warangal bye election
-
గులాబీ తోటలో ఓట్ల తుఫాను
4,59,092 మెజారిటీతో వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు పార్టీ అభ్యర్థి దయాకర్ ఘన విజయం ఏకపక్షంగా తీర్పు ఇచ్చిన ఓటర్లు.. డిపాజిట్ కోల్పోయిన ప్రతిపక్షాలు రెండో స్థానంలో కాంగ్రెస్, మూడో స్థానంలో బీజేపీ-టీడీపీ కూటమి 59.42% ఓట్లు గులాబీ పార్టీకే... తెలంగాణలో ఇదే అత్యధిక మెజారిటీ.. దేశంలో 7వ అత్యధికం రిగ్గింగ్ జరిగిందంటూ బీజేపీ అభ్యర్థి ఫిర్యాదు సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘ఓరుగల్లు’ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ విజయ దుందుభి మోగించింది. మునుపటికన్నా భారీ మెజారిటీతో వరంగల్ లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఉప ఎన్నికలో ఓటర్లు ఏకపక్షంగా టీఆర్ఎస్కు విజయాన్ని కట్టబెట్టారు. ఆ పార్టీ అభ్యర్థి పసునూరి దయాకర్ 4,59,092 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. తెలంగాణలో అత్యధిక మెజారిటీతో ఎన్నికైన లోక్‌సభ సభ్యుడిగా పసునూరి రికార్డు నమోదు చేశారు. కాంగ్రెస్, బీజేపీ సహా వివిధ పార్టీల నుంచి, స్వతంత్రులుగా బరిలో నిలిచిన 22 మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. ప్రభుత్వ వ్యతిరేకత ఆధారంగా గెలుపు సాధిస్తామన్న కాంగ్రెస్ ఆశలు అడియాసలే అయ్యాయి. రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకునే ప్రయత్నం చేసిన బీజేపీని వరంగల్ ఓటర్లు కరుణించలేదు. టీడీపీతో పొత్తుతో బరిలో ఉండి కూడా బీజేపీ డిపాజిట్ దక్కించుకోలేపోయింది. అన్ని సెగ్మెంట్లలోనూ.. వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ టీఆర్ఎస్కు భారీ మెజారిటీ వచ్చింది. మొత్తంగా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 15,09,671 మంది ఓటర్లు ఉండగా... ఉప ఎన్నికలో 10,35,656 మంది ఓటు వేశారు. ఇందులో టీఆర్ఎస్కు 6,15,403, కాంగ్రెస్‌కు 1,56,311, బీజేపీకి 1,30,178, వైఎస్సార్సీపీకి 23,352, వామపక్షాల కూటమి అభ్యర్థికి 14,788 ఓట్లు వచ్చాయి. శ్రమజీవి పార్టీ తరఫున పోటీ చేసిన జాజుల భాస్కర్‌కు 28,541 ఓట్లు పోలయ్యాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం (ఈవీఎం)లో అభ్యర్థుల వరుసలో ఏడవ సంఖ్యలో ఉన్న భాస్కర్‌కు కెమెరా గుర్తు వచ్చింది. టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారును పోలి ఉండడంతో భాస్కర్‌కు ఎక్కువ ఓట్లు పోలైనట్లు అభిప్రాయపడుతున్నారు. తొలి రౌండ్ నుంచీ ఆధిక్యం.. వరంగల్‌లోని ఏనుమాముల మార్కెట్ యార్డులో మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవగా... తొలి రౌండ్ నుంచి చివరి రౌండ్ దాకా కూడా టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగింది. ఇక్కడ 2014 సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున కడియం శ్రీహరి 3,92,137 ఓట్లతో మెజారిటీతో గెలిచారు. అప్పట్లో ఇదే రికార్డు మెజారిటీగా నమోదుకాగా... ప్రస్తుత ఉప ఎన్నికలో పసునూరి దయాకర్ దాన్ని తిరగరాశారు. మొత్తంగా ఉప ఎన్నికలో పోలైన ఓట్లలో టీఆర్ఎస్కు 59.42 శాతం, కాంగ్రెస్‌కు 15.09 శాతం, బీజేపీకి 12.56 శాతం, వైఎస్సార్సీపీకి 2.25 శాతం, వామపక్షాల కూటమి అభ్యర్థికి 1.42 శాతం వచ్చాయి. కాగా.. ఈవీఎంలలో సాంకేతిక లోపాలున్నట్లు బీజేపీ అభ్యర్థి పగిడిపాటి దేవయ్య.. ఎన్నికల అధికారి వాకాటి కరుణకు ఫిర్యాదు చేశారు. దానివల్ల అధికార పార్టీకి ఏకపక్షంగా ఓట్లు వచ్చాయన్నారు. పరకాల నియోజకవర్గంలో వరికోల్ గ్రామంలోని 3, 4, 5 పోలింగ్ కేంద్రాల్లో 89 శాతం పోలింగ్ నమోదైందని... అందులో బీజేపీకి 3, కాంగ్రెస్‌కు ఒక ఓటు మాత్రమే వచ్చాయని పేర్కొన్నారు. రిగ్గింగ్ జరిగిందని, తిరిగి పోలింగ్ నిర్వహించాలని కోరారు. కాంగ్రెస్ ఎన్నికల ఏజెంట్ ఇ.వి.శ్రీనివాస్ ఈ ఫిర్యాదుపై సంతకం చేశారు. దానిని ఎన్నికల సంఘానికి పంపించారు. ఇది ఓ సామాన్య కార్యకర్త విజయంగా భావిస్తున్నా. కార్యకర్తగా ఉన్న నాకు పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ ఇచ్చి గెలిపించిన టీఆర్ఎస్కు, పార్టీ అధినేత కేసీఆర్‌కు రుణపడి ఉంటా. పేదలకు కేసీఆర్ అండగా ఉంటారనడానికి ఇదే నిదర్శనం. అత్యధిక మెజార్టీతో గెలిపించి దేశంలోనే గుర్తింపు తెచ్చిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. వరంగల్ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తా. - పసునూరి దయాకర్ వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీలకు వచ్చిన ఓట్లు.. -
మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు
-
నడిపించే నాయకుడేడీ...!!
వరంగల్ ఉపఎన్నికల ఫలితాలతో తెలంగాణలోని ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయి కుదేలైంది. ఈ ఫలితం కాంగ్రెస్‌లో తీవ్ర నిరాశా నిస్పృహలను నింపింది. పార్టీని నడిపించడానికి సరైన నాయకుడు లేనందువల్లే ఉపఎన్నికల్లో చేదు ఫలితాలు వచ్చాయని ఆ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. ఉపఎన్నిక విషయంలో అంతా ఒక్కటై పని చేయాల్సిన పరిస్థితుల్లో కూడా టీ-పీసీసీ నేతలు ఎవరికి వారే అన్నట్లు వ్యవహరించడం, టికెట్ ఖరారు చేసే విషయంలో కూడా సమన్వయం లేకపోవడం వంటి అనేక అంతర్గత సమస్యలు ఈ పరిస్థితిని తెచ్చాయని చెబుతున్నారు. వీటికి తోడు టీఆర్ఎస్ విషయంలో తమ అంచనాలు కూడా తారుమారయ్యాయని అంటున్నారు. అధికారం చేపట్టిన 17 నెలల తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని భావించిన కాంగ్రెస్ నేతలకు.. ఓరుగల్లు ప్రజల తీర్పు పెద్ద షాకిచ్చింది. గత ఎన్నికల్లో వచ్చినన్ని ఓట్లు కూడా సాధించుకోలేక చతికిలపడింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులతో పాటు దిగ్విజయ్‌సింగ్, గులాంనబీ ఆజాద్ వంటి జాతీయ నేతలను రప్పించి ప్రచారం చేయించినా డిపాజిట్ కూడా దక్కించుకోలేని పరిస్థితి రావడం ఆ పార్టీ నేతలను అంతర్మథనంలో పడేసింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ఈ ఉప ఎన్నిక ప్రభుత్వ పనితీరుకు రిఫరెండం అంటూ సవాలు చేశారు. నేతల మధ్య సమన్వయం లేకపోవడం, పార్టీలో అంతర్గత విభేదాలు, చిట్టచివరి నిమిషంలో అభ్యర్థిని మార్చడం లాంటి అనేక కారణాలు ఈ పరిస్థితికి కారణమయ్యాయని నేతలు తాజాగా విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న తమ అంచనా తప్పిందని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి స్వల్పకాలమే అయినందున ఆ ప్రభుత్వం పట్ల ప్రజలింకా నమ్మకంతో ఉన్నారని ఈ ఫలితాలతో తేలిందని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు విశ్లేషించారు. మొదట్లో స్థానిక కాంగ్రెస్ నేతలు నియోజకవర్గాల వానీగా సమావేశాలు నిర్వహించి శ్రేణుల్లో కొంత కదలిక తెచ్చారు. రాజయ్య ఎఫెక్ట్ ఉప ఎన్నిక నామినేషన్ దాఖలుకు చిట్టచివరి రోజున కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక.. తన ముగ్గురు పిల్లలతో కలిసి అనుమానాస్పద స్థితిలో మరణించడం, ఆ విషయంలో రాజయ్య, ఆయన కుటుంబ సభ్యులపై కేసులు నమోదు కావడం లాంటి పరిణామాలు కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేశాయి. దాంతో చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చాల్సి వచ్చింది. సర్వే సత్యనారాయణతో అప్పటికప్పుడు నామినేషన్ వేయించారు. సరైన సమన్వయం చేసేవారు లేకపోవడంతో సర్వేకు ఘోర పరాజయం తప్పలేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 2,69,065 ఓట్లు రాగా ఈసారి 1,55,957 ఓట్లు మాత్రమే రావడం, గతంతో పోల్చితే లక్షకు పైగా ఓట్లు తగ్గడం కాంగ్రెస్ నేతలను నివ్వెరపరిచింది. -
వీళ్లెవరూ మాకిష్టం లేదు
వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం ఉపఎన్నికలో పోటీచేసిన అభ్యర్థులెవరూ మాకు నచ్చలేదని పలువురు ఓటర్లు తేల్చిచెప్పారు. ఈ స్థానానికి జరిగిన ఉపఎన్నికల ఫలితాల్లో 7,753 మంది ఓటర్లు.. పోటీలో ఉన్న అభ్యర్థులెవరూ తమకు నచ్చలేదని చెబుతూ.. తమ ఓటును నోటా (నన్ ఆఫ్ ది ఎబో)కు వేశారు. ఈ ఉపఎన్నికలో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కలిపి మొత్తంగా 23 మంది బరిలో నిలిచారు. నియోజకవర్గంలో 15 లక్షల మందికి పైగా ఓటర్లు ఉండగా వారిలో 10 లక్షలకు పైగా (69 శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో 7,753 మంది పై వారెవరూ కాదు (నోటా) అన్న మీట నొక్కి అభ్యర్థులను తిరస్కరించారు. 2014 సాధారణ ఎన్నికల్లోనూ ఈ నియోజకవర్గంలో 14,034 మంది నోటా మీద ఓటు వేసి అభ్యర్థులను తిరస్కరించారు. -
షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు ప్రజలు రెడీ
వరంగల్ లోక్‌సభా స్థానానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికలలో ఉమ్మడి అభ్యర్థిని పోటీలో నిలబెట్టాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ - బీజేపీ నిర్ణయించాయి. రెండు పార్టీల సమన్వయ సమావేశం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ అన్ని రకాలుగా విఫలమైందని, ఎన్డీయే అభ్యర్థి గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమని కిషన్ రెడ్డి అన్నారు. వరంగల్ ప్రజలు టీఆర్ఎస్కు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్డీయే అభ్యర్థి గెలిస్తేనే కేంద్రానికి - రాష్ట్రానికి అనుసంధానంగా ఉంటారని ఆయన చెప్పారు. ఇక కేసీఆర్ ఫాంహౌస్‌కు మాత్రమే పరిమితం అవుతున్నారని, ఆయనది నిర్లక్ష్య పరిపాలన అని టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ తెలిపారు. మిత్రధర్మాన్ని పాటిస్తూ ఉమ్మడి అభ్యర్థిని గెలిపిస్తామని ఆయన చెప్పారు. -
వరంగల్ ఉపపోరుకు మోగిన భేరీ
కడియం శ్రీహరి రాజీనామాతో ఖాళీ అయిన వరంగల్ లోక్‌సభా స్థానానికి జరగాల్సిన ఉప ఎన్నికల షెడ్యూలు విడుదలైంది. కేంద్ర ఎన్నికల కమిషన్ దీంతోపాటు మరికొన్ని స్థానాలకు జరగాల్సిన ఉప ఎన్నికల షెడ్యూలును బుధవారం సాయంత్రం విడుదల చేసింది. అయితే, మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ ఉప ఎన్నికకు మాత్రం షెడ్యూలును ఎన్నికల కమిషన్ ప్రకటించలేదు. నవంబర్ 21వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. దీనికి ఈనెల 28వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఈ ఎన్నికకు సంబంధించి ముఖ్యమైన తేదీలు ఇలా ఉన్నాయి... అక్టోబర్ 28 - నోటిఫికేషన్ విడుదల నవంబర్ 4 - నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ నవంబర్ 5- నామినేషన్ల పరిశీలన నవంబర్ 7 - ఉపసంహరణకు తుది గడువు నవంబర్ 21 - ఉప ఎన్నికల పోలింగ్ నవంబర్ 24 - ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన