
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ప్రతి వేయి మంది జనాభాకు ఓటర్ల సంఖ్య 658కి మించకూడదు. జిల్లా గణాంకాలను పరిశీలిస్తే జనాభా, ఓటర్ల నిష్పత్తి నిబంధనల ప్రకారం 65 శాతానికి కాస్త అటూ ఇటూగా ఉంది. అయితే చాలా గ్రామాల్లో జనాభా సంఖ్య కంటే ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ‘ఓటరు జాబితా సవరణ’లో గందరగోళం నెలకొంది. ఓటరు జాబితా నుంచి పేర్లను తొలగించడంతో గ్రామాల్లో ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. ఓ వైపు నూతన ఓటర్లను నమోదు చేయడంపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. అదే సమయంలో లెక్కకు మించిన ఓటర్లను తొలగించేందుకు నడుం బిగించింది. చాలా చోట్ల జనాభా సేకరణ సక్రమంగా జరగనందునే ఓటరు జాబితాకు, జనాభా సంఖ్యకు పొంతన లేకుండా పోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇతర ప్రాంతాల్లో ఉంటూ స్థానికంగా లేని వారి ఓటర్లనే తొలగిస్తూ నోటీసులు జారీ చేస్తున్నామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వలస వెళ్లిన వారితో పాటు స్థానికంగా ఉంటున్న వారి ఓట్లు కూడా తొలగిస్తున్నారంటూ గ్రామస్తులు తహశీల్ కార్యాలయాల వద్దకు చేరుకుంటున్నారు. జిల్లాలో ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించక ముందు 20.06 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మార్పులు, చేర్పులతో కూడిన జాబితాలో 72,037 మంది ఓటర్లు అదనంగా చేరడంతో జిల్లాలో మొత్తం ఓటర్లు 20.78 లక్షలుగా అధికారులు తేల్చారు. జనవరి 16న ప్రచురించే తుది ఓటరు జాబితాలో ఓటర్ల సంఖ్యలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 30.33 లక్షలు కాగా, ఏటా 1.355 శాతం వృద్ధి రేటు చొప్పున 2014 నాటికి 31.56 లక్షలుగా లెక్క కట్టారు. ప్రస్తుత జనాభాతో పోలిస్తే జిల్లా జనాభాలో ఓటర్ల సంఖ్య 65 శాతానికి కాస్త అటూ ఇటూగా ఉంది. పొంతన లేని లెక్కలు గ్రామీణ ప్రాంతాల్లో జనాభా, ఓటర్ల సంఖ్యకు పొంతన కుదరకపోవడంతో అధికారులు తల పట్టుకుంటున్నారు. చాలా చోట్ల జనాభాలో 85 నుంచి 110 శాతం ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు. నిర్దేశిత శాతం కంటే అధికంగా ఉన్న ఓటర్ల సంఖ్యను తగ్గించేందుకు అధికారులు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. సుదీర్ఘకాలంగా స్థానికంగా లేని వారు, మరణించిన వారు, వలస వెళ్లిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. అయినా ఓటర్ల సంఖ్య గ్రామ జనాభా కంటే తగ్గకపోవడంతో కొన్ని చోట్ల మూకుమ్మడిగా తొలగింపు నోటీసులు జారీ చేశారు. జనాభా లెక్కలు శాస్త్రీయంగా సేకరించక పోవడం వల్లే ప్రస్తుత సమస్య తలెత్తిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఓటరు జాబితా నుంచి పేర్లు తొలగిస్తున్నారనే ప్రచారం గ్రామాల్లో ఉద్రిక్తతలకు కూడా దారి తీస్తోంది. ఎన్జీ హుక్రానాలో అయోమయం మనూరు మండలంలోని ఎనిమిది గ్రామాల్లో జనాభా కంటే ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఉదాహరణకు 2011 జనాభా లెక్కల ప్రకారం ఎన్జీ హుక్రానా జనాభా 881. ఓటరు జాబితా ప్రకారం ఓటర్ల సంఖ్య 1,018. దీంతో నిర్దేశిత శాతం కంటే ఎక్కువగా ఉన్న 463 మంది పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగిస్తామని అధికారులు చెప్తున్నారు. ఓటరు లిస్టులో ఉన్నవారందరూ స్థానికులేనని గ్రామస్తులు తేల్చి చెప్తున్నారు. గ్రామ జనాభా రెండు వేలకు పైనే ఉండగా, జనాభా లెక్కల సేకరణ సమయంలో 881 నమోదు చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. స్థానికంగా వ్యవసాయ భూములు, రేషన్ కార్డులు ఉండి తాత్కాలిక వలస వెళ్లిన వారి పేర్లను ఎలా తొలగిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో జాబితాను యధాతథంగా ఆమోదించలేక, అదనంగా ఉన్న ఓట్లను తొలగించలేక అధికారులు తల పట్టుకుంటున్నారు. అధికారులదే బాధ్యత: కలెక్టర్ జాబితాలో జనాభా, ఓటరు శాతం నిష్పత్తి దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులదేనని కలెక్టర్ స్మిత సభర్వాల్ స్పష్టం చేశారు. ‘‘ఈ నెల పదో తేదీలోగా బూత్ స్థాయి అధికారులు, వీఆర్ఓలు, ఆర్ఐలు మరోమారు ఇంటింటి సర్వే చేపట్టాలి. మరణించిన, వలస వెళ్లిన వారి పేర్లను తొలగించాలి. కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న వారు పార్ట్ 4ను ఖాళీగా వదిలేస్తే తిరస్కరించాలి. అయినా జనాభా, ఓటరు నిష్పత్తి పాటించడం వీలు కాకుంటే కారణాలను వివరిస్తూ అధికారులు నివేదిక ఇవ్వాలి. నివేదిక రూపొందించ డంలో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటాం’’ అని కలెక్టర్ వెల్లడించారు.