తేలని ఓట్ల లెక్క
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:
ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ప్రతి వేయి మంది జనాభాకు ఓటర్ల సంఖ్య 658కి మించకూడదు. జిల్లా గణాంకాలను పరిశీలిస్తే జనాభా, ఓటర్ల నిష్పత్తి నిబంధనల ప్రకారం 65 శాతానికి కాస్త అటూ ఇటూగా ఉంది. అయితే చాలా గ్రామాల్లో జనాభా సంఖ్య కంటే ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ‘ఓటరు జాబితా సవరణ’లో గందరగోళం నెలకొంది. ఓటరు జాబితా నుంచి పేర్లను తొలగించడంతో గ్రామాల్లో ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి.
ఓ వైపు నూతన ఓటర్లను నమోదు చేయడంపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. అదే సమయంలో లెక్కకు మించిన ఓటర్లను తొలగించేందుకు నడుం బిగించింది. చాలా చోట్ల జనాభా సేకరణ సక్రమంగా జరగనందునే ఓటరు జాబితాకు, జనాభా సంఖ్యకు పొంతన లేకుండా పోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇతర ప్రాంతాల్లో ఉంటూ స్థానికంగా లేని వారి ఓటర్లనే తొలగిస్తూ నోటీసులు జారీ చేస్తున్నామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వలస వెళ్లిన వారితో పాటు స్థానికంగా ఉంటున్న వారి ఓట్లు కూడా తొలగిస్తున్నారంటూ గ్రామస్తులు తహశీల్ కార్యాలయాల వద్దకు చేరుకుంటున్నారు. జిల్లాలో ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించక ముందు 20.06 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మార్పులు, చేర్పులతో కూడిన జాబితాలో 72,037 మంది ఓటర్లు అదనంగా చేరడంతో జిల్లాలో మొత్తం ఓటర్లు 20.78 లక్షలుగా అధికారులు తేల్చారు. జనవరి 16న ప్రచురించే తుది ఓటరు జాబితాలో ఓటర్ల సంఖ్యలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 30.33 లక్షలు కాగా, ఏటా 1.355 శాతం వృద్ధి రేటు చొప్పున 2014 నాటికి 31.56 లక్షలుగా లెక్క కట్టారు. ప్రస్తుత జనాభాతో పోలిస్తే జిల్లా జనాభాలో ఓటర్ల సంఖ్య 65 శాతానికి కాస్త అటూ ఇటూగా ఉంది.
పొంతన లేని లెక్కలు
గ్రామీణ ప్రాంతాల్లో జనాభా, ఓటర్ల సంఖ్యకు పొంతన కుదరకపోవడంతో అధికారులు తల పట్టుకుంటున్నారు. చాలా చోట్ల జనాభాలో 85 నుంచి 110 శాతం ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు. నిర్దేశిత శాతం కంటే అధికంగా ఉన్న ఓటర్ల సంఖ్యను తగ్గించేందుకు అధికారులు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. సుదీర్ఘకాలంగా స్థానికంగా లేని వారు, మరణించిన వారు, వలస వెళ్లిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. అయినా ఓటర్ల సంఖ్య గ్రామ జనాభా కంటే తగ్గకపోవడంతో కొన్ని చోట్ల మూకుమ్మడిగా తొలగింపు నోటీసులు జారీ చేశారు. జనాభా లెక్కలు శాస్త్రీయంగా సేకరించక పోవడం వల్లే ప్రస్తుత సమస్య తలెత్తిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఓటరు జాబితా నుంచి పేర్లు తొలగిస్తున్నారనే ప్రచారం గ్రామాల్లో ఉద్రిక్తతలకు కూడా దారి తీస్తోంది.
ఎన్‌జీ హుక్రానాలో అయోమయం
మనూరు మండలంలోని ఎనిమిది గ్రామాల్లో జనాభా కంటే ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఉదాహరణకు 2011 జనాభా లెక్కల ప్రకారం ఎన్‌జీ హుక్రానా జనాభా 881. ఓటరు జాబితా ప్రకారం ఓటర్ల సంఖ్య 1,018. దీంతో నిర్దేశిత శాతం కంటే ఎక్కువగా ఉన్న 463 మంది పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగిస్తామని అధికారులు చెప్తున్నారు. ఓటరు లిస్టులో ఉన్నవారందరూ స్థానికులేనని గ్రామస్తులు తేల్చి చెప్తున్నారు.
గ్రామ జనాభా రెండు వేలకు పైనే ఉండగా, జనాభా లెక్కల సేకరణ సమయంలో 881 నమోదు చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. స్థానికంగా వ్యవసాయ భూములు, రేషన్ కార్డులు ఉండి తాత్కాలిక వలస వెళ్లిన వారి పేర్లను ఎలా తొలగిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో జాబితాను యధాతథంగా ఆమోదించలేక, అదనంగా ఉన్న ఓట్లను తొలగించలేక అధికారులు తల పట్టుకుంటున్నారు.
అధికారులదే బాధ్యత: కలెక్టర్
జాబితాలో జనాభా, ఓటరు శాతం నిష్పత్తి దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులదేనని కలెక్టర్ స్మిత సభర్వాల్ స్పష్టం చేశారు. ‘‘ఈ నెల పదో తేదీలోగా బూత్ స్థాయి అధికారులు, వీఆర్‌ఓలు, ఆర్‌ఐలు మరోమారు ఇంటింటి సర్వే చేపట్టాలి. మరణించిన, వలస వెళ్లిన వారి పేర్లను తొలగించాలి. కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న వారు పార్ట్ 4ను ఖాళీగా వదిలేస్తే తిరస్కరించాలి. అయినా జనాభా, ఓటరు నిష్పత్తి పాటించడం వీలు కాకుంటే కారణాలను వివరిస్తూ అధికారులు నివేదిక ఇవ్వాలి. నివేదిక రూపొందించ డంలో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటాం’’ అని కలెక్టర్ వెల్లడించారు.