పరీక్ష బాగా రాయలేదని ఎం.ఫార్మసీ విద్యార్థి ఆత్మహత్య | m.pharmacy student suicide | Sakshi
Sakshi News home page

పరీక్ష బాగా రాయలేదని ఎం.ఫార్మసీ విద్యార్థి ఆత్మహత్య

Published Thu, Jan 26 2017 12:21 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

m.pharmacy student suicide

  పెదవాలే్తరు (విశాఖ తూర్పు): పరీక్ష బాగా రాయలేదని మనస్తాపానికి గురైన ఎం.ఫార్మసీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు ఎవరూ కారణం కాదంటూ సూసైడ్‌ నోట్‌ రాశాడు. పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన కర్నేటి రాజేష్‌(22) ఆంధ్రా యూనివర్సిటీలో ఎం.ఫార్మసీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం ఉదయం పరీక్ష రాశాడు. తర్వాత హాస్టల్‌కు చేరుకుని భోజనం చేశాడు. అనంతరం స్నేహితులతో కాసేపు గడిపిన రాజేష్‌ హాస్టల్‌ గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. సాయంత్రం హాస్టల్లో తోటి విద్యార్థి చైతన్య వచ్చి తలుపుకొట్టాడు. ఎంతకీ తీయకపోవడంతో అనుమానం వచ్చి కిటికీ లోంచి చూసే సరికి ఫ్యాన్‌కు ఉరివేసుకుని రాజేష్‌ వేలాడుతున్నాడు. దీంతో విద్యార్థులు మూడో పట్టణ పోలీసులకు సమాచారం  ఇచ్చారు. రాజేష్‌ గదిలో పరిశీలించగా సూసైడ్‌ నోట్‌ లభించిందని ఎస్సై దాలిబాబు తెలిపారు. ఆ నోట్‌లో తన మరణానికి ఎవరూ కారణం కాదని, తల్లిదండ్రులు ఆశించిన స్థాయిలో తాను చదువులో రాణించలేకపోతున్నానని, భయస్తుడిని కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నానని ఉంది. ‘తమ్ముడూ.. అమ్మానాన్నలను నువ్వే చూసుకో’ అని కూడా ఉంది.  
జంగారెడ్డిగూడెంలో విషాదం
జంగారెడ్డిగూడెం : రాజేష్‌ ఆత్మహత్యతో జంగారెడ్డిగూడెంలోని అతని కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. తొలుత రాజేష్‌కు సీరియస్‌గా ఉందని ఫోన్‌ రావడంతో అతని తల్లిదండ్రులు సత్యనారాయణ, లక్ష్మి ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత మరణవార్త తెలియడంతో తీవ్రంగా రోదిస్తున్నారు. బుధవారం రాత్రి రాజేష్‌ తండ్రి సత్యనారాయణతోపాటు బంధువులు సుమారు 20 మంది కార్లలో వైజాగ్‌ బయలుదేరి వెళ్లారు. రాజేష్‌ తండ్రి  సత్యనారాయణ జీడిపిక్కల ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తున్నాడు. తన ఇద్దరు కొడుకులను చదివించుకుంటున్నాడు. రాజేష్‌ తమ్ముడు మధుబాబు డిగ్రీ పూర్తిచేసి స్థానిక వైనాట్‌ షోరూమ్‌లో పనిచేస్తున్నాడు.
 
నా కొడుకు పిరికివాడు కాదు 
నా కొడుకు రాజేష్‌ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. తొలి నుంచి బాగా చదివే విద్యార్థి. బీఫార్మసీ సీటు ఉచితంగా లభించింది. ఎంఫార్మసీలోనూ ఆంధ్రాయూని వర్సిటీలో సీటు లభించింది. ఇటీవలే సంక్రాంతికి ఇంటికి వచ్చాడు. 19న వైజాగ్‌ వెళుతూ రూ.6వేలు హాస్టల్‌ ఫీజు కట్టాలని అడగ్గా, రూ.7వేలు ఇచ్చి పంపాను. ఇంతలోనే నా కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డట్టు సమాచారం వచ్చింది. రాజేష్‌కు ఎటువంటి ఇతర వ్యవహరాలూ లేవు.  సూసైడ్‌ నోట్‌ రాసినట్టు చెబుతున్నారు. దానిపై అనుమానం ఉంది. 
– కర్నాటి సత్యనారాయణ, రాజేష్‌ తండ్రి 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement