తాయిలాల రాగం ఓటర్లకు గాలం
ఓట్ల బాటలో ఆశావహులు
ముందస్తుగా కురుస్తున్న హామీల వర్షం
గంపగుత్తగా నజరానాలు
యువతకు క్రికెట్ కిట్లు
గృహిణులకు బీరువాలు
మహిళా సంఘాలకు ఫర్నిచర్
చోటామోటా నాయకులకు
పదవుల పందేరాలు
ఎంపీగా గెలిపిస్తే సదా మీ సేవలోనే..అంటూ ప్రచారం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:
ఎన్నికల వేళ ‘ఆశావహులు’ ఓటరుకు గాలం వేసే పనిలో పడ్డారు. జెండాలు మోసే కార్యకర్తలను.. ఎన్నికలను ప్రభావితం చేయగల యువతను.. గెలుపు ఓటముల్లో కీలకమయ్యే మహిళలను ప్రసన్నం చేసుకోవడంలో బిజీ అయ్యారు. అధికారం చేతిలో ఉన్న నేతలు కోట్లాది రూపాయల విలువచేసే అభివృద్ధి పనులు తెచ్చి అరచేతిలో ప్రజలకు వైకుంఠం చూపిస్తున్నారు. మెట్రో రైల్ కోసం కృషి చేస్తానంటూ ఓ నేత హామీ ఇస్తే... కాల్వలు లేకున్నా పంట పొలాలకు నీళ్లు ఇచ్చి తీరతామని మరో నేత.. ‘ప్రాణహిత’తో ప్రాణం పోస్తానని ఇంకో నాయకుడు.. ఇలా ప్రజలను మొహమాటపెడుతుంటే..! అధికారం చేతిలో లేని ఓ నాయకుడు మాత్రం తన ట్రస్టునే నమ్ముకున్నారు. గత ఎన్నికల్లో మెదక్ లోక్‌సభ నుంచి పోటీచేసి ఓడిపోయిన సదరు నేత క్రికెట్ కిట్లు, వాలీబాల్ కిట్లతో యువతకు, జంఖానాలు, డ్వాక్రా కార్యాలయాలకు బీరువాలు, టేబుళ్లతో మహిళా ఓటర్లకు గాలం వేసే ప్రయత్నం చేస్తున్నారు. తాను మరణించిన తర్వాత తన కుమారుడు సైతం సేవలను కొనసాగిస్తారని పూర్తి భరోసా ఇస్తుం డటం గమనార్హం. మొన్నటివరకు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇటీవలే భారతీయ జనతా పార్టీలో చేరిన సదరు నాయకుడు తనతో కలిసి వచ్చే చోటా మోటా నాయకులకు పార్టీలో వివిధ పదవులను కట్టబెట్టించి తన చుట్టూ తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక జెండాలు మోసే కార్యకర్తలకు కోరితే కొండ మీద కోతిని కూడా తెచ్చి ఇచ్చేందుకు ఆకాశానికి నిచ్చెన వేసే ప్రయత్నం చేస్తున్నారు. తాను పోటీ చేస్తున్న మెదక్ నియోజకవర్గంలోని వెల్దుర్తి, జిన్నారం మండలాలకు సదరు నేత గత రెండు రోజుల కిందట గంపగుత్తగా నజరానాలు ఇచ్చారు.
మహిళా గ్రామైక్య సంఘం కార్యాలయానికి బీరువా, కార్పెట్, టేబుల్ చొప్పున మొత్తం 64 నాలుగు సంఘాలకు ఇచ్చారు. యువత కోసం ప్రతి గ్రామంలో రెండు క్రికెట్ కిట్లు, రెండు వాలీబాల్ కిట్లు, క్యారం బోర్డు, సాధారణ ఓటరు మహాశయునికి రాత్రి వేళ వెలుగులు అందించడం కోసం ప్రతి గ్రామానికి కనీసం 10 చొప్పున మెర్క్యురీ వీధి దీపాలు ఇచ్చేశారు. తాను పల్లెకు వచ్చినప్పుడు డప్పు సప్పుళ్లతో ఊరేగించేందుకు 10 డప్పులు సైతం పంపిణీ చేశారు.
జోరుగా హామీలు....
నజరానాలు ఇచ్చిన తర్వాత హామీల వర్షం గుప్పిస్తున్నారు. ‘తనను మెదక్ ఎంపీగా గెలిపిస్తే మరిన్ని సేవలు చేస్తా. పేదింటి ఆడపిల్లకు అన్నగా అండగా నిలబడతా, పెళ్లిళ్లు చేసి అత్తారింటికి సాగనంపుతా. ఏడాదికి 501 పెళ్లిళ్లు చేస్తా..
విద్యార్థులకు, గ్రామీణ క్రీడాకారులకు ఆట వస్తువులు అందిస్తా. నేను మరణించాక నా కుమారుడు ఈ సేవలు అందిస్తారు’ అంటూ ఓ నేత హామీలు కురిపిస్తున్నారు. సదరు నేత మాటలకు ఆకర్షితులై ఓ గ్రామ సర్పంచ్, 200 మంది కార్యకర్తలు అప్పటికప్పుడు పార్టీలో చేరిపోయారు. బోణి కుదిరింది కానీ ‘ఇల్లు అలకగానే పండుగ కాదు’ అని క్రికెట్ కిట్లకు, బీరువాలకు ఓట్లు రాలవని ఆయన ప్రత్యర్థులు అనుకోవడం గమనార్హం.