జేఈఈలో ఇంటర్ వెయిటేజీ రద్దు
►ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం
హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్‌ఐటీలు తదితర విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్ పరీక్ష ర్యాంకుల ఖరారులో ఇంటర్మీడియట్ మార్కులకు ఉన్న వెయిటేజీని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. జేఈఈ మెయిన్ ర్యాంకుల ఖరారులో విద్యార్థుల ఇంటర్ మార్కులకు 40 %వెయిటేజీ, జేఈఈ మెయిన్ స్కోర్‌కు 60% వెయిటేజీ ఇస్తున్నారు. ఆ ర్యాంకుల ఆధారంగానే ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ఇతర విద్యా సంస్థల్లో ప్రవేశాలు కల్పించారు.
అయితే ఇంటర్ వెయిటేజీతో ప్రయోజనం లేదని గతేడాది ఐఐటీల కౌన్సిల్ అభిప్రాయపడడంతో.. జేఈఈ పరీక్షలో సంస్కరణలపై ఓ కమిటీ వేశారు. ఆ కమిటీ ఇంటర్ వెయిటేజీని రద్దు చేయాలని సిఫారసు చేసింది. ఈ మేరకు ఇంటర్ మార్కులకు ఉన్న 40% వెయిటేజీని రద్దు చేస్తూ కేంద్ర మానవ వనరుల శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. జేఈఈకి హాజరయ్యేందుకు ఇంటర్లో 75% మార్కులు, ఆపైన (ఎస్సీ, ఎస్టీలైతే 65%) ఉంటే సరిపోతుందని.. లేదా టాప్-20 పర్సంటైల్‌లో ఉండాలని పేర్కొంది. జేఈఈ మెయిన్ స్కోర్ ఆధారంగానే ఆయా విద్యా సంస్థల్లో ప్రవేశాలు చేపడతామని పేర్కొంది.
గతంలోనే ఐఐటీల నిబంధనల్లో మార్పులు:
ఐఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించి ఉండటంతోపాటు టాప్-20 పర్సంటైల్‌లో ఉండాలన్న నిబంధన గతంలో ఉంది. టాప్-20 పర్సంటైల్‌లో ఉన్నా, ఇంటర్లో 75% మార్కులు వచ్చినా సరిపోతుందన్న నిబంధనను ఈ విద్యా సంవత్సరం నుంచి (2016-17) అమల్లోకి తెచ్చారు. తాజాగా ఎన్ఐటీల్లో ప్రవేశాలకు కూడా ఇదే నిబంధనను అమల్లోకి తెచ్చారు. దీంతో ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీ, ఐఐటీలు, కేంద్ర ఆర్థిక సహకారంతో కొనసాగే అన్ని విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ఒకే రకమైన నిబంధనలు అమలు కానున్నాయి.
2017లో ఉమ్మడి పరీక్ష లేనట్లే!: ప్రస్తుతం అమల్లోకి తెచ్చిన ఇంటర్ వెయిటేజీ రద్దు, 75% మార్కులు వస్తే చాలన్న మార్పులు మినహా 2017-18 విద్యా సంవత్సరంలో ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్‌ఐటీల ప్రవేశాల విధానంలో ఎలాంటి మార్పులు ఉండవని కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మార్పుల ఉత్తర్వులను జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహించే సీబీఎస్ఈ చైర్మన్‌కు, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహించే ఐఐటీ సంయుక్త కమిటీకి పంపించారు. దీంతో ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ఐఐటీ, ఇతర విద్యా సంస్థల్లో ఒకే పరీక్ష ద్వారా ప్రవేశాలు చేపట్టాలన్న నిబంధన 2017 నుంచి కూడా అమల్లోకి వచ్చే అవకాశం లేదు.