ఈ-పాస్‌తో భూముల రికార్డులు తారుమారు
ఒంగోలు టౌన్: పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ లేకుండా 1బి ఆధారంగానే ఈ-పాస్ పుస్తకం ఇవ్వడం వల్ల భూముల రికార్డులు తారుమారు అయ్యే ప్రమాదం ఉందని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.వి.ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల భూములను రీ సర్వేచేసి తప్పులు సరిచేసి ఆన్లైన్లో నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక మల్లయ్య లింగం భవనంలో జరిగిన రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ-పాస్ పుస్తకాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. 1బీ ఆధారంగా ఈ-పాస్ పుస్తకం ఇస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.
రైతు సంఘం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈనెల 29 నుంచి 31 వరకు కడపలో రాష్ట్ర స్థాయి వర్క్‌షాపు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వర్క్‌షాపుకు జిల్లా నుంచి 30 మంది రైతులు హాజరు కావాలన్నారు. కౌలు రైతుల సంఘం జిల్లా మహాసభలు ఆగస్టు చివరి వారంలో మేదరమెట్లలో నిర్వహించాలని కోరారు. సభ్యత్వాలు పూర్తిచేసి గ్రామ కమిటీలు, మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలను పూర్తి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎరువుల ధరలను వెంటనే అమలుచేసి రాష్ట్రంలోని రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు డీ శ్రీనివాస్, వీ హనుమారెడ్డి, నాయకులు వై సింగయ్య, కే వీరారెడ్డి, బి.ప్రసాద్, పి.వి.కొండయ్య, జి.వెంకటేశ్వర్లు, కె.ఎల్.డి.ప్రసాద్, బి.సుబ్బారెడ్డి, బి.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ప్రకాశంను కరువు జిల్లాగా ప్రకటించాలని, జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు కేటాయించాలని సమావేశంలో తీర్మానించారు.