Waiver of farmer loans
-
దేశవ్యాప్తంగా రుణ మాఫీ చేయాలి
-
దేశవ్యాప్తంగా రుణ మాఫీ చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వాల నుంచి ఎలాంటి సాయం అందక, పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక అల్లాడుతున్న రైతాంగానికి ఉపశమనం కలిగించేందుకు కేంద్రం వెంటనే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. గిట్టుబాటు ధర లేక, అప్పుల ఊబిలో చిక్కుకొని ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలు, అఖిల భారత కిసాన్ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ‘రైతు పార్లమెంట్’నిర్వహించారు. సామాజికవేత్త మేధాపాట్కర్ అధ్యక్షతన మహిళా పార్లమెంట్ జరిగింది. దేశ వ్యాప్తంగా ఉన్న 180 రైతు సంఘాల నేతలు ఈ సదస్సులో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆత్మహత్య చేసుకున్న 70 మంది రైతు కుటుంబీకులు, రైతు స్వరాజ్య సంఘం ప్రతినిధులు, తెలంగాణ రైతు సంఘం నేతలు, మహిళా రైతు సంక్షేమ సంఘం నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం తిండి పెట్టే రైతాంగానికి రుణ విముక్తి ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. దేశంలో రైతు ఆత్మహత్యలు 120 రెట్లు పెరిగాయని, కేంద్రం నుంచి ఎలాంటి స్పంద నా లేదన్నారు. జీఎస్టీ, నోట్ల రద్దు సమయంలో అర్ధరాత్రి పార్లమెంట్‌ను సమావేశపరిచిన కేంద్రం.. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ఎందుకు సమావేశం కావడం లేదని ప్రశ్నించారు. గిట్టుబాటు ధరలేక రైతులు అప్పుల ఊబిలో చిక్కుకున్నారని, దళారులు, వడ్డీ వ్యాపారుల వేధింపులతో రైతులు అత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. దీనిని నివారించేందుకు దేశ వ్యాప్తంగా రైతు రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. పంట ఉత్పత్తి వ్యయంపై 50 శాతం అధికంగా గిట్టుబాటు ధర లభించేలా స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయాలన్నారు. ప్రముఖ నటుడు ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక 60 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. -
భవిత మనదే.. యువతకే పెద్దపీట: వైఎస్ జగన్
► నియోజకవర్గ సమీక్షల్లో వైఎస్ జగన్ ప్రకటన ► గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకూ పార్టీ బలోపేతం ► యువతకు మార్గదర్శకంగా సీనియర్లతో కమిటీలు ►అధికారం కోసం చంద్రబాబులా అసత్యాలు చెప్పలేను ► టీడీపీ, ఎల్లో మీడియా దుష్ర్పచారాన్ని తిప్పికొట్టాలి ► ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజాపోరాటాలకు సిద్ధపడాలి ► వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు అధికారం ఖాయం ► విశాఖలో పార్టీ సమీక్షల్లో అధినేత వైఎస్ జగన్ భరోసా సాక్షి, విశాఖపట్నం: ‘‘పార్టీని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బలోపేతం చేయాలి. పార్టీ శ్రేణులంతా ఏకమవ్వాలి. జిల్లాలోని అందర్నీ సమన్వయపరిచే స్థాయి ఉన్న నేతలకు బాధ్యతలు అప్పగిస్తాం. యువతరానికే పెద్దపీట వేస్తాం. సీనియర్లను సలహా కమిటీలో చేర్చి.. యువతరాన్ని నడిపించేలా విధానాలు రూపొం దిస్తాం.. రాబోయే రోజుల్లో భవిష్యత్తు మనదే అని ప్రజలు ఈ ఎన్నికల్లో విస్పష్ట సంకేతమిచ్చారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పార్టీ శ్రేణులకు వివరించారు. ‘‘సాధ్యం కాదని తెలిసి కూడా రూ. 88 వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేస్తానంటూ చంద్రబాబు అబద్ధపు హామీలిచ్చారు. ప్రజలు కాస్తో కూస్తో నమ్మారు. వారిని నమ్మించేందుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9 అదేపనిగా కంకణం కట్టుకున్నాయి. దాంతో మనం కేవలం 5.6 లక్షల ఓట్ల తేడాతో ప్రతిపక్షంలో ఉన్నాం. మనకు కోటీ 30 లక్షల ఓట్లొచ్చాయి. టీడీపీకి కోటీ 35 లక్షలు ఓట్లు వచ్చాయి’’ అని ఆయన కార్యకర్తలతో పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాల వారీగా పార్టీ రెండో దశ సమీక్షా సమావేశాలు బుధవారం విశాఖపట్నంలోని బీచ్‌రోడ్‌లో గల విశ్వప్రియ ఫంక్షన్ హాల్లో జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. బుధవారం ఉదయం నుంచి అర్ధ రాత్రి వరకూ కార్యకర్తలు, శ్రేణులతో మమేకమై వారి అభిప్రాయాలను తెలుసుకున్న జగన్ తన ప్రసంగంతో వారిలో పునరుత్తేజం నింపారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... మరో 10 రోజుల్లో అబద్ధాలు బట్టబయలు... ‘‘చంద్రబాబులా నేనూ అబద్ధం చెప్పేస్తే.. తప్పకుండా మనం అధికారంలోకి వచ్చేవాళ్లం. అయితే అధికారంలోకి వచ్చిన మూడు మాసాలకే అమలు కాదని తెలిసీ రైతు రుణమాఫీపై ఎందుకు హామీలిచ్చారు? గ్రామాల్లోకి వెళ్తే రైతులంతా మమ్మల్ని తిడుతున్నారన్నా.. అంటూ నావద్దకే వచ్చి చెప్పేవారు. నేనేవో అబద్ధాలు చెప్పి ఐదేళ్లు అధికారాన్ని అనుభవించి ఆ తర్వాత జనాల వ్యతిరేకతకు గురవడానికి ఇష్టపడను. 30 ఏళ్ల పాటు విశ్వసనీయ రాజకీయాలు చేయాలనుకునేవాణ్ణి. నా మరణం తర్వా త.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటో తమ ఇళ్లల్లో పెట్టుకున్నట్టు.. నా ఫొటో కూడా పెట్టుకోవాలని ఆశించేవాణ్ణి. జనాలెవరూ అబద్ధాలాడే, మోసం చేసే వారి ఫొటోలను ఇళ్లల్లో ఉంచుకోవాలనుకోరు. మరో 10 రోజుల్లో ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది. రుణాల కోసం బ్యాంకులకు రైతులు వెళ్తారు. పాత రుణాలు చెల్లించకపోతే కొత్త రుణాలు ఇచ్చేది లేదని బ్యాంకర్లు తిప్పి పంపిస్తారు. టీడీపీ అబద్ధపు హామీలు బయటపడతాయి. అయినప్పటికీ చంద్రబాబుకు వంతపాడేందుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9 మళ్లీ ముందుకొస్తాయి. గ్రామ స్థాయి నుంచే బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజల తరఫున ఉద్యమించేందుకు మనం సిద్ధంగా ఉండాలి’’ అని జగన్ పిలుపునిచ్చారు. జైల్లో పెట్టి లొంగదీసుకోవాలనుకున్నారు... ‘‘నాపై కేసుల విషయాన్ని గుర్తు చేస్తూ పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు ఎల్లో మీడియా చేస్తోంది. వైఎస్సార్ బతికున్నపుడు, జగన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నపుడు ఈ కేసులు పెట్టలేదు. వైఎస్సార్ మరణించిన 18 మాసాలకు, జగన్ పార్టీ నుంచి బయటికొచ్చేసిన రెండు మాసాలకు కేసులు పెట్టారు. ప్రత్యర్థిగా ఎక్కడ తయారవుతానోనన్న భయంతోనే.. టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు కుట్రలకు పాల్పడ్డాయి. జైల్లో పెట్టి ఎన్ని విధాలా లొంగదీసుకోవాలన్నా.. లొంగలేదు. జైల్లో ఉంటూనే.. ఎఫ్‌డీఐ బిల్లుకు వ్యతిరేకంగా మన ఎంపీలతో ఓటేయించాం. చంద్రబాబు విప్ జారీ చేసి మరీ తమవారిని అడ్డుకున్నారు. కిరణ్ సర్కార్ ఏకంగా రూ. 32 వేల కోట్ల విద్యుత్ చార్జీలు వడ్డిస్తే.. ఇదే చంద్రబాబు విప్ జారీ చేసి కాంగ్రెస్‌ను కాపాడారు. ఆ సమయంలో కనీస మెజార్టీ 148 సీట్లకు రెండు తక్కువగా 146 ఎమ్మెల్యేలతోనే కాంగ్రెస్ ఉంది. అప్పుడే చంద్రబాబు సహకరిస్తే రాష్ట్ర విభజనే జరిగేది కాదు. నాకున్న బలం దేవుడి దయ.. ఇంతమంది గుండెల్లో అభిమానం. నేనెవరికీ అన్యాయం చేయలేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9కు కూడా. అయినా నేనంటే వారికి ద్వేషం. 2004 లోనూ ఇదే జరిగింది. అయినా నాన్నగారికి ప్రజలు భారీ మెజార్టీ కట్టబెట్టారు. తాజా ఎన్నికల్లో టీడీపీ ఓటమి భయంతో సర్వశక్తులూ ఒడ్డింది. మనం గెలుపు ధీమాతో నిర్లిప్తం గా వ్యవహరించాం.. అంతే తేడా! యువతకే ప్రాధాన్యం... పార్టీ దెబ్బతిన్న చోట మన వాళ్లకు మనోధైర్యం కలి గించాలి. జరిగిన తప్పు మరోసారి పునరావృతం కాకుండా సరిదిద్దుకోవాలి. పార్టీని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బలోపేతం చేయాలి. అధికారపక్షం నేతల నుంచి భౌతిక దాడులు, బెదిరింపులు ఉండొ చ్చు. వాటిని ఎదుర్కొనేందుకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ శ్రేణులంతా ఏకమవ్వాలి. జిల్లాలోని అందర్నీ సమన్వయపరిచే స్థాయి ఉన్న నేతలకు బాధ్యతలు అప్పగిస్తాం. యువతరానికే పెద్దపీట వేస్తాం. పార్టీ కార్యక్రమాల నిర్వహణలో యువతకే ప్రాధాన్యం ఇస్తాం. పార్టీకి ఉజ్వల భవిష్యత్తు అందించాల్సిన బాధ్యత యువతపైనే ఉంది. వయసెక్కువ ఉన్న సీనియర్ నేతలను సలహా కమిటీలో చేర్చి.. యువతరాన్ని నడిపించేలా విధానాలు రూపొందిస్తాం. రాబోయే భవిష్యత్తు మనదే... ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ రెండూ ప్రతి పక్ష పార్టీలుగానే ఎన్నికలకు వెళ్లాయి. దాంతో కాంగ్రెస్ ప్రజావ్యతిరేక ఓటు ఎవరికి వెళుతుందోనన్న సందిగ్ధత ఉండేది. కానీ వచ్చేసారి మనం ప్రతిపక్ష పార్టీగా ఎన్నికలకు వెళతాం. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి న చంద్రబాబు ఈ ఐదేళ్లలో పూర్తిగా విఫలమవుతారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఈ ఐదేళ్లు సంస్థాగతంగా బలోపేతం కావడంతో పాటు.. ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరుబాటలో సాగుతుంది. దాం తో కచ్చితంగా వైఎస్సార్ సీపీనే అధికారంలోకి వస్తుం ది. మనం కేవలం మన రాజకీయ ప్రత్యర్థి టీడీపీతోనే కాదు.. ఆ పార్టీకి కొమ్ముకాస్తున్న ఎల్లో మీడియాతో కూడా పోరాడాల్సి వస్తోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9 నిష్కారణంగా మనపై భవిష్యత్తులో కూడా దుష్ర్పచారం చేస్తాయి. కానీ మనం మాత్రం విశ్వసనీ యతతో కూడిన రాజకీయాలు చేయాలి. నిత్యం ప్రజల తోనే ఉండాలి. దాంతో ప్రజలే వాస్తవాలు గ్రహిస్తారు. నిజాయితీతో కూడిన రాజకీయాలు చేసే వైఎస్సార్ సీపీ ని ఆదరిస్తారు’’ అని జగన్ భరోసా కల్పించారు. -
‘మాఫీ’తో ముప్పుతిప్పలు
అప్పుల భారంతో చితికిన రైతన్నలకు రుణమాఫీ హామీ ఒక ఆశాకిరణంగా కనబడింది. అధికారంలోకి వచ్చి రుణాలు మాఫీ చేస్తాం, అప్పులు చెల్లించవద్దని టీడీపీ, టీఆర్ఎస్లు సూచించాయి. కనుకనే టీఆర్ఎస్ సర్కారు పరిమితులు విధిస్తే నిరసనలు వెల్లువెత్తాయి. ఇప్పుడు బాబు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న కమిటీపై కూడా అలాంటి వ్యతిరేకతే రావొచ్చు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గద్దెనెక్కిన ప్రభుత్వాలకు రుణమాఫీ వాగ్దానం గుదిబండగా మారింది. తెలంగాణ ప్రాంతంలో ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు రైతు రుణాల మాఫీకి లక్ష రూపాయల పరి మితినైనా విధించారు. చంద్రబాబు మాత్రం మొత్తం రుణాలన్ని టినీ మాఫీ చేస్తానని వాగ్దానం చేశారు. ఎన్నికలయ్యాక ఇద్దరూ రుణమాఫీపై తడబడ్డారు. 2012-13 మధ్య తీసుకున్న పంట రుణాలు మాత్రమే మాఫీ అవుతాయని, బంగారం కుదువబెట్టి తీసుకున్న రుణాలకు ఇది వర్తించబోదని తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ ప్రకటిం చడంతో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. రైతులం తా తీవ్ర నిరాశానిస్పృహలకు లోనయ్యారు. కేసీఆర్ సొంత జిల్లా మెదక్‌లోనే ఇద్దరు రైతులు గుండెపో టుతో మరణించారు. మరో నలుగురు అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఉక్కిరిబిక్కిరైన తెలం గాణ సర్కారు దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. చెప్పిన ట్టుగానే రుణమాఫీని కచ్చితంగా అమలుచేస్తామని కేసీఆర్ స్పష్టంగా హామీ ఇవ్వడంతో పరిస్థితి కొంతవరకూ చల్లబడింది. తెలంగాణలోని 2012-13 రుణాలు రూ. 12,000 కోట్లు మాత్రమే. అలాకా కుండా ఇంతవరకూ ఉన్న లక్షలోపు రుణాలన్నిటినీ మాఫీ చేయాలంటే అవి రూ. 26,020 కోట్లు అవుతాయి. రుణాల భారంతో చితికిన రైతన్నలకు ఎన్ని కల్లో టీఆర్ఎస్, టీడీపీల రుణమాఫీ హామీ ఆశాకిరణంగా కనబడింది. అధికారంలోకి వచ్చిన వెంటనే రుణాలు మాఫీ చేస్తాం గనుక ఎవరూ అప్పులు చెల్లించవద్దని కూడా అవి సూచించాయి. కనుకనే టీఆర్ఎస్ సర్కారు కొన్ని పరిమితులు విధింపు యత్నానికి వ్యతిరేకత వెల్లువెత్తింది. బాబు కప్పదాటు టీఆర్ఎస్కు భిన్నంగా టీడీపీ రైతు రుణాలపై ఎలాంటి పరిమితీ విధించ లేదు. అధికారంలోకి వస్తూనే రైతు రుణాలన్నిటినీ రద్దుచేస్తామని చంద్ర బాబు ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పారు. సీమాంధ్రలోని 13 జిల్లాల రుణాలనూ ప్రభుత్వాధికారులతో ఆయన లెక్కలు కట్టించారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో అన్ని రకాల బ్యాంకులు రూ. 37,058 కోట్ల రుణాలను రైతులకు మంజూరుచేశాయని వారు తేల్చారు. ఇందులో ఖరీఫ్ రుణాలు రూ. 22,992 కోట్లు, రబీ రుణాలు 14,065 కోట్లు. 2014 మార్చి 31నాటికి చెల్లించని అన్ని రకాల వ్యవసాయ రుణాలూ కలిపి రూ. 59,105 కోట్లని వారు చెబుతున్నారు. ఇవన్నీ 84 లక్షల 86 వేల 890 మంది రైతుల ఖాతాల కింద ఉన్నాయి. ఇందులో సన్నకారు రైతుల ఖాతాలు 72 లక్షల 13వేల 857 ఉన్నాయని... అన్ని రకాల ఇతర రుణాలనూ మినహాయించి పంట రుణా లను మాత్రమే మాఫీ చేయాలని ప్రభుత్వం అనుకుంటే రూ. 34,067.67 కోట్ల భారం పడుతుందని అధికారులు అంచనావేశారు. అయితే, బ్యాంకర్ల అంచనాలు వేరుగా ఉన్నాయి. అన్ని రకాల వ్యవసాయ రుణాలు రూ. 73,408 కోట్లుగా వారు చెబుతున్నారు. డ్వాక్రా మహిళల రుణాలు రూ. 14,204 కోట్లు కలిపితే ఇది రూ. 87,612 కోట్లు అవుతుందన్నది వారి అంచనా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ఇప్పటికే రూ. 15,900 కోట్లు లోటుతో ఉంది. ఇందుకు భిన్నంగా తెలంగాణకు సుమారు రూ. 7,510 కోట్లు ఆదాయ మిగులు ఉంది. అయినా సరే కేసీఆర్ రుణమాఫీకి లక్ష రూపాయల పరిమితి విధించుకున్నారు. బాబు మాత్రం ఎలా చెయ్యగలరో, ఏమి చెయ్యగలరో తగినంత స్పష్టత లేకుండా వ్యవసాయ రుణాలన్నిటినీ రద్దుచేస్తామని ప్రకటించారు. విపక్షాలు దాడి చేస్తుంటే ‘మావద్ద స్పష్టమైన ప్రణాళిక ఉంది. ఎలా చేయాలో మాకు తెలుసు. అనుభవంలేని కొత్త పార్టీల నాయకుల దగ్గరనుంచి నేర్చుకోవాల్సిన ఖర్మ పట్టలేదు’ అని ఆయన బింకంగా చెప్పారు. నిజంగా అలాంటి ప్రణాళిక ఉంటే ప్రమాణస్వీకారం రోజున తొలుత హామీ ఇచ్చినట్టు రుణమాఫీ ఫైలుపై కాకుండా రుణమాఫీపై కమిటీని ఏర్పాటు చేసే ఫైలుపై మాత్రమే ఆయన తొలి సంతకం ఎందుకు పెట్టవలసివచ్చిందో అర్థంకాని విషయం. సంస్కరణల ఆద్యుడు చంద్రబాబు 1995 నుండి 2004 వరకూ రాష్ట్రంలో ఆర్థిక సంస్కరణలను అమలు జరిపిన నాయకుడు. ఈ విషయంలో ఆయన దేశవిదేశాల్లో ప్రాము ఖ్యత సంపాదించుకున్నారు. హైటెక్ పద్ధతులకు పెట్టింది పేరుగా ముద్ర వేయించుకున్నారు. కానీ రైతాంగ వ్యతిరేకిగానే ఆయన మిగిలిపోయారు. అందువల్లే రాష్ట్ర ప్రజలు 2004లోనూ, 2009లోనూ ఆయనను కాదను కున్నారు. దివంగత నేత వైఎస్ 2004 ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఉచిత విద్యుత్తు ఫైలుపై తొలి సంతకం చేయడంమాత్రమే కాదు... ఆ తర్వాత సంక్షేమరథాన్ని చాకచక్యంగా నడిపి వరసగా రెండోసారి కూడా విజయం సాధించారు. అందువల్లే తనకు ఇష్టమున్నా, లేకున్నా సంక్షే మాన్ని పట్టించుకుంటే తప్ప అధికారం దక్కబోదని గ్రహించి చంద్రబాబు ఈసారి ఎన్నికల్లో రుణ మాఫీ గురించి ప్రకటిం చారు. బాబు పంథా తెలిసినవారు ఇప్పుడు రుణమాఫీపై కమిటీ వేయడాన్ని తాత్సారం చేయడం కోసమేనన్న అభిప్రాయంతో ఉన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన గంటనుంచే వాగ్దా నాలకు అవరోధమనుకుంటున్న ఆర్థిక విషయాలపై టీడీపీలోని పైస్థాయి నాయకత్వంనుంచి సభ్యుల వరకూ స్వరం మార్చారు. కేంద్రంలోనూ గందరగోళం చంద్రబాబు రుణమాఫీ వ్యవహారం కేంద్రంలో కూడా పెద్ద గందరగోళాన్ని సృష్టించింది. దీన్ని ఏదోవిధంగా ఆపించాలని బ్యాంకర్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కలిసి మొరపె ట్టుకున్నట్టు తెలుస్తున్నది. గ్రామాల్లో ఉన్న ఆర్థిక రోగాలకు రుణ మాఫీ పరిష్కారం కాదని, అది రోగ లక్షణాలకు చికిత్స చేయ డమే అవుతుందని మేధావి వర్గం వాదిస్తోంది. రుణమాఫీపై సూచనలివ్వడానికి రిటైర్డు ఐఆర్డీఏ చైర్మన్ సీఎస్ రావు అధ్యక్షతన చంద్ర బాబు కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీ ఎన్నికల హామీలు, మొత్తం రుణాలు అంచనావేసి రాష్ట్ర ఆదాయంతో తూకంవేసి రుణాల మాఫీకి మార్గాలు సూచించవలసి ఉంది. మరోపక్క రిజర్వ్ బ్యాంకు గ్యారంటీతో వ్యవసాయ రుణాలపై పదేళ్ల మారటోరియం విధించి బ్యాంకులకు ప్రభుత్వ బాండ్లు ఇవ్వాలని బాబు యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. రిజర్వ్ బ్యాంకు ఈ అభ్యర్థనను అంగీకరించడం కష్టమే. అలా చేస్తే అది తాను నిర్ణయించిన రాష్ట్రాల రుణ హద్దుల్ని తానే అతిక్రమించినట్టు అవుతుంది. పైగా ఆర్థిక బాధ్యతలు, బడ్జెట్ నిర్వహణ చట్టం-2003 కూడా అడ్డంకిగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి బ్యాంకుల అప్పులు, జమల నిష్పత్తిని... 5,26,125 కోట్ల అప్పులు, 4,51,121 కోట్ల డిపాజిట్లతో 116 శాతంగా నిర్ధారించారు. బ్యాంకులు 75,044 కోట్ల క్రాస్ సబ్సిడైజేషన్ లోటు ప్రమాద సూచికను చూపుతున్నాయి. అయినా 87 వేల కోట్ల పైబడి ఉన్న రుణ మాఫీ అమలు ఏవిధంగా సాధ్యమో చెప్పాలని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో రుణమాఫీ పరిమితులపై వెల్లువెత్తిన నిరసనలతో బాబుకు సంకటస్థితి ఎదురైంది. అందువల్లే కమిటీతో కాలయాపన చేయదల్చుకున్నట్టు కనబడు తోంది. దేశ స్థూల ఆదాయంలో వ్యవసాయం నుంచి వచ్చే వాటా 2009 - 10లో 14.6 శాతం ఉండగా 2012 - 13లో అది 13.7 శాతానికి క్షీణించింది. గ్రామీణ భారతంలో ఇప్పటికీ 60 శాతానికిపైగా ప్రజలు వ్యవసాయ సంబం ధిత పనులపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనా తరహాలో అభివృద్ధి సాధ్యంకావాలంటే ప్రజలు తమ కాళ్లపై తాము నిలబడగ లిగేలా ప్రభుత్వ పథకాలు ఉండాలని విజ్ఞులు అభిప్రాయపడుతున్నారు. పరిశ్రమల స్థాపనపై దృష్టిపెట్టాలంటున్నారు. నాయకులు ఆ మార్గంలో ఆలోచిస్తారా?! (వ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు) బలిజేపల్లి శరత్‌బాబు -
రుణమాఫీ ఆంక్షలపై ఆగ్రహం
ఆదిలాబాద్, నిజామాబాద్‌లలో రోడ్డెక్కిన రైతన్నలు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పంటల రుణమాఫీ ఆంక్షలపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. గురువారం నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో రైతులు రోడ్డెక్కారు. ఈ సందర్భంగా పలుచోట్ల ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దిష్టిబొమ్మలను దనహనం చేశారు. పలుచోట్ల టీఆర్ఎస్ జెండా దిమ్మెలను ధంసం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన టీఆర్ఎస్.. అధికారంలోకి వచ్చాక మోసం చేసేందుకు యత్నిస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. నిజామాబాద్ రూరల్, ఆర్మూరు, బాల్కొండ, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాల్కొండ, బోధన్ నియోజకవర్గాల్లో రైతులు రాస్తారోకో చేశారు. రెంజల్ మండలం దూపల్లిలో, వేల్పూరు మండలం మోతె, జాన్కంపేట, ధర్పల్లిలలో కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. కేసీఆర్ తీరును నిరసిస్తూ ఆర్మూర్ మండలం మంధనిలో టీఆర్ఎస్ జెండా దిమ్మెను ఆ పార్టీ కార్యకర్తలు ధ్వంసం చేయగా, గాంధారి మండలం మాతుసంగెంలో గ్రామస్తులు కూల్చివేశారు. ఆదిలాబాద్ జిల్లాలోనూ రైతులు రాస్తారోకోలు చేపట్టారు. -
రుణమాఫీకి కట్టుబడి ఉన్నా
వ్యవసాయూన్ని లాభసాటిగా చేసేవరకు రైతులకు అండగా ఉంటా తెలుగుదేశం మహానాడులో చంద్రబాబు వెల్లడి సీమాంధ్ర ఒకస్థారుుకి చేరేవరకుకేంద్రం ఆదుకోవాలి పార్టీ శ్రేణులు రెండురోజుల సంపాదన విరాళంగా ఇవ్వాలి వార్‌రూమ్‌లతో టీఆర్ఎస్ సాధించేదేమీ లేదు హైదరాబాద్: రైతు రుణాల మాఫీతో పాటు డ్వాక్రా రుణాల రద్దుకు కూడా కట్టుబడి ఉన్నానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చెప్పారు. ప్రతిపక్షంలో ఉండి పాదయాత్ర సమయంలో చేసిన సమయంలో రైతుల బాధలు చూసి వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చానన్నారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేవరకు రైతులకు అండగా ఉంటానని పేర్కొన్నారు. ఎన్నికలు ఇప్పుడే అయిపోయాయని, రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తి కాకమునుపే కాంగ్రెస్ వాళ్లు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలంటున్నారని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈ విషయమై మాట్లాడే అర్హతే లేదన్నారు. సీమాంధ్రను స్వర్ణాంధ్రగా, మరో సింగపూర్‌గా మారుస్తానని చెప్పారు. టీడీపీ ప్రతి ఏటా నిర్వహించే మహానాడు హైదరాబాద్ సమీపంలోని గండిపేటలో మంగళవారం ఉదయం ప్రారంభమైంది. సీమాంధ్రలో పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తెలుగుదేశం శ్రేణులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. రెండురోజుల పాటు జరిగే 33వ మహానాడులో చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేశారు. అభివృద్ధి బాధ్యత కేంద్రానిదే.. రాష్ట్ర విభజన తరువాత ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదేనని అన్నారు. విభజన బిల్లులో తెలంగాణకు ఇచ్చిన హామీలకు కట్టుబడుతూనే.. సీమాంధ్ర ఒక స్థాయికి చేరుకునే వరకు నిధులు కేటాయించాలని కోరారు. రాష్ట్రానికి రూ.10 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉందని చెప్పారు. సీమాంధ్రలో రాజధాని నిర్మాణానికి భూముల దగ్గర నుంచి వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. ఇప్పుడు పార్టీ శ్రేణులందరిపై గురుతర బాధ్యత ఉందంటూ.. కొత్త రాజధాని నిర్మాణం కోసం నెలలో రెండురోజుల సంపాదన విరాళంగా ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. సీమాంధ్రలో హైదరాబాద్ లాంటి మూడు నాలుగు నగరాలను అభివృద్ధి చేసే సత్తా ఉందన్నారు. టీడీపీని జాతీయ పార్టీగా ప్రకటించేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఉన్న పార్టీ భవిష్యత్‌లో ఐదారు రాష్ట్రాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని ఈసారి రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారన్నారు. 125 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన పార్టీ సీమాంధ్రలో కేవలం రెండు శాతం ఓట్లు కూడా తెచ్చుకోలేకపోయిందంటే ఎలాంటి స్థితికి చేరుకుందో తెలిసిపోతోందన్నారు. తెలుగువాడు పీవీ నరసింహారావు ప్రధాని స్థాయికి ఎదిగినప్పటికీ ఆయనకు ఢిల్లీలో కనీసం స్మారక స్థూపం లేకుండా ఆ పార్టీ చేసిందని విమర్శించారు. అక్కడ పీవీ ఘాట్ కట్టే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని చెప్పారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పోగొట్టొద్దు హైదరాబాద్ నగరానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ను పోగొట్టవద్దని కొత్తగా ఏర్పడబోయే తెలంగాణ ప్రభుత్వానికి చంద్రబాబు సూచించారు. హైదరాబాద్‌లో ప్రజలకు రక్షణ ఇవ్వాలని కోరారు. టీఆర్ఎస్ పార్టీ వార్‌రూమ్‌లు ఏర్పాటు చేయడం ద్వారా సాధించేదేమీ ఉండదని, కాంగ్రెస్ ఢిల్లీలో ఇలాంటి వార్రూమ్లే పెట్టి అడ్రస్ లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. పోలవరం సమస్యను జటిలం చేయాలని కేసీఆర్ చూస్తున్నారని విమర్శించారు. పార్టీ శ్రేణులను రెచ్చగొట్టేలా ప్రసంగం రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానున్న చంద్రబాబు మహానాడు వేదికగా పార్టీ శ్రేణులను రెచ్చగొట్టేలా మాట్లాడారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పడు ఎప్పుడూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని, 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి టీడీపీని బలహీన పరిచేందుకు హత్యా రాజకీయాలను ప్రోత్సహించారని ఆరోపించారు. అనంతపురం జిల్లాలో పరిటాల రవి హత్య ఇందుకొక ఉదాహరణ అని చెప్పారు. ఆ జిల్లాలో రోజుకొక ప్రాంతంలో పార్టీ నేతల హత్యలు జరిగేవన్నారు. బాధిత కుటుంబానికి చెందిన పిల్లలను తాను గండిపేట స్కూలులో ఉంచి చదివిస్తున్నానని చెప్పారు. వారితో తాను మాట్లాడినప్పుడు.. ‘మా నాన్నను చంపిన వ్యక్తులను చంపేవరకు వదిలిపెట్టం’ అని వారు చెప్పేవారన్నారు. తాను మాత్రం హత్యకు హత్య సమాధానం కాదని వారికి చెప్పానన్నారు. బాబును అభినందిస్తూ తీర్మానం ఇటీవలి ఎన్నికల్లో టీడీపీని గెలిపించినందుకు అధ్యక్షుడు చంద్రబాబును అభినందిస్తూ మహానాడు ఏక గ్రీవంగా తీర్మానించింది.పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. విజయానికి సహకరించిన పార్టీ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. సొమ్మసిల్లిన తిరుపతి ఎమ్మెల్యే తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ సభా వేదిక వద్ద సొమ్మసిల్లి పడిపోయారు. ఉదయం మహానాడు వేదిక పైకి చంద్రబాబు వచ్చినప్పుడు తొక్కిసలాట జరగడంతో అక్కడే ఉన్న వెంకటరమణ సొమ్మసిల్లి పడిపోయారు. ఉదయం 11 గంటల సమయంలో పార్టీ నేతలు అనేకమంది ఒకేసారి గండిపేటకు చేరుకోవడంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, బాబు కుమారుడు లోకేష్ కొద్ది దూరం నడిచి వేదిక వద్దకు చేరుకోవాల్సి వచ్చింది. పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణతో పాటు పార్టీ రాష్ర్ట కార్యవర్గంలోని వారందరూ వేదికపై ఆశీనులయ్యారు. మహానాడు ప్రారంభానికి ముందు పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించటంతో పాటు పార్టీ జెండాను బాబు ఎగురవేశారు. అంతకుముందు రక్తదాన శిబిరం, ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. సాక్షిని అనుమతించని నేతలు మహానాడు కార్యక్రమానికి సాక్షి పత్రికను టీడీపీ ఆహ్వానించలేదు. కవరేజీ కోసం వెళ్లిన సాక్షి ప్రతినిధులను ఆ పార్టీ నేతలు ప్రాంగణంలోకి అనుమతించలేదు. దీంతో వివిధ మార్గాల్లో సేకరించి ఈ సమాచారాన్ని పాఠకులకు అందిస్తున్నాం.