సాక్షి, అమరావతి: విశాఖపట్నంలోని వాల్తేర్ క్లబ్ భూములు ప్రభుత్వ భూములని అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. వాల్తేర్ క్లబ్ భూముల వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గత నెల 27న జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ వాల్తేర్ క్లబ్ అధ్యక్షుడు ఫణీంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లంచ్‌మోషన్ రూపంలో దాఖలు చేసిన ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు వచ్చింది. ప్రభుత్వం తరఫున ఏఏజీ సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఆ భూములను క్లబ్ లీజుకు తీసుకుందని, లీజు గడువు ముగిసినా ఖాళీ చేయడం లేదని హైకోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆ భూములపై సిట్ దర్యాప్తు ప్రారంభించిందన్నారు. వాస్తవానికి వాల్తేర్ క్లబ్ రఫ్ రెంటల్ పట్టా తీసుకుని, రఫ్ పట్టా మాత్రమే తీసుకున్నట్టు చెబుతోందన్నారు.
ఆ రఫ్ పట్టాను సర్వే సెటిల్‌మెంట్ కమిషనర్ కొట్టేశారని.. దీనిపై ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ కింద క్లబ్ పిటిషన్ వేసుకోవాల్సి ఉండగా ఆ పని చేయలేదన్నారు. పైగా వాల్తేర్ క్లబ్ తనది కాని భూమికి ప్రభుత్వం నుంచి అక్రమంగా పరిహారం కూడా పొందిందని, మరోసారి పరిహారం పొందుతూ అడ్డంగా దొరికిపోయిందని వివరించారు. పరిహారం మొత్తాన్ని వసూలు చేసేందుకు రెవెన్యూ రికవరీ చట్టం కింద చర్యలు ప్రారంభించామన్నారు. సిట్ కాల పరిమితి ముగిసిందని చెబుతున్నప్పుడు క్లబ్ ప్రతినిధులు సిట్ ముందు హాజరై ఎందుకు వివరణ ఇచ్చారని ప్రశ్నించారు. ఈ విషయాన్ని క్లబ్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకురాకుండా దాచిపెడుతున్నారని వివరించారు.
గురు లేదా శుక్రవారానికి వాయిదా వేస్తే పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామని సుధాకర్‌రెడ్డి వివరించారు. న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య స్పందిస్తూ.. సిట్ కాల పరిమితిని పొడిగిస్తూ ఏవైనా ఉత్తర్వులు ఇచ్చారా అని ప్రశ్నించగా.. ప్రస్తుతానికి ఆ సమాచారం తనవద్ద లేదని అదనపు ఏజీ చెప్పారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. సిట్ కాల పరిమితి ముగిసిందని కోర్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చిందని, అందువల్ల ఆ క్లబ్‌పై వారం పాటు ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. దీనిని సుధాకర్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించగా.. వారం పాటు ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ విచారణను గురువారానికి వాయిదా వేశారు.
వాల్తేర్ క్లబ్ భూములు ప్రభుత్వానివే
Published Thu, Jan 21 2021 4:27 AM | Last Updated on Thu, Jan 21 2021 4:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment