waltair
-
వాల్తేర్ క్లబ్ భూములు ప్రభుత్వానివే
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలోని వాల్తేర్ క్లబ్ భూములు ప్రభుత్వ భూములని అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. వాల్తేర్ క్లబ్ భూముల వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గత నెల 27న జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ వాల్తేర్ క్లబ్ అధ్యక్షుడు ఫణీంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లంచ్‌మోషన్ రూపంలో దాఖలు చేసిన ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు వచ్చింది. ప్రభుత్వం తరఫున ఏఏజీ సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఆ భూములను క్లబ్ లీజుకు తీసుకుందని, లీజు గడువు ముగిసినా ఖాళీ చేయడం లేదని హైకోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆ భూములపై సిట్ దర్యాప్తు ప్రారంభించిందన్నారు. వాస్తవానికి వాల్తేర్ క్లబ్ రఫ్ రెంటల్ పట్టా తీసుకుని, రఫ్ పట్టా మాత్రమే తీసుకున్నట్టు చెబుతోందన్నారు. ఆ రఫ్ పట్టాను సర్వే సెటిల్మెంట్ కమిషనర్ కొట్టేశారని.. దీనిపై ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ కింద క్లబ్ పిటిషన్ వేసుకోవాల్సి ఉండగా ఆ పని చేయలేదన్నారు. పైగా వాల్తేర్ క్లబ్ తనది కాని భూమికి ప్రభుత్వం నుంచి అక్రమంగా పరిహారం కూడా పొందిందని, మరోసారి పరిహారం పొందుతూ అడ్డంగా దొరికిపోయిందని వివరించారు. పరిహారం మొత్తాన్ని వసూలు చేసేందుకు రెవెన్యూ రికవరీ చట్టం కింద చర్యలు ప్రారంభించామన్నారు. సిట్ కాల పరిమితి ముగిసిందని చెబుతున్నప్పుడు క్లబ్ ప్రతినిధులు సిట్ ముందు హాజరై ఎందుకు వివరణ ఇచ్చారని ప్రశ్నించారు. ఈ విషయాన్ని క్లబ్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకురాకుండా దాచిపెడుతున్నారని వివరించారు. గురు లేదా శుక్రవారానికి వాయిదా వేస్తే పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామని సుధాకర్‌రెడ్డి వివరించారు. న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య స్పందిస్తూ.. సిట్ కాల పరిమితిని పొడిగిస్తూ ఏవైనా ఉత్తర్వులు ఇచ్చారా అని ప్రశ్నించగా.. ప్రస్తుతానికి ఆ సమాచారం తనవద్ద లేదని అదనపు ఏజీ చెప్పారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. సిట్ కాల పరిమితి ముగిసిందని కోర్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చిందని, అందువల్ల ఆ క్లబ్‌పై వారం పాటు ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. దీనిని సుధాకర్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించగా.. వారం పాటు ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ విచారణను గురువారానికి వాయిదా వేశారు. -
పరీక్ష బాగా రాయలేదని ఎం.ఫార్మసీ విద్యార్థి ఆత్మహత్య
పెదవాలే్తరు (విశాఖ తూర్పు): పరీక్ష బాగా రాయలేదని మనస్తాపానికి గురైన ఎం.ఫార్మసీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు ఎవరూ కారణం కాదంటూ సూసైడ్ నోట్ రాశాడు. పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన కర్నేటి రాజేష్(22) ఆంధ్రా యూనివర్సిటీలో ఎం.ఫార్మసీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం ఉదయం పరీక్ష రాశాడు. తర్వాత హాస్టల్‌కు చేరుకుని భోజనం చేశాడు. అనంతరం స్నేహితులతో కాసేపు గడిపిన రాజేష్ హాస్టల్ గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. సాయంత్రం హాస్టల్లో తోటి విద్యార్థి చైతన్య వచ్చి తలుపుకొట్టాడు. ఎంతకీ తీయకపోవడంతో అనుమానం వచ్చి కిటికీ లోంచి చూసే సరికి ఫ్యాన్‌కు ఉరివేసుకుని రాజేష్ వేలాడుతున్నాడు. దీంతో విద్యార్థులు మూడో పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాజేష్ గదిలో పరిశీలించగా సూసైడ్ నోట్ లభించిందని ఎస్సై దాలిబాబు తెలిపారు. ఆ నోట్లో తన మరణానికి ఎవరూ కారణం కాదని, తల్లిదండ్రులు ఆశించిన స్థాయిలో తాను చదువులో రాణించలేకపోతున్నానని, భయస్తుడిని కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నానని ఉంది. ‘తమ్ముడూ.. అమ్మానాన్నలను నువ్వే చూసుకో’ అని కూడా ఉంది. జంగారెడ్డిగూడెంలో విషాదం జంగారెడ్డిగూడెం : రాజేష్ ఆత్మహత్యతో జంగారెడ్డిగూడెంలోని అతని కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. తొలుత రాజేష్‌కు సీరియస్‌గా ఉందని ఫోన్ రావడంతో అతని తల్లిదండ్రులు సత్యనారాయణ, లక్ష్మి ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత మరణవార్త తెలియడంతో తీవ్రంగా రోదిస్తున్నారు. బుధవారం రాత్రి రాజేష్ తండ్రి సత్యనారాయణతోపాటు బంధువులు సుమారు 20 మంది కార్లలో వైజాగ్ బయలుదేరి వెళ్లారు. రాజేష్ తండ్రి సత్యనారాయణ జీడిపిక్కల ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తున్నాడు. తన ఇద్దరు కొడుకులను చదివించుకుంటున్నాడు. రాజేష్ తమ్ముడు మధుబాబు డిగ్రీ పూర్తిచేసి స్థానిక వైనాట్ షోరూమ్‌లో పనిచేస్తున్నాడు. నా కొడుకు పిరికివాడు కాదు నా కొడుకు రాజేష్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. తొలి నుంచి బాగా చదివే విద్యార్థి. బీఫార్మసీ సీటు ఉచితంగా లభించింది. ఎంఫార్మసీలోనూ ఆంధ్రాయూని వర్సిటీలో సీటు లభించింది. ఇటీవలే సంక్రాంతికి ఇంటికి వచ్చాడు. 19న వైజాగ్ వెళుతూ రూ.6వేలు హాస్టల్ ఫీజు కట్టాలని అడగ్గా, రూ.7వేలు ఇచ్చి పంపాను. ఇంతలోనే నా కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డట్టు సమాచారం వచ్చింది. రాజేష్‌కు ఎటువంటి ఇతర వ్యవహరాలూ లేవు. సూసైడ్ నోట్ రాసినట్టు చెబుతున్నారు. దానిపై అనుమానం ఉంది. – కర్నాటి సత్యనారాయణ, రాజేష్ తండ్రి -
రైల్వేజోన్ ఏర్పాటు చేయాలి
ద్వారకానగర్: విశాఖ కేంద్రంగా వాల్తేరు రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని కోరుతూ సీపీఐ, సీపీఎం విశాఖనగర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జీవీఎంసీ ఎదురుగా గాంధీ విగ్రహం వద్ద సామూహిక నిరసన కార్యక్రమం చేపట్టారు. సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.వి. సత్యనారాయణమూర్తి, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి సి.హెచ్. నర్సింగరావు మాట్లాడుతూ విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. రెండు దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజలు పోరాటం చేస్తున్నారన్నారు. విశాఖ డివిజన్‌ను ఒడిశాలోని భువనేశ్వర్‌లో కలపడం వల్ల ఉత్తరాంధ్ర ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయిందని, విశాఖ మినహా మిగిలిన ప్రాంతాల్లో పారిశ్రామికాభివద్ధికి ఆటంకాలు కలుగుతున్నాయని చెప్పారు. ఇప్పటికైనా కేంద్రం త్వరితగతిన సానుకూల నిర్ణయం ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు విఎస్. పద్మనాభరాజు, ఆర్కేస్సీకుమార్, జి.ఎస్. రాజేశ్వరరావు, బి.పద్మ, పి. మణి, జి.అప్పలరాజు, సీపీఐ నాయకులు ఎ.జె.స్టాలిన్, డి. మార్కండేయులు, ఎ. విమల, జె.డి .నాయుడు, ఎం. పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.