భవిత మనదే.. యువతకే పెద్దపీట: వైఎస్ జగన్ | future is ours, ys jagan mohan reddy assures party cadre | Sakshi
Sakshi News home page

భవిత మనదే.. యువతకే పెద్దపీట: వైఎస్ జగన్

Published Thu, Jun 12 2014 3:11 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

భవిత మనదే.. యువతకే పెద్దపీట: వైఎస్ జగన్ - Sakshi

భవిత మనదే.. యువతకే పెద్దపీట: వైఎస్ జగన్

నియోజకవర్గ సమీక్షల్లో వైఎస్ జగన్ ప్రకటన
గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకూ పార్టీ బలోపేతం
యువతకు మార్గదర్శకంగా సీనియర్లతో కమిటీలు
అధికారం కోసం చంద్రబాబులా అసత్యాలు చెప్పలేను
టీడీపీ, ఎల్లో మీడియా దుష్ర్పచారాన్ని తిప్పికొట్టాలి
ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజాపోరాటాలకు సిద్ధపడాలి
వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు అధికారం ఖాయం
విశాఖలో పార్టీ సమీక్షల్లో అధినేత వైఎస్ జగన్ భరోసా

 
సాక్షి, విశాఖపట్నం: ‘‘పార్టీని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బలోపేతం చేయాలి. పార్టీ శ్రేణులంతా ఏకమవ్వాలి. జిల్లాలోని అందర్నీ సమన్వయపరిచే స్థాయి ఉన్న నేతలకు బాధ్యతలు అప్పగిస్తాం. యువతరానికే పెద్దపీట వేస్తాం. సీనియర్లను సలహా కమిటీలో చేర్చి.. యువతరాన్ని నడిపించేలా విధానాలు రూపొం దిస్తాం.. రాబోయే రోజుల్లో భవిష్యత్తు మనదే అని ప్రజలు ఈ ఎన్నికల్లో విస్పష్ట సంకేతమిచ్చారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ శ్రేణులకు వివరించారు. ‘‘సాధ్యం కాదని తెలిసి కూడా రూ. 88 వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేస్తానంటూ చంద్రబాబు అబద్ధపు హామీలిచ్చారు. ప్రజలు కాస్తో కూస్తో నమ్మారు. వారిని నమ్మించేందుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9 అదేపనిగా కంకణం కట్టుకున్నాయి.

దాంతో మనం కేవలం 5.6 లక్షల ఓట్ల తేడాతో ప్రతిపక్షంలో ఉన్నాం. మనకు కోటీ 30 లక్షల ఓట్లొచ్చాయి. టీడీపీకి కోటీ 35 లక్షలు ఓట్లు వచ్చాయి’’ అని ఆయన కార్యకర్తలతో పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాల వారీగా పార్టీ రెండో దశ సమీక్షా సమావేశాలు బుధవారం విశాఖపట్నంలోని బీచ్‌రోడ్‌లో గల విశ్వప్రియ ఫంక్షన్ హాల్లో జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. బుధవారం ఉదయం నుంచి అర్ధ రాత్రి వరకూ కార్యకర్తలు, శ్రేణులతో మమేకమై వారి అభిప్రాయాలను తెలుసుకున్న జగన్ తన ప్రసంగంతో వారిలో పునరుత్తేజం నింపారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
 
మరో 10 రోజుల్లో అబద్ధాలు బట్టబయలు...
‘‘చంద్రబాబులా నేనూ అబద్ధం చెప్పేస్తే.. తప్పకుండా మనం అధికారంలోకి వచ్చేవాళ్లం. అయితే అధికారంలోకి వచ్చిన మూడు మాసాలకే అమలు కాదని తెలిసీ రైతు రుణమాఫీపై ఎందుకు హామీలిచ్చారు? గ్రామాల్లోకి వెళ్తే రైతులంతా మమ్మల్ని తిడుతున్నారన్నా.. అంటూ నావద్దకే వచ్చి చెప్పేవారు. నేనేవో అబద్ధాలు చెప్పి ఐదేళ్లు అధికారాన్ని అనుభవించి ఆ తర్వాత జనాల వ్యతిరేకతకు గురవడానికి ఇష్టపడను. 30 ఏళ్ల పాటు విశ్వసనీయ రాజకీయాలు చేయాలనుకునేవాణ్ణి. నా మరణం తర్వా త.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటో తమ ఇళ్లల్లో పెట్టుకున్నట్టు.. నా ఫొటో కూడా పెట్టుకోవాలని ఆశించేవాణ్ణి. జనాలెవరూ అబద్ధాలాడే, మోసం చేసే వారి ఫొటోలను ఇళ్లల్లో ఉంచుకోవాలనుకోరు. మరో 10 రోజుల్లో ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది. రుణాల కోసం బ్యాంకులకు రైతులు వెళ్తారు. పాత రుణాలు చెల్లించకపోతే కొత్త రుణాలు ఇచ్చేది లేదని బ్యాంకర్లు తిప్పి పంపిస్తారు. టీడీపీ అబద్ధపు హామీలు బయటపడతాయి. అయినప్పటికీ చంద్రబాబుకు వంతపాడేందుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9 మళ్లీ ముందుకొస్తాయి. గ్రామ స్థాయి నుంచే బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజల తరఫున ఉద్యమించేందుకు మనం సిద్ధంగా ఉండాలి’’ అని జగన్ పిలుపునిచ్చారు.
 
జైల్లో పెట్టి లొంగదీసుకోవాలనుకున్నారు...
‘‘నాపై కేసుల విషయాన్ని గుర్తు చేస్తూ పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు ఎల్లో మీడియా చేస్తోంది. వైఎస్సార్ బతికున్నపుడు, జగన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నపుడు ఈ కేసులు పెట్టలేదు. వైఎస్సార్ మరణించిన 18 మాసాలకు, జగన్ పార్టీ నుంచి బయటికొచ్చేసిన రెండు మాసాలకు కేసులు పెట్టారు. ప్రత్యర్థిగా ఎక్కడ తయారవుతానోనన్న భయంతోనే.. టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు కుట్రలకు పాల్పడ్డాయి. జైల్లో పెట్టి ఎన్ని విధాలా లొంగదీసుకోవాలన్నా.. లొంగలేదు. జైల్లో ఉంటూనే.. ఎఫ్‌డీఐ బిల్లుకు వ్యతిరేకంగా మన ఎంపీలతో ఓటేయించాం. చంద్రబాబు విప్ జారీ చేసి మరీ తమవారిని అడ్డుకున్నారు. కిరణ్ సర్కార్ ఏకంగా రూ. 32 వేల కోట్ల విద్యుత్ చార్జీలు వడ్డిస్తే.. ఇదే చంద్రబాబు విప్ జారీ చేసి కాంగ్రెస్‌ను కాపాడారు. ఆ సమయంలో కనీస మెజార్టీ 148 సీట్లకు రెండు తక్కువగా 146 ఎమ్మెల్యేలతోనే కాంగ్రెస్ ఉంది. అప్పుడే చంద్రబాబు సహకరిస్తే రాష్ట్ర విభజనే జరిగేది కాదు. నాకున్న బలం దేవుడి దయ.. ఇంతమంది గుండెల్లో అభిమానం. నేనెవరికీ అన్యాయం చేయలేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9కు కూడా. అయినా నేనంటే వారికి ద్వేషం. 2004 లోనూ ఇదే జరిగింది. అయినా నాన్నగారికి ప్రజలు భారీ మెజార్టీ కట్టబెట్టారు. తాజా ఎన్నికల్లో టీడీపీ ఓటమి భయంతో సర్వశక్తులూ ఒడ్డింది. మనం గెలుపు ధీమాతో నిర్లిప్తం గా వ్యవహరించాం.. అంతే తేడా!
 
యువతకే ప్రాధాన్యం...

పార్టీ దెబ్బతిన్న చోట మన వాళ్లకు మనోధైర్యం కలి గించాలి. జరిగిన తప్పు మరోసారి పునరావృతం కాకుండా సరిదిద్దుకోవాలి. పార్టీని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బలోపేతం చేయాలి. అధికారపక్షం నేతల నుంచి భౌతిక దాడులు, బెదిరింపులు ఉండొ చ్చు. వాటిని ఎదుర్కొనేందుకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ శ్రేణులంతా ఏకమవ్వాలి. జిల్లాలోని అందర్నీ సమన్వయపరిచే స్థాయి ఉన్న నేతలకు బాధ్యతలు అప్పగిస్తాం. యువతరానికే పెద్దపీట వేస్తాం. పార్టీ కార్యక్రమాల నిర్వహణలో యువతకే ప్రాధాన్యం ఇస్తాం. పార్టీకి ఉజ్వల భవిష్యత్తు అందించాల్సిన బాధ్యత యువతపైనే ఉంది. వయసెక్కువ ఉన్న సీనియర్ నేతలను సలహా కమిటీలో చేర్చి.. యువతరాన్ని నడిపించేలా విధానాలు రూపొందిస్తాం.
 
రాబోయే భవిష్యత్తు మనదే...
ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ రెండూ ప్రతి పక్ష పార్టీలుగానే ఎన్నికలకు వెళ్లాయి. దాంతో కాంగ్రెస్ ప్రజావ్యతిరేక ఓటు ఎవరికి వెళుతుందోనన్న సందిగ్ధత ఉండేది. కానీ వచ్చేసారి మనం ప్రతిపక్ష పార్టీగా ఎన్నికలకు వెళతాం. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి న చంద్రబాబు ఈ ఐదేళ్లలో పూర్తిగా విఫలమవుతారు. వైఎస్సార్ కాంగ్రెస్  ఈ ఐదేళ్లు సంస్థాగతంగా బలోపేతం కావడంతో పాటు.. ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరుబాటలో సాగుతుంది. దాం తో కచ్చితంగా వైఎస్సార్ సీపీనే అధికారంలోకి వస్తుం ది. మనం కేవలం మన రాజకీయ ప్రత్యర్థి టీడీపీతోనే కాదు.. ఆ పార్టీకి కొమ్ముకాస్తున్న ఎల్లో మీడియాతో కూడా పోరాడాల్సి వస్తోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9 నిష్కారణంగా మనపై భవిష్యత్తులో కూడా దుష్ర్పచారం చేస్తాయి. కానీ మనం మాత్రం విశ్వసనీ యతతో కూడిన రాజకీయాలు చేయాలి. నిత్యం ప్రజల తోనే ఉండాలి. దాంతో ప్రజలే వాస్తవాలు గ్రహిస్తారు. నిజాయితీతో కూడిన రాజకీయాలు చేసే వైఎస్సార్ సీపీ ని ఆదరిస్తారు’’ అని జగన్ భరోసా కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement