‘మాఫీ’తో ముప్పుతిప్పలు | loan waiver to be a liability on chandrababu government | Sakshi
Sakshi News home page

‘మాఫీ’తో ముప్పుతిప్పలు

Published Thu, Jun 12 2014 1:30 AM | Last Updated on Sat, Sep 2 2017 8:38 AM

‘మాఫీ’తో ముప్పుతిప్పలు

‘మాఫీ’తో ముప్పుతిప్పలు

అప్పుల భారంతో చితికిన రైతన్నలకు రుణమాఫీ హామీ ఒక ఆశాకిరణంగా కనబడింది. అధికారంలోకి వచ్చి రుణాలు మాఫీ చేస్తాం, అప్పులు చెల్లించవద్దని టీడీపీ, టీఆర్‌ఎస్‌లు సూచించాయి. కనుకనే టీఆర్‌ఎస్ సర్కారు పరిమితులు విధిస్తే నిరసనలు వెల్లువెత్తాయి. ఇప్పుడు బాబు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న కమిటీపై కూడా అలాంటి వ్యతిరేకతే రావొచ్చు.
 
 కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గద్దెనెక్కిన ప్రభుత్వాలకు రుణమాఫీ వాగ్దానం గుదిబండగా మారింది. తెలంగాణ ప్రాంతంలో ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు రైతు రుణాల మాఫీకి లక్ష రూపాయల పరి మితినైనా విధించారు. చంద్రబాబు మాత్రం మొత్తం రుణాలన్ని టినీ మాఫీ చేస్తానని వాగ్దానం చేశారు. ఎన్నికలయ్యాక ఇద్దరూ రుణమాఫీపై తడబడ్డారు. 2012-13 మధ్య తీసుకున్న పంట రుణాలు మాత్రమే మాఫీ అవుతాయని,  బంగారం కుదువబెట్టి తీసుకున్న రుణాలకు ఇది వర్తించబోదని తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ ప్రకటిం చడంతో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. రైతులం తా తీవ్ర నిరాశానిస్పృహలకు లోనయ్యారు. కేసీఆర్ సొంత జిల్లా మెదక్‌లోనే ఇద్దరు రైతులు గుండెపో టుతో మరణించారు. మరో నలుగురు అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారు.
 
 ఉక్కిరిబిక్కిరైన తెలం గాణ సర్కారు దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. చెప్పిన ట్టుగానే రుణమాఫీని కచ్చితంగా అమలుచేస్తామని కేసీఆర్ స్పష్టంగా హామీ ఇవ్వడంతో పరిస్థితి కొంతవరకూ చల్లబడింది. తెలంగాణలోని 2012-13 రుణాలు రూ. 12,000 కోట్లు మాత్రమే. అలాకా కుండా ఇంతవరకూ ఉన్న లక్షలోపు రుణాలన్నిటినీ మాఫీ చేయాలంటే అవి రూ. 26,020 కోట్లు అవుతాయి. రుణాల భారంతో చితికిన రైతన్నలకు ఎన్ని కల్లో టీఆర్‌ఎస్, టీడీపీల రుణమాఫీ హామీ ఆశాకిరణంగా కనబడింది. అధికారంలోకి వచ్చిన వెంటనే రుణాలు మాఫీ చేస్తాం గనుక ఎవరూ అప్పులు చెల్లించవద్దని కూడా అవి సూచించాయి. కనుకనే టీఆర్‌ఎస్ సర్కారు కొన్ని పరిమితులు విధింపు యత్నానికి వ్యతిరేకత వెల్లువెత్తింది.
 
 బాబు కప్పదాటు
 టీఆర్‌ఎస్‌కు భిన్నంగా టీడీపీ రైతు రుణాలపై ఎలాంటి పరిమితీ విధించ లేదు. అధికారంలోకి వస్తూనే రైతు రుణాలన్నిటినీ రద్దుచేస్తామని చంద్ర బాబు ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పారు. సీమాంధ్రలోని 13 జిల్లాల రుణాలనూ ప్రభుత్వాధికారులతో ఆయన లెక్కలు కట్టించారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో అన్ని రకాల బ్యాంకులు రూ. 37,058 కోట్ల రుణాలను రైతులకు మంజూరుచేశాయని వారు తేల్చారు. ఇందులో ఖరీఫ్ రుణాలు రూ. 22,992 కోట్లు, రబీ రుణాలు 14,065 కోట్లు. 2014 మార్చి 31నాటికి చెల్లించని అన్ని రకాల వ్యవసాయ రుణాలూ కలిపి రూ. 59,105 కోట్లని వారు చెబుతున్నారు. ఇవన్నీ 84 లక్షల 86 వేల 890 మంది రైతుల ఖాతాల కింద ఉన్నాయి. ఇందులో సన్నకారు రైతుల ఖాతాలు 72 లక్షల 13వేల 857 ఉన్నాయని... అన్ని రకాల ఇతర రుణాలనూ మినహాయించి పంట రుణా లను మాత్రమే మాఫీ చేయాలని ప్రభుత్వం అనుకుంటే రూ. 34,067.67 కోట్ల భారం పడుతుందని అధికారులు అంచనావేశారు. అయితే, బ్యాంకర్ల అంచనాలు వేరుగా ఉన్నాయి. అన్ని రకాల వ్యవసాయ రుణాలు రూ. 73,408 కోట్లుగా వారు చెబుతున్నారు. డ్వాక్రా మహిళల రుణాలు రూ. 14,204 కోట్లు కలిపితే ఇది రూ. 87,612 కోట్లు అవుతుందన్నది వారి అంచనా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ఇప్పటికే రూ. 15,900 కోట్లు లోటుతో ఉంది.
 
 ఇందుకు భిన్నంగా తెలంగాణకు సుమారు రూ. 7,510 కోట్లు ఆదాయ మిగులు ఉంది. అయినా సరే కేసీఆర్ రుణమాఫీకి లక్ష రూపాయల పరిమితి విధించుకున్నారు. బాబు మాత్రం ఎలా చెయ్యగలరో, ఏమి చెయ్యగలరో తగినంత స్పష్టత లేకుండా వ్యవసాయ రుణాలన్నిటినీ రద్దుచేస్తామని ప్రకటించారు. విపక్షాలు దాడి చేస్తుంటే ‘మావద్ద స్పష్టమైన ప్రణాళిక ఉంది. ఎలా చేయాలో మాకు తెలుసు. అనుభవంలేని కొత్త పార్టీల నాయకుల దగ్గరనుంచి నేర్చుకోవాల్సిన ఖర్మ పట్టలేదు’ అని ఆయన బింకంగా చెప్పారు. నిజంగా అలాంటి ప్రణాళిక ఉంటే ప్రమాణస్వీకారం రోజున తొలుత హామీ ఇచ్చినట్టు రుణమాఫీ ఫైలుపై కాకుండా రుణమాఫీపై కమిటీని ఏర్పాటు చేసే ఫైలుపై మాత్రమే ఆయన తొలి సంతకం ఎందుకు పెట్టవలసివచ్చిందో అర్థంకాని విషయం.
 
 సంస్కరణల ఆద్యుడు
 చంద్రబాబు 1995 నుండి 2004 వరకూ రాష్ట్రంలో ఆర్థిక సంస్కరణలను అమలు జరిపిన నాయకుడు. ఈ విషయంలో ఆయన దేశవిదేశాల్లో ప్రాము ఖ్యత సంపాదించుకున్నారు. హైటెక్ పద్ధతులకు పెట్టింది పేరుగా ముద్ర వేయించుకున్నారు. కానీ రైతాంగ వ్యతిరేకిగానే ఆయన మిగిలిపోయారు. అందువల్లే రాష్ట్ర ప్రజలు 2004లోనూ, 2009లోనూ ఆయనను కాదను కున్నారు.
 
  దివంగత నేత వైఎస్ 2004 ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఉచిత విద్యుత్తు ఫైలుపై తొలి సంతకం చేయడంమాత్రమే కాదు... ఆ తర్వాత సంక్షేమరథాన్ని చాకచక్యంగా నడిపి వరసగా రెండోసారి కూడా విజయం సాధించారు. అందువల్లే తనకు ఇష్టమున్నా, లేకున్నా సంక్షే మాన్ని పట్టించుకుంటే తప్ప అధికారం దక్కబోదని గ్రహించి చంద్రబాబు ఈసారి ఎన్నికల్లో రుణ మాఫీ గురించి ప్రకటిం చారు. బాబు పంథా తెలిసినవారు ఇప్పుడు రుణమాఫీపై కమిటీ వేయడాన్ని తాత్సారం చేయడం కోసమేనన్న అభిప్రాయంతో ఉన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన గంటనుంచే వాగ్దా నాలకు అవరోధమనుకుంటున్న ఆర్థిక విషయాలపై టీడీపీలోని పైస్థాయి నాయకత్వంనుంచి సభ్యుల వరకూ స్వరం మార్చారు.  
 
 కేంద్రంలోనూ గందరగోళం
 చంద్రబాబు రుణమాఫీ వ్యవహారం కేంద్రంలో కూడా పెద్ద గందరగోళాన్ని సృష్టించింది. దీన్ని ఏదోవిధంగా ఆపించాలని బ్యాంకర్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కలిసి మొరపె ట్టుకున్నట్టు తెలుస్తున్నది. గ్రామాల్లో ఉన్న ఆర్థిక రోగాలకు రుణ మాఫీ పరిష్కారం కాదని, అది రోగ లక్షణాలకు చికిత్స చేయ డమే అవుతుందని మేధావి వర్గం వాదిస్తోంది. రుణమాఫీపై సూచనలివ్వడానికి రిటైర్డు ఐఆర్‌డీఏ చైర్మన్ సీఎస్ రావు అధ్యక్షతన చంద్ర బాబు కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీ ఎన్నికల హామీలు, మొత్తం రుణాలు అంచనావేసి రాష్ట్ర ఆదాయంతో తూకంవేసి రుణాల మాఫీకి మార్గాలు సూచించవలసి ఉంది. మరోపక్క రిజర్వ్ బ్యాంకు గ్యారంటీతో వ్యవసాయ రుణాలపై పదేళ్ల మారటోరియం విధించి బ్యాంకులకు ప్రభుత్వ బాండ్లు ఇవ్వాలని బాబు యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. రిజర్వ్ బ్యాంకు ఈ అభ్యర్థనను అంగీకరించడం కష్టమే.
 
  అలా చేస్తే అది తాను నిర్ణయించిన రాష్ట్రాల రుణ హద్దుల్ని తానే అతిక్రమించినట్టు అవుతుంది. పైగా ఆర్థిక బాధ్యతలు, బడ్జెట్ నిర్వహణ చట్టం-2003 కూడా అడ్డంకిగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి బ్యాంకుల అప్పులు, జమల నిష్పత్తిని... 5,26,125 కోట్ల అప్పులు, 4,51,121 కోట్ల డిపాజిట్లతో 116 శాతంగా నిర్ధారించారు. బ్యాంకులు 75,044 కోట్ల క్రాస్ సబ్సిడైజేషన్ లోటు ప్రమాద సూచికను చూపుతున్నాయి. అయినా 87 వేల కోట్ల పైబడి ఉన్న రుణ మాఫీ అమలు ఏవిధంగా సాధ్యమో చెప్పాలని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు.  
 
తెలంగాణలో రుణమాఫీ పరిమితులపై వెల్లువెత్తిన నిరసనలతో బాబుకు సంకటస్థితి ఎదురైంది. అందువల్లే కమిటీతో కాలయాపన చేయదల్చుకున్నట్టు కనబడు తోంది. దేశ స్థూల ఆదాయంలో వ్యవసాయం నుంచి వచ్చే వాటా 2009 - 10లో 14.6 శాతం ఉండగా 2012 - 13లో అది 13.7 శాతానికి క్షీణించింది. గ్రామీణ భారతంలో ఇప్పటికీ 60 శాతానికిపైగా ప్రజలు వ్యవసాయ సంబం ధిత పనులపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనా తరహాలో అభివృద్ధి సాధ్యంకావాలంటే ప్రజలు తమ కాళ్లపై తాము నిలబడగ లిగేలా ప్రభుత్వ పథకాలు ఉండాలని విజ్ఞులు అభిప్రాయపడుతున్నారు. పరిశ్రమల స్థాపనపై దృష్టిపెట్టాలంటున్నారు. నాయకులు  ఆ మార్గంలో ఆలోచిస్తారా?!
 (వ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు)
 బలిజేపల్లి శరత్‌బాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement