ప్రహరీ నిర్మాణానికి బ్రేక్
లారీ స్టాండ్ స్థలానికి కంచె వేయాలన్న పాలక మండలి
అభివృద్ధికి ఉపయోగపడనున్న రూ.49.40 లక్షల ప్రజాధనం
సాక్షి, రాజమహేంద్రవరం :
రాజమహేంద్రవరంలోని 10వ డివిజ¯ŒSలో ఉన్న లారీ స్టాండ్ స్థలం ఆక్రమణలకు గురికాకుండా తూర్పువైపు రూ.49.40 లక్షల వ్యయంతో ప్రహరీ నిర్మించాలన్న ప్రతిపాదనలకు బ్రేక్ పడింది. నగరం నడిబొడ్డున, శివారు ప్రాంతాల డివిజన్లలో అనేక ప్రాంతాలు అభివృద్ధికి దూరం ఉన్నా, పట్టించుకోని పాలక మండలి రూ. రెండు లక్షల కంచెతో పోయేదానికి రూ. అరకోటి వెచ్చిస్తోందని గత నెల 18న ‘ఆ అరకోటి అదో లూటీ’ అన్న శీరిక్షతో ‘సాక్షి’లో వార్త ప్రచురితమైంది. అధికార పార్టీలో కొంత మంది సీనియర్ కార్పొరేటర్లు తమ పలుకుబడితో తమ డివిజన్లలో పలు రకాల పనులు సృష్టించి భారీ మొత్తంలో నిధులు విడుదల చేయించుకుంటున్నారని పేర్కొంది. గత నెల 11న స్థాయీ సంఘం ముందుకు వచ్చిన ప్రతిపాదనల్లో ప్రహరీ గోడ అంశం ఒకటి. అప్పట్లో పలు కారణాల వల్ల ఆ సమావేశం వాయిదాపడింది. తాజాగా జరిగిన స్థాయీ సంఘం సమావేశంలో ఈ ప్రతిపాదనను సభ్యులు తిరస్కరించారు. రూ. రెండు, మూడు లక్షలతో కంచె ఏర్పాటు చేయాలని కమిటీ సూచించడంతో సీనియర్ కార్పొరేటర్ దందాకు అడ్డుకట్ట పడింది.