wall poster launch
-
వ్యవసాయ ఉత్పత్తులకు ముందే మద్ధతు ధరలు : మంత్రి కాకాణి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేల్ వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందే రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు మద్ధత్తు ధరలు ప్రకటిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఈ హామీకి అనుగుణంగా.. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో 2023-24 ఏడాదికి వివిధ వ్యవసాయ ఉత్పత్తుల మద్ధత్తు ధరలకు సంబంధించిన గోడపత్రికను రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఇక రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించదేమోనన్న బెంగ లేని విధంగా ఈ మద్ధత్తు ధరలను ప్రకటించామని తెలిపారు. వరి, పసుపు, మిర్చి, ఉల్లి, చిరు ధాన్యాలు, జొన్నలు, సజ్జలు, రాగులు, మొక్కజొన్న, కందులు, పెసలు, మినుములు, వేరుశెనగ, కొబ్బరి, పత్తి, బత్తాయి, అరటి, సోయాబీన్స్, ప్రొద్దుతిరుగుడు వంటి 22 రకాల వ్యవసాయ ఉత్పత్తులకు క్వింటాల్ ధరను ప్రకటించారు. రైతుల్లో మద్ధత్తు ధరలపై పూర్తి అవగాహన కలిగించేందుకు రాష్ట్రంలోని అన్ని రైతు భరోసా కేంద్రాల్లో ఈ ధరల గోడపత్రికను ప్రదర్శిస్తారని తెలిపారు. రైతుకు మధ్య దళారుల బెడద, రవాణా ఖర్చు లేకుండా రైతు భరోసా కేంద్రాల్లోనే సీయం యాప్(Continuous Monitoring of Agriculture Prices and Procurement)ద్వారా కొనుగోలు చేయవచ్చన్నారు. మద్దత్తు ధరలపై వివరణ ఇలా.. రాష్ట్రంలోని రైతన్నలు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించాలని తొలిసారిగా 3 వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి నిరంతరం మానిటర్ చేస్తూ రైతులకు మద్ధత్తు లభించేలా చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి స్పష్టం చేశారు. అందుకే ప్రతి రైతు భరోసా కేంద్రాన్ని కొనుగోలు కేంద్రంగా ప్రకటించామని తెలిపారు. ధాన్యాన్ని కల్లం దగ్గరే కొనుగోలు చేయడంతో పాటు కొనుగోలు చేసిన 15 రోజుల్లోనే చెల్లింపులు చేస్తున్నామని తెలిపారు. కొనుగోలు ప్రక్రియలో చిన్నసన్నకారు రైతులకు ప్రాధాన్యతను ఇస్తున్నామని వివరించారు. మార్కెట్లో ఆన్లైన్ యాప్ ద్వారా అభివృద్ధి చెందడం.. మార్కెట్లో పోటీ తత్వం పెరగాలని తద్వారా రైతన్నకు మెరుగైన ధర రావాలని అందుకోసం అవసరమైతే ప్రభుత్వమే రైతు భరోసా కేంద్రాల ద్వారా పంట ఉత్పత్తులు కొనుగోలు చేసి పోటీని పెంచుతుందని మంత్రి స్పష్టం చేశారు. మద్ధత్తు ధరలకు పంటలు అమ్ముకోవాలంటే రైతులు తప్పని సరిగా ఈ-క్రాపులో వారి పంటల వివరాలను నమోదు చేసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి విజ్ణప్తి చేశారు. అలా నమోదు చేసుకున్న తర్వాత రైతు భరోసా కేంద్రాల్లో గ్రామ వ్యవసాయ సహాయకులు లేదా గ్రామ వ్యవసాయ సహాయకుల వద్ధ సీఎం యాప్ లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కనీస గిట్టుబాటు ధర దక్కని పరిస్థితిలో వెంటనే కొనుగోలు చేస్తామని తెలిపారు. అదే విధంగా రైతులు రైతు భరోసా కేంద్రాలకు తీసుకువచ్చే పంటలకు కనీస నాణ్యతా ప్రమాణాలు ఉండేలా చూడాలని మంత్రి రైతులకు మనవి చేశారు. రైతులు వారి పంటలను కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాక గూగల్ ప్లేస్టోర్ నుంచి CM APP-Farmer Payment Status App ను డౌన్ లోడ్ చేసుకుని తమ చెల్లింపు స్థితిగతులను ఎప్పటికప్పుడు తెల్సుకోగలరని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఆశాఖ కమీషనర్, మార్క్ ఫెడ్ ఎండి రాహల్ పాండే, ఆశాఖ ఆర్జెడి శ్రీనివాసరావు తదితర అధికారుల పాల్గొన్నారు. -
హలో అనండి..పరిష్కారం పొందండి
ఒంగోలు: అసాంఘిక వ్యవహారాలు, అనుమానిత వ్యక్తుల కదలికలు, రోడ్డు ప్రమాదాలకు సంభందించిన లేక ఇతరత్రా ఏ అత్యవసర సమాచారం అయినా 100కు ఫోన్ చేస్తే సహాయం అందించేందుకు పోలీసు శాఖ సంసిద్ధంగా ఉందని జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు అన్నారు. బుధవారం స్థానిక గెలాక్సీ సమావేశ మందిరంలో నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో డయల్ 100 వాల్‌పోస్టర్‌ను ఎస్పీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మహిళలు, పిల్లలపై వేధింపులు, దాడులు జరిగినా, రోడ్డు ప్రమాదాలు అలాగే ఏ ఇతర ప్రమాదాలు సంభవించినా, శాంతిభద్రతల సమస్య ఉత్పన్నం అయ్యే పరిస్థితి ఉన్నా, పేకాట, వ్యభిచారం లాంటివి జరుగుతున్నా, గంజాయి విక్రయం/వినియోగం వంటి అసాంఘిక కార్యకలాపాలను గుర్తించినా, అనుమానిత వ్యక్తులు లేదా నేరస్తుల కదలికలను గుర్తించినా 100కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఫిర్యాదులపై పోలీసు అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోయినా, ఎటువంటి చర్యలు తీసుకోకపోయినా, సరిగ్గా స్పందించకపోయినా, మీ పట్ల దురుసుగా అమర్యాదకరంగా ప్రవర్తించినా, లంచం అడిగినా వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డయల్ 100కు వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
సమైక్య శంఖారావం వాల్‌పోస్టర్ ఆవిష్కరణ
ఒంగోలు, న్యూస్‌లైన్:సమైక్య శంఖారావం వాల్‌పోస్టర్‌ను వైఎస్సార్ సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదివారం ఉదయం తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం సమైక్యంగా ఉండాలన్నదే జగన్మోహన్రెడ్డి ధ్యేయమన్నారు. అందులో భాగంగానే సమైక్యవాదాన్ని ఢిల్లీ నేతలకు వినిపించేందుకుగాను హైదరాబాదులో ఈ సమైక్య శంఖారావాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సమైక్య రాష్ట్రాన్ని కేవలం సీమాంధ్రులే కోరుకుంటున్నారని భావించడం సరికాదన్నారు. తెలంగాణ జిల్లాల్లో సైతం సమైక్యంగా ఉండడం వల్ల కలిగే ఫలితాలు, విడిపోతే ఎదురయ్యే సమస్యలు తెలుసుకున్న అనేకమంది నేడు సమైక్యరాష్ట్రాన్ని కోరుకుంటున్నారన్నారు. ఈనెల 26న హైదరాబాదులోని లాల్‌బహదూర్ స్టేడియంలో వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న సమైక్య శంఖారావానికి అన్ని ప్రాంతాల నుంచి భారీగా జనం తరలివస్తారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 శాతం మంది సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని , ఈ విషయాన్ని ఢిల్లీలో ఉన్న నేతలకు చెప్పేందుకే సమైక్య శంఖారావాన్ని తమ పార్టీ పూరించిందన్నారు. మాట్లాడితే కుమ్మక్కని వైఎస్సార్సీపీ మీద ఆరోపించడం కాదని, గత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో టీడీపీ ఏవిధంగా కుమ్మక్కయింది ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. ఈనెల 26న నిర్వహించే సమైక్య శంఖారావానికి జిల్లాలోని ప్రతి ఒక్కరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. తమ పార్టీ పరంగా నియోజకవర్గానికి 5 వేల నుంచి 10 వేల మంది సమైక్యవాదులు హైదరాబాదుకు తరలివస్తారని భావిస్తున్నామని బాలినేని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ డాక్టర్ నూకసాని బాలాజీ, ప్రచార విభాగం జిల్లా కన్వీనర్ వేమూరి సూర్యనారాయణ, యువజన విభాగం జిల్లా కన్వీనర్ కేవీ రమణారెడ్డి, అధికార ప్రతినిధులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, నరాల రమణారెడ్డి, కొఠారి రామచంద్రరావు, టి.నరశింగరావు, సూరా సామిరంగారెడ్డి, నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్, రైతు విభాగం జిల్లా కన్వీనర్ మారెడ్డి సుబ్బారెడ్డి, బీసీ విభాగం జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ కంచర్ల సుధాకర్, వైఎస్సార్సీపీ నాయకులు సింగరాజు వెంకట్రావు, నగర అధికార ప్రతినిధి రొండా అంజిరెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ స్వర్ణ రవీంద్రబాబు, వివిధ విభాగాల నగర కన్వీనర్లు నెరుసుల రాము, ముదివర్తి బాబూరావు, బొప్పరాజు కొండలు, కావూరి సుశీల, యరజర్ల రమేష్, స్టీరింగ్ కమిటీ సభ్యులు గోవర్థన్, ఎస్వీ రమణయ్య, జాజుల కృష్ణ, రాయని వెంకట్రావు, మీరావలి, తోటపల్లి సోమశేఖర్, మాజీ కౌన్సెలర్ వెలనాటి మాధవరావు, ఒంగోలు మండల కన్వీనర్ రాయపాటి అంకయ్య, కొత్తపట్నం నాయకులు లంకపోతు అంజిరెడ్డి, వీఆర్సీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.