
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వాల నుంచి ఎలాంటి సాయం అందక, పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక అల్లాడుతున్న రైతాంగానికి ఉపశమనం కలిగించేందుకు కేంద్రం వెంటనే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. గిట్టుబాటు ధర లేక, అప్పుల ఊబిలో చిక్కుకొని ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలు, అఖిల భారత కిసాన్ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ‘రైతు పార్లమెంట్’నిర్వహించారు. సామాజికవేత్త మేధాపాట్కర్ అధ్యక్షతన మహిళా పార్లమెంట్ జరిగింది. దేశ వ్యాప్తంగా ఉన్న 180 రైతు సంఘాల నేతలు ఈ సదస్సులో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆత్మహత్య చేసుకున్న 70 మంది రైతు కుటుంబీకులు, రైతు స్వరాజ్య సంఘం ప్రతినిధులు, తెలంగాణ రైతు సంఘం నేతలు, మహిళా రైతు సంక్షేమ సంఘం నేతలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం తిండి పెట్టే రైతాంగానికి రుణ విముక్తి ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. దేశంలో రైతు ఆత్మహత్యలు 120 రెట్లు పెరిగాయని, కేంద్రం నుంచి ఎలాంటి స్పంద నా లేదన్నారు. జీఎస్టీ, నోట్ల రద్దు సమయంలో అర్ధరాత్రి పార్లమెంట్‌ను సమావేశపరిచిన కేంద్రం.. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ఎందుకు సమావేశం కావడం లేదని ప్రశ్నించారు. గిట్టుబాటు ధరలేక రైతులు అప్పుల ఊబిలో చిక్కుకున్నారని, దళారులు, వడ్డీ వ్యాపారుల వేధింపులతో రైతులు అత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. దీనిని నివారించేందుకు దేశ వ్యాప్తంగా రైతు రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. పంట ఉత్పత్తి వ్యయంపై 50 శాతం అధికంగా గిట్టుబాటు ధర లభించేలా స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయాలన్నారు. ప్రముఖ నటుడు ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక 60 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment